నేరాంగీకారానికి అమెరికాతో ఒప్పందం
బ్రిటన్ జైలు నుంచి విడుదలైన వికీలీక్స్ వ్యవస్థాపకుడు
నేడు అమెరికా అ«దీనంలోని మరియానా ద్వీపంలో కోర్టు ముందుకు
శిక్ష నుంచి మినహాయింపు,ఆ వెంటనే విడుదల!
తర్వాత నేరుగా స్వదేశం ఆ్రస్టేలియాకు
వాషింగ్టన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. ఆయనను అమెరికాకు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదేళ్లుగా బ్రిటన్లో ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నారు. అమెరికా న్యాయ విభాగంతో నేరాంగీకార ఒప్పందం కుదుర్చుకోవడంతో అసాంజ్ విడుదలకు మార్గం సుగమమయ్యింది. దాని ప్రకారం అమెరికా కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు యూకే జైలు నుంచి ఆయన మంగళవారం ఉదయం విడుదలయ్యారు.
చార్టర్డ్ విమానంలో ఉత్తర మరియానా ఐలాండ్స్‌లోని సైపన్ ద్వీపానికి బయల్దేరారు. అక్కడి అమెరికా ఫెడరల్ కోర్టులో బుధవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) విచారణకు హాజరవుతారు. అమెరికా వెళ్లడానికి అసాంజ్ నిరాకరించడంతో ఆ్రస్టేలియా సమీపంలో అమెరికా అ«దీనంలో ఉండే ఈ ప్రాంతంలో విచారణ చేపడుతున్నారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం... గూఢచర్య చట్టాన్ని అతిక్రమిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలను అసాంజ్ అంగీకరించనున్నట్లు సమాచారం.
ఆయనపై మోపిన 18 అభియోగాలను కలిపి ఒకే కేసుగా విచారించనున్నట్లు తెలుస్తోంది. అసాంజ్ నేరాంగీకార వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం ఆయనకు శిక్ష ఖరారు చేస్తారు. ఇప్పటికే బ్రిటన్‌లో అనుభవించిన ఐదేళ్ల శిక్షతో సరిపెట్టి విడుదల చేస్తారని సమాచారం. అదే జరిగితే ఆ వెంటనే అసాంజ్ నేరుగా స్వదేశం ఆ్రస్టేలియాకు వెళ్లనున్నారు.
ధ్రువీకరించిన వికీలీక్స్
అసాంజ్ విడుదలను వికీలీక్స్ సంస్థ ధ్రువీకరించింది. ఈ మేరకు సామాజిక వేదిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘1,901 రోజుల జైలు జీవితం అనంతరం ఆయన జూన్ 24న విడుదలయ్యారు. అసాంజ్ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతిచ్చినవారికి కృతజ్ఞతలు’’ అని తెలిపింది.
ఇదీ నేపథ్యం
ఇరాక్, అఫ్గానిస్తాన్ తదితర చోట్ల అమెరికా సైన్యం పాల్పడ్డ తప్పిదాలు, చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించిన లక్షలాది రహస్య పత్రాలను లీక్ చేసి అసాంజ్ సంచలనం సృష్టించడం తెలిసిందే. దాంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అసాంజ్ స్థాపించిన వికీలీక్స్ అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలెన్నింటినో విడుదల చేసింది. బాగ్దాద్‌పై 2010లో అమెరికా వైమానిక దాడిలో ఇద్దరు రాయిటర్ జర్నలిస్టులతో పాటు సామాన్యులు మృతి చెందిన వీడియో వంటివి వీటిలో ఉన్నాయి.
అఫ్గాన్ యుద్ధానికి సంబంధించి 91,000కు పైగా పత్రాలనూ వికీలీక్స్ విడుదల చేసింది. తర్వాత ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను విడుదల చేసింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపడంతో అసాంజ్‌పై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. మరోవైపు లైంగిక నేరాల ఆరోపణలపై అసాంజ్ అరెస్టుకు స్వీడన్ కోర్టు 2010 నవంబర్‌లో ఆదేశించింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.
అరెస్టు... ఆశ్రయం జైలు
అసాంజ్ 2010 అక్టోబర్‌లో బ్రిటన్‌లో అరెస్టయ్యారు. తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. అయితే ఆయన్ను స్వీడన్‌కు అప్పగించాలని 2011 ఫిబ్రవరిలో లండన్ కోర్టు ఆదేశించింది. దీనిపై బ్రిటన్ సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా లాభం లేకపోయింది. దాంతో అసాంజ్ కొంతకాలం లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం పొందారు. 2019 ఏప్రిల్‌లో ఆ ఆశ్రయం రద్దయింది. అనంతరం బ్రిటన్ కోర్టు ఆయనకు 50 వారాల జైలు శిక్ష విధించింది. అమెరికాకు అప్పగింతపై విచారణ పెండింగ్‌లో ఉండటంతో శిక్ష పూర్తయ్యాక కూడా జైలులోనే ఉన్నారు. అసాంజ్ ఆత్మహత్య చేసుకునే ప్రమాదమున్నందున అమెరికాకు అప్పగించడం కుదరదని బ్రిటన్ కోర్టు 2021లో చెప్పింది.
ఉత్కంఠగా ఉంది భార్య
అసాంజ్ భార్య స్టెల్లా ఆస్ట్రేలియాలో మీడియాతో మాట్లాడారు. భర్త రాక కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. న్యాయవాది అయిన ఆమె అసాంజ్‌ను 2022లో ఆయన జైల్లో ఉండగానే పెళ్లాడారు. అసాంజ్ చార్టర్డ్ విమాన ప్రయాణ ఖర్చు 5 లక్షల డాలర్లని ఆయన అభిమానులు తెలిపారు. ఆ మొత్తాన్ని సేకరించడానికి ఫండ్ రైజింగ్ ప్రచారం మొదలు పెట్టామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment