హార్ట్‌బీటే పాస్‌పోర్ట్‌.. ఏం కావాలన్నా క్షణాల్లో ప్రింట్‌ చేసుకుని తినడమే! | Travel will be like this by 2070 | Sakshi
Sakshi News home page

హార్ట్‌బీటే పాస్‌పోర్ట్‌.. ఏం కావాలన్నా క్షణాల్లో ప్రింట్‌ చేసుకుని తినడమే!

Published Wed, Mar 29 2023 4:25 AM | Last Updated on Wed, Mar 29 2023 4:52 PM

Travel will be like this by 2070 - Sakshi

ఏదో పనిమీద పక్క దేశానికి వెళ్తున్నారు. చేతిలో ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కానర్‌ ద్వారా నడిచి వెళ్లారు.అంతే చెకింగ్, ఇమిగ్రేషన్‌ గట్రా అన్నీ అయిపోయాయి. విమానంలో కూర్చోగానే..సీటు మీ శరీరానికి తగ్గట్టుగా మారిపోయింది. విమానం దిగి హోటల్‌కు వెళ్లగానే ఆకలేసింది.మనకు నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేయగానే.. ప్రింట్‌ చేసి తెచ్చి ఇచ్చేశారు..
ఇదేమిటి ఏదేదో చెప్పేస్తున్నారు అనిపిస్తోందా? భవిష్యత్తులో.. అంటే 2070 నాటికిప్రయాణం ఇలానే ఉంటుందట. ఆ వివరాలేమిటో చూద్దామా.. 

బ్రిటన్‌కు చెందిన ‘ది ఈజీ జెట్‌’ సంస్థమరో 50 ఏళ్ల తర్వాత ప్రయాణాల తీరుఎలా ఉంటుంది? సెలవులను ఎలాఎంజాయ్‌ చేస్తామన్న అంశంపై శాస్త్రవేత్తలు,నిపుణులతో మాట్లాడి ‘ది ఈజీ జెట్‌ 2070 ఫ్యూచర్‌ ట్రావెల్‌’పేరిట నివేదికను విడుదల చేసింది. లండన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బిర్గిట్టె అండర్సన్, డిజైన్‌ సైంటిస్ట్‌ మెలిస్సా స్టెర్రీ, క్రాన్‌ఫీల్డ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ గ్రాహం బ్రైత్‌వేట్‌లతో పాటు మరికొందరుతమ అంచనాలను వెల్లడించారు. జస్ట్‌ అలా నడిచివెళితే చాలు..

ప్రతి ఒక్కరి వేలిముద్ర, కంటి ఐరిస్‌ వేర్వేరుగా ఉన్నట్టే.. గుండె కొట్టుకునే సిగ్నేచర్‌ కూడా విభిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ సిగ్నేచర్‌ డేటాను స్టోర్‌ చేసి.. వ్యక్తిగత గుర్తింపు, పాస్‌పోర్టుగా వాడొచ్చంటున్నారు. ఉదాహరణకు విమానాశ్రయంలోని ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లగానే.. సెన్సర్లు, కెమెరాలు, ప్రత్యేక పరికరాలు స్పందిస్తాయి. ఐరిస్‌ స్కాన్, ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖం గుర్తింపు), హార్ట్‌బీట్‌ సిగ్నేచర్‌లను గుర్తించి.. గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేస్తాయి. ఇదంతా సెకన్లలోనే జరిగిపోతుంది. 

విమానంలో కూర్చోగానే.. 
ప్రయాణికులు విమానం ఎక్కి సీట్లోకూర్చోగానే.. వారి శరీరానికి తగినట్టు (సన్నగా, లావుగా, పొడవు, పొట్టి.. ఇలా) కాళ్లు గా సీటు ఆకృతి మారిపోతుంది. సీటుపై తలకు పక్కన అమర్చిన ప్రొజెక్టర్‌ నుంచి సరిగ్గా కళ్లకుముందు డిస్‌ప్లే ఏర్పడుతుంది. ఏ ఇబ్బందీ లేకుండా కావాల్సినవి వీక్షించవచ్చు. 

ఇల్లు–ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌– ఇల్లు 
ఉన్నచోటి నుంచే గాల్లోకి ఎగిరి ప్రయాణించి మళ్లీ అలాగే కిందకు దిగగలిగే (వీటీఓఎల్‌) ఎయిర్‌ ట్యాక్సీలు అంతటా అందుబాటులోకి వస్తాయి. ఇంటి దగ్గరే ఎయిర్‌ట్యాక్సీ ఎక్కి నేరుగావిమానాశ్రయం టెర్మినల్‌లో దిగడం.. ప్రయాణం చేశాక మళ్లీ టెర్మినల్‌ నుంచి నేరుగా ఇంటి వద్దదిగడం.. సాధారణంగా మారిపోతుంది. 

త్రీడీ ప్రింటెడ్‌ ఫుడ్‌.. కావాల్సినట్టు బెడ్‌ 
 మనకు నచ్చిన ఆహారాన్ని కాసేపట్లోనే ఫ్రెష్‌గా ప్రింట్‌ చేసి ఇచ్చే ‘ఫుడ్‌ త్రీడీ ప్రింటింగ్‌’మెషీన్లు అందుబాటులోకి వస్తాయి. అల్పాహారం నుంచి రాత్రి భోజనం దాకా ఏదైనా ప్రింట్‌ చేసుకుని తినేయడమే. 
హోటళ్లలో రూమ్‌లు ‘స్మార్ట్‌’గా మారిపోతాయి. మనం రూమ్‌కు వెళ్లే ముందే.. గదిలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో,లోపలికి వెళ్లగానే ఏదైనా సంగీతం ప్లేకావాలో, బెడ్‌ ఎంత మెత్తగాఉండాలో, గీజర్‌లో నీళ్లు ఎంత వేడితో ఉండాలో నిర్ణయించుకోవచ్చు. అందుకు తగినట్టుగా అన్నీ మారిపోతాయి. 
 మనకు కావాల్సిన మోడల్, డిజైన్, వస్త్రంతో డ్రెస్సులు కూడా త్రీడీ ప్రింటింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే మనం ఇక లగేజీ తీసుకెళ్లాల్సిన అవసరం దాదాపు లేనట్టే. 

ప్రత్యేక సూట్లతో ‘టైమ్‌ ట్రావెలింగ్‌’
హాలిడే కోసం ఏదైనా పర్యాటక ప్రాంతానికివెళ్లినప్పుడు ప్రత్యేకమైన ‘హాప్టిక్‌’సూట్లను వేసుకోవచ్చు. ఏదైనా ప్రదేశాన్ని చూస్తున్న సమయంలోనే వర్చువల్‌/అగుమెంటెడ్‌ రియాలిటీ ద్వారా.. అవి ఒకప్పుడు ఎలా ఉండేవి, ఎలా మారుతూవచ్చాయన్నది కళ్ల ముందే కనిపించే సదుపాయం వచ్చేస్తుంది. 

ఇతర భాషల్లో ఎవరైనా  మాట్లాడుతుంటే.. అప్పటికప్పుడు మనకు కావాల్సిన భాషలోకి మార్చి వినిపించే ‘ఇన్‌ ఇయర్‌’ పరికరాలు వస్తాయి. ఎక్కడైనా,ఏ భాష వారితోనైనా సులభంగా మాట్లాడొచ్చు. 
- సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement