Sultan johar Cup hockey tournament
-
యువ భారత్ ‘హ్యాట్రిక్’
కౌలాలంపూర్: సుల్తాన్ జొహర్ కప్ అండర్–21 పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆతిథ్య మలేసియా జట్టుతో మంగళవారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున శారదానంద్ తివారీ (11వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (13వ నిమిషంలో), తాలెమ్ ప్రియోబర్తా (39వ నిమిషంలో), రోహిత్ (40వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మలేసియా జట్టుకు మొహమ్మద్ డానిష్ (8వ నిమిషంలో), హారిస్ ఉస్మాన్ (9వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు, మలేసియా జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐదు పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. -
యువ భారత్‌కు రెండో విజయం
జోహర్ బహ్రు (మలేసియా): సుల్తాన్ జోహర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో భారత కుర్రాళ్లు 6–4 గోల్స్ తేడాతో బ్రిటన్ జట్టును కంగుతినిపించారు. మ్యాచ్ ఆరంభమైన కొన్ని నిమిషాలకే ఆటగాళ్ల దాడులు మొదలయ్యాయి. ఈ క్రమంలో బోణీ బ్రిటన్ 2వ నిమిషంలో కొడితే... ఆఖరుదాకా భారత్ అదరగొట్టింది. మొహ్మద్ కొనయిన్ దాద్ ఏడో నిమిషంలో భారత్ ఖాతా తెలిచాడు. మొదటి పది నిమిషాల్లోపే ఒకసారి 1–1తో... తర్వాత 20వ నిమిషంలో రెండో సారి 2–2తో స్కోరు సమమైంది. ఇక అక్కడి నుంచి భారత్ ప్రతాపానికి పైమెట్టుగా సాగింది. దిల్‌రాజ్ సింగ్ (17వ, 50వ నిమిషాల్లో), శారదానంద్ తివారీ (20వ, 50వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయడంతో బ్రిటన్ ఇక మ్యాచ్‌లో తేరుకోలేకపోయింది. మధ్యలో మన్మీత్ సింగ్ (26వ ని.లో) గోల్ సాధించడంతో ఒక దశలో భారత్ 4–2తో ఆధిక్యాన్ని అమాంతం పెంచుకుంది. ప్రత్యర్థి జట్టులో రోరి పెన్రోజ్ (2వ, 15వ ని.లో), మైకేల్ రాయ్‌డెన్ (46వ, 59వ ని.లో) చెరో రెండు గోల్స్‌లో చేసి అంతరాన్ని అయితే తగ్గించగలిగారు కానీ... భారత్ ధాటి నుంచి పరాజయాన్ని తప్పించలేకపోయారు. ఆరంభంలోనే బ్రిటన్ శిబిరం గోల్ చేయడంతో భారత రక్షణ పంక్తి తమ లోపాలను వెంటనే సరిదిద్దుకుంది. దీనికితోడు స్ట్రయికర్లు కూడా క్రమం తప్పకుండా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై విజయవంతంగా లక్ష్యంపై గురిపెట్టడంతో భారత్ విజయం సులువైంది. తొలిమ్యాచ్‌లో భారత్ 4–2తో జపాన్ను చిత్తు చేసింది. -
జూనియర్ల జయభేరి
జొహర్ (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్ హాకీ టోర్నమెంట్లో యువ భారత జట్టు శుభారంభం చేసింది. మలేసియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో శనివారం భారత్ 4–2తో జపాన్ను చిత్తు చేసింది. హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేశ్ జాతీయ జూనియర్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆడిన తొలి మ్యాచ్‌లో యంగ్ ఇండియా అదరగొట్టింది. భారత్ తరఫున అమీర్ అలీ (12వ నిమిషంలో), గుర్జోత్ సింగ్ (36వ నిమిషంలో), ఆనంద్ సౌరభ్ (44వ నిమిషంలో), అంకిత్ పాల్ (47వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున సుబాస తనాకా (26వ ని.లో), రకుసై యమనకా (57వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత జట్టు అటాకింగ్ గేమ్ కొనసాగించింది. ఒలింపిక్స్‌లో భారత జట్టు రెండు కాంస్య పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించి... పారిస్ విశ్వక్రీడల తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలికిన గోల్ కీపర్ శ్రీజేశ్ మార్గనిర్దేశనంలో కుర్రాళ్లు సత్తా చాటారు. తొలి క్వార్టర్లో జపాన్ రక్షణ వలయాన్ని చేధించుకుంటూ ముందుకు వెళ్లిన అమీర్ అలీ తొలి గోల్ అందించి జట్టుకు ఆధిక్యం అదించాడు. