భారత్‌కు ‘డ్రా’నందం...
► బ్రిటన్‌తో మ్యాచ్ 2–2తో సమం
► అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ
ఇపో (మలేసియా): రెండుసార్లు ఆధిక్యంలోకి వెళ్లి దానిని కాపాడుకోలేకపోయిన భారత పురుషుల హాకీ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో శుభారంభం చేయాల్సిన చోట భారత జట్టు ‘డ్రా’తో గట్టెక్కింది. బ్రిటన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ను టీమిండియా 2–2తో ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (19వ నిమిషంలో), మన్‌దీప్ సింగ్ (48వ నిమిషంలో)... బ్రిటన్ తరఫున టామ్ కార్సన్ (25వ నిమిషంలో), అలెన్ ఫోర్సిత్ (52వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ 57 సెకన్లలో ముగుస్తుందనగా బ్రిటన్‌కు పెనాల్టీ కార్నర్ దక్కింది.
అయితే బ్రిటన్ కెప్టెన్ ఫిల్ రోపర్ డ్రాగ్ ఫ్లిక్ మైదానం బయటకు వెళ్లడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ‘డ్రా’ కారణంగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభిం చింది. గతేడాది లండన్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో చివరిసారి బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–2తో ఓడిపోయిన భారత్ ఈసారి విజయావకాశాలను వదులుకుంది. ఉరుములు, మెరుపులతో కూడిన ప్రతికూల వాతావరణం కారణంగా నిర్ణీత సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఆదివారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.