14 కార్లు.. 18 అడుగులు..
లండన్: చూస్తున్నారుగా.. కొంచెం పొట్టివాడైనా.. భలే గట్టివాడిలా కనిపిస్తున్న ఇతను కార్లు లాగడంలో మహా దిట్ట. అందుకే మరి.. 14 కార్లను ఒకేసారి 18 అడుగుల రెండు అంగుళాల దూరం వరకూ లాగి ‘అత్యధిక కార్లు లాగిన వ్యక్తి’గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. బ్రిటన్‌లోని సౌత్ డెర్బీషైర్‌కు చెందిన సైమన్ ప్లాంట్ అనే 42 ఏళ్ల ఈ రికార్డు వీరుడు బుధవారం మొత్తం 20 టన్నుల బరువైన 14 ఫోర్ట్ ఫీస్టాస్ కార్లను లాగేసి డెర్బీలోని మెట్రోపాయింట్ వద్ద ఈ అద్భుత ఫీట్ సాధించాడు.
గతంలో 12 కార్లను 15 అడుగులు లాగిన వ్యక్తి పేరు మీద రికార్డు ఉండగా, ఇదివరకే రెండు సార్లు ప్రయత్నించిన సైమన్ మూడో ప్రయత్నంలో ఆ రికార్డును బద్దలుకొట్టేశాడు. అన్నట్టూ.. 30 టన్నుల ట్రక్కును 100 అడుగులు లాగి 11 ఏళ్ల క్రితం కూడా సైమన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.