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం పట్టు కొనసాగించాలంటే మ్యాచ్‌లో ఎక్కువ శాతం ఫీల్డ్ గోల్స్ కొట్టాలని పదే పదే చెప్పే శ్రీజేశ్... కోచ్‌గా తొలి మ్యాచ్‌లోనే కుర్రాళ్లతో ఆ పని చేసి చూయించాడు. అయితే కాసేపటికే సుబాస తనాకా గోల్ కొట్టడంతో జపాన్ స్కోరు సమం చేయగలిగింది. మూడో క్వార్టర్లో భారత్ రెండు గోల్స్ కొట్టి ఆధిక్యం కనబర్చగా... చివరి క్వార్టర్లో అంకిత్ పాల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి యంగ్ ఇండియా ఆధిక్యం మరింత పెంచగా... మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... జపాన్ ఓ గోల్ చేసింది. నేడు గ్రేట్ బ్రిటన్‌తో భారత జట్టు తలపడనుంది. -
భారత్ 22 అమెరికా 0
న్యూఢిల్లీ: మలేసియాలో యువ భారత్ జట్టు గర్జించింది. అమెరికాపై గోల్స్ వర్షం కురిపించింది. సుల్తాన్ జోహర్ కప్ హాకీ టోర్నమెంట్లో జూనియర్ ప్రపంచ చాంపియన్ అయిన భారత జట్టు హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. జోహర్ బాహ్రులో బుధవారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 22–0 గోల్స్‌తో అమెరికాను చిత్తు చిత్తుగా ఓడించింది. కుర్రాళ్ల ప్రదర్శన చూస్తుంటే అలనాటి సీనియర్ జట్టు సాధించిన విజయాలు గుర్తొచ్చాయి. 1932 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో భారత్ 24–1తో అమెరికాపై ఘనవిజయం సాధించింది. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లోనూ భారత్ 16–0తో అమెరికాను చిత్తు చేసింది. ఆట రెండో నిమిషంలోనే ప్రతాప్ లాక్రా కొట్టిన గోల్‌తో బోణీ చేసిన భారత ఆటగాళ్లు ఆ తర్వాత రెచ్చిపోయారు. హర్మన్‌జీత్ సింగ్ ఐదు గోల్స్ (25వ, 26వ, 40వ, 45వ, 52వ నిమిషాల్లో), అభిషేక్ నాలుగు గోల్స్ (28వ, 37వ, 38వ, 45వ ని.లో) చేయగా... దిల్‌ప్రీత్ సింగ్ (3వ, 54వ, 59వ ని.లో), విశాల్ అంటిల్ (2వ, 30వ, 44వ ని.లో) మూడు చొప్పున గోల్స్ సాధించారు. మణీందర్ సింగ్ (42వ, 43వ ని.లో) రెండు గోల్స్ చేయగా... రబిచంద్ర మొరైంగ్తమ్ (7వ ని.లో), శిలానంద్ లాక్రా (47వ ని.లో), రౌషన్ కుమార్ (37వ ని.లో), వివేక్ ప్రసాద్ (48వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. భారత జట్టులో ఏకంగా 10 మంది ఆటగాళ్లు గోల్స్ చేయడం విశేషం. నేడు (గురువారం) జరిగే పోరులో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.. -
పాక్ ఆడుతోందా... అయితే మేము ఆడం!
జొహర్ కప్ హాకీ టోర్నీకి భారత్ దూరం న్యూఢిల్లీ: మలేసియాలో జరిగే సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్ హాకీ టోర్నమెంట్ నుంచి భారత్ వరుసగా రెండో ఏడాది తప్పుకుంది. అండర్–21 స్థాయిలో జరిగే ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు ఆడుతుండటమే అందుకు కారణం. 2014లో చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో భారత్‌ను ఓడించిన తర్వాత పాక్ ఆటగాళ్లు భారత ప్రేక్షకుల వైపు అసభ్యకర సైగలు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా భావించిన హాకీ ఇండియా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అప్పటి నుంచి పాక్ బరిలో నిలిచే టోర్నీలో ఆడరాదని నిర్ణయం తీసుకుంది. ‘సుల్తాన్ జొహర్ కప్ ఆహ్వానిత టోర్నీ మాత్రమే. అందులో పాల్గొనడం తప్పనిసరి కూడా కాదు. కాబట్టి మా గత నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం’ అని హాకీ ఇండియా ప్రతినిధి ఆర్పీ సింగ్ స్పష్టం చేశారు.