న్యూఢిల్లీ: మలేసియాలో యువ భారత్ జట్టు గర్జించింది. అమెరికాపై గోల్స్ వర్షం కురిపించింది. సుల్తాన్ జోహర్ కప్ హాకీ టోర్నమెంట్‌లో జూనియర్ ప్రపంచ చాంపియన్ అయిన భారత జట్టు హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. జోహర్ బాహ్రులో బుధవారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 22–0 గోల్స్‌తో అమెరికాను చిత్తు చిత్తుగా ఓడించింది. కుర్రాళ్ల ప్రదర్శన చూస్తుంటే అలనాటి సీనియర్ జట్టు సాధించిన విజయాలు గుర్తొచ్చాయి. 1932 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో భారత్ 24–1తో అమెరికాపై ఘనవిజయం సాధించింది. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లోనూ భారత్ 16–0తో అమెరికాను చిత్తు చేసింది. ఆట రెండో నిమిషంలోనే ప్రతాప్ లాక్రా కొట్టిన గోల్‌తో బోణీ చేసిన భారత ఆటగాళ్లు ఆ తర్వాత రెచ్చిపోయారు.
హర్మన్‌జీత్ సింగ్ ఐదు గోల్స్ (25వ, 26వ, 40వ, 45వ, 52వ నిమిషాల్లో), అభిషేక్ నాలుగు గోల్స్ (28వ, 37వ, 38వ, 45వ ని.లో) చేయగా... దిల్‌ప్రీత్ సింగ్ (3వ, 54వ, 59వ ని.లో), విశాల్ అంటిల్ (2వ, 30వ, 44వ ని.లో) మూడు చొప్పున గోల్స్ సాధించారు. మణీందర్ సింగ్ (42వ, 43వ ని.లో) రెండు గోల్స్ చేయగా... రబిచంద్ర మొరైంగ్తమ్ (7వ ని.లో), శిలానంద్ లాక్రా (47వ ని.లో), రౌషన్ కుమార్ (37వ ని.లో), వివేక్ ప్రసాద్ (48వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. భారత జట్టులో ఏకంగా 10 మంది ఆటగాళ్లు గోల్స్ చేయడం విశేషం. నేడు (గురువారం) జరిగే పోరులో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది..
భారత్ 22 అమెరికా 0
Published Thu, Oct 26 2017 12:42 AM | Last Updated on Thu, Oct 26 2017 1:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment