జోహర్ బహ్రు (మలేసియా): సుల్తాన్ జోహర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో భారత కుర్రాళ్లు 6–4 గోల్స్ తేడాతో బ్రిటన్ జట్టును కంగుతినిపించారు. మ్యాచ్ ఆరంభమైన కొన్ని నిమిషాలకే ఆటగాళ్ల దాడులు మొదలయ్యాయి. ఈ క్రమంలో బోణీ బ్రిటన్ 2వ నిమిషంలో కొడితే... ఆఖరుదాకా భారత్ అదరగొట్టింది. మొహ్మద్ కొనయిన్ దాద్ ఏడో నిమిషంలో భారత్ ఖాతా తెలిచాడు. మొదటి పది నిమిషాల్లోపే ఒకసారి 1–1తో... తర్వాత 20వ నిమిషంలో రెండో సారి 2–2తో స్కోరు సమమైంది.
ఇక అక్కడి నుంచి భారత్ ప్రతాపానికి పైమెట్టుగా సాగింది. దిల్‌రాజ్ సింగ్ (17వ, 50వ నిమిషాల్లో), శారదానంద్ తివారీ (20వ, 50వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయడంతో బ్రిటన్ ఇక మ్యాచ్‌లో తేరుకోలేకపోయింది. మధ్యలో మన్‌మీత్ సింగ్ (26వ ని.లో) గోల్ సాధించడంతో ఒక దశలో భారత్ 4–2తో ఆధిక్యాన్ని అమాంతం పెంచుకుంది.
ప్రత్యర్థి జట్టులో రోరి పెన్‌రోజ్ (2వ, 15వ ని.లో), మైకేల్ రాయ్‌డెన్ (46వ, 59వ ని.లో) చెరో రెండు గోల్స్‌లో చేసి అంతరాన్ని అయితే తగ్గించగలిగారు కానీ... భారత్ ధాటి నుంచి పరాజయాన్ని తప్పించలేకపోయారు. ఆరంభంలోనే బ్రిటన్ శిబిరం గోల్ చేయడంతో భారత రక్షణ పంక్తి తమ లోపాలను వెంటనే సరిదిద్దుకుంది.
దీనికితోడు స్ట్రయికర్లు కూడా క్రమం తప్పకుండా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై విజయవంతంగా లక్ష్యంపై గురిపెట్టడంతో భారత్ విజయం సులువైంది. తొలిమ్యాచ్‌లో భారత్ 4–2తో జపాన్‌ను చిత్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment