Azlan Shah Cup hockey tournament
-
భారత్ గోల్స్ గర్జన
ఇపో (మలేసియా): అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ గోల్స్ సునామీతో పోలాండ్‌ను చిత్తు చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 10–0 గోల్స్‌తో పోలాండ్‌పై జయభేరి మోగించింది. స్ట్రయికర్ మన్దీప్ సింగ్ తన జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. అతను (50వ, 51వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. డ్రాగ్‌ఫ్లికర్ వరుణ్ కుమార్ (18వ, 25వ ని.లో) కూడా రెండు గోల్స్ సాధించగా, వివేక్ సాగర్ ప్రసాద్ (1వ ని.లో), సుమిత్ కుమార్ (7వ ని.లో), సురేందర్ కుమార్ (19వ ని.లో) సిమ్రన్‌జీత్ సింగ్ (29వ ని.లో), నీలకంఠ శర్మ (36వ ని.లో), అమిత్ రోహిత్‌దాస్ (55వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లోనే కాదు... ఈ టోర్నీలోనే భారత్ అద్భుతంగా రాణించింది. ఐదుసార్లు అజ్లాన్ షా చాంపియన్ అయిన భారత్ ఆరంభం నుంచే పోలాండ్‌పై గర్జించింది. తొలి క్వార్టర్‌ను 2–0తో ముగించిన భారత్ రెండో క్వార్టర్లో స్కోరును 4–0తో రెట్టింపు చేసుకుంది. చివరి క్వార్టర్లో మరో మూడు గోల్స్‌తో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ టోర్నీలో భారత్ అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ ఫలితం కంటే ముందే ఫైనల్ చేరిన భారత్ నేడు జరిగే టైటిల్ పోరులో కొరియాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
‘సుల్తాన్’ ఎవరో?
ఇపో (మలేసియా): గతేడాది నిరాశాజనక ఫలితాలను వెనక్కి నెట్టి కొత్త సీజన్‌ను ఆశావహంగా ప్రారంభించాలనే లక్ష్యంతో భారత పురుషుల హాకీ జట్టు సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నమెంట్ బరిలోకి దిగుతోంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు ఆతిథ్య మలేసియా, ఆసియా క్రీడల చాంపియన్ జపాన్, దక్షిణ కొరియా, కెనడా, పోలాండ్ జట్లు పోటీపడుతున్నాయి. తొలి రోజు జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్‌తో భారత్ తలపడుతుంది. జపాన్‌తో జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో భారత్‌నే విజయం వరించింది. ఆ తర్వాత భారత్... 24న దక్షిణ కొరియాతో; 26న మలేసియాతో; 27న కెనడాతో; 29న పోలాండ్‌తో భారత్ తలపడుతుంది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 30న ఫైనల్ జరుగుతుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు కాంస్యం కోసం పోటీపడతాయి. చీఫ్ కోచ్ లేకపోవడం, గాయాల తో ప్రధాన ఆటగాళ్లు దూరమైనా ఈ టోర్నీ లో మంచి ప్రదర్శన చేస్తామని భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. గతేడాది ఈ టోర్నీ లో భారత్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 36 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్ ఇప్పటివరకు ఐదుసార్లు విజేతగా నిలిచి, రెండుసార్లు రన్నరప్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఏడుసార్లు మూడో స్థానాన్ని దక్కించుకుంది. -
భారత్‌ను గెలిపించిన హర్మన్‌ప్రీత్
ఇపో (మలేసియా): తొలి మ్యాచ్‌లో విజయావకాశాలను వదులుకుని ‘డ్రా’తో సరిపెట్టుకున్నా... ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు చెలరేగింది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 3–0తో ఘనవిజయం సాధించింది. డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచి భారత్ విజయంలో కీలకపాత్ర వహించాడు. అంతకుముందు 23వ నిమిషంలో మన్దీప్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అయితే తొలి క్వార్టర్లో కివీస్ చేసిన మూడు గోల్ ప్రయత్నాలను కీపర్ శ్రీజేష్ వమ్ము చేశాడు. ఇక 27వ నిమిషంలో లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచడంతో భారత్ ఆధిక్యం 2–0కి పెరిగింది. అలాగే 47వ నిమిషంలోనూ హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చి భారత్ ఖాతాలో మూడో గోల్ చేర్చి విజయం ఖాయం చేశాడు. రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. ఎస్వీ సునీల్ ః 200 భారత హాకీ ప్లేయర్ ఎస్వీ సునీల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మలేసియాలో జరుగుతున్న అజ్లాన్‌షా హాకీ టోర్నీలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా 200 అంతర్జాతీయ మ్యాచ్‌ల్ని పూర్తి చేసుకున్నాడు. 2007 ఆసియా కప్ సందర్భంగా అరంగేట్రం చేసిన సునీల్..పదేళ్ల వ్యవధిలో ఈ ఘనతను పూర్తి చేశాడు. 2016 ఉత్తమ ఆసియా ప్లేయర్‌గా నిలిచాడు. ఈక్రమంలో 2014 ఆసియా గేమ్స్‌లో భారత్ చాంపియన్‌గా నిలిచిన జట్టులో సభ్యుడైన సునీల్.. 2015 వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నీలో జట్టు కాంస్యం సాధించడంలో పాత్ర పోషించాడు. మరోవైపు 2012, 2016 ఒలింపిక్స్ల్లో జట్టు తరఫున పాల్గొన్నాడు. -
భారత్‌కు ‘డ్రా’నందం...
► బ్రిటన్‌తో మ్యాచ్ 2–2తో సమం ► అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ ఇపో (మలేసియా): రెండుసార్లు ఆధిక్యంలోకి వెళ్లి దానిని కాపాడుకోలేకపోయిన భారత పురుషుల హాకీ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్లో శుభారంభం చేయాల్సిన చోట భారత జట్టు ‘డ్రా’తో గట్టెక్కింది. బ్రిటన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ను టీమిండియా 2–2తో ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (19వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (48వ నిమిషంలో)... బ్రిటన్ తరఫున టామ్ కార్సన్ (25వ నిమిషంలో), అలెన్ ఫోర్సిత్ (52వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ 57 సెకన్లలో ముగుస్తుందనగా బ్రిటన్‌కు పెనాల్టీ కార్నర్ దక్కింది. అయితే బ్రిటన్ కెప్టెన్ ఫిల్ రోపర్ డ్రాగ్ ఫ్లిక్ మైదానం బయటకు వెళ్లడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ‘డ్రా’ కారణంగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభిం చింది. గతేడాది లండన్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో చివరిసారి బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–2తో ఓడిపోయిన భారత్ ఈసారి విజయావకాశాలను వదులుకుంది. ఉరుములు, మెరుపులతో కూడిన ప్రతికూల వాతావరణం కారణంగా నిర్ణీత సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఆదివారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.