లండన్: విధి నిర్వహణలో భాగంగా.. కంటికి రెప్పలా నవజాత శిశువుల్ని చూసుకోవాల్సిన నర్సు మానవత్వాన్ని సైతం మరిచి ఉన్మాదిగా మారింది. ఆసుపత్రిలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏడుగురు శిశువులను చంపేసింది. బ్రిటన్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో.. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఇంజెక్షన్ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా వారి కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా పంపడం, శ్వాసనాళాలకు అంతరాయం కలిగించడం.. పసికందుల్ని ఆ నరరూప రాక్షసి చేసిన పనులు. మరో ఆరుగురు శిశువులనూ చంపడానికి యత్నించినట్లు వెల్లడైంది. ఇంగ్లండ్‌లోని చెస్టర్‌లో కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న లూసీ లెబ్టీ(33) ఈ దారుణాలకు ఒడిగట్టింది. లూసీ 2015-16 మధ్య కాలంలో ఈ హత్యలకు పాల్పడింది. ఆస్పత్రిలో ఎటువంటి స్పష్టమైన కారణాలు లేకుండా, ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి ఏడుగురు శిశువులు మృతి చెందారు.
ఈ అన్ని సందర్భాల్లోనూ ఆస్పత్రి నవజాత శిశువుల వార్డులో లూసీ విధుల్లో ఉన్నట్లు తేలింది. భారతీయ మూలాలున్న వైద్యుడు రవి జయరాం సహా ఇతర వైద్యులు లూసీపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శిశుమరణాలపై 2017 మే నెలలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరకు ఆమెను మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం ఆమెను దోషిగా తేలింది. సోమవారం ఆమెకు శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఈ నరరూప రాక్షసికి ఎలాంటి శిక్షలు పడతాయో అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు.
‘నేను చెడ్డదాన్ని. నేనే ఇలా చేశాను. వారిని ఉద్దేశపూర్వకంగా చంపాను. ఎందుకంటే నేను వారిని చూసుకునేంత మంచిదాన్ని కాదు’ అని రాసి ఉన్న కాగితాలు ఆమె ఇంట్లో లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబరులో కోర్టు విచారణ మొదలైంది. అయితే, లెట్బీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నవజాత శిశువుల వార్డులో లోపాలను కప్పిపుచ్చేందుకే అక్కడి సీనియర్ వైద్యులు తనపై నిందలు మోపారని ఆమె తరఫు లాయర్ వాదించారు.పసిగుడ్డుల ప్రాణం తీయడానికి ఆమె ఎంచుకున్న మార్గాలు మానవత్వానికి మచ్చలా నిలిచాయనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment