
ఇప్పటికే 100 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
లండన్: వలసలకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు ఇచ్చిన పిలుపుతో బ్రిటన్‌వ్యాప్తంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. లివర్‌పూల్, హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్‌పూల్, స్టోక్ ఆన్ ట్రెంట్, బెల్‌ఫాస్ట్, నాటింగ్‌హామ్, మాంచెస్టర్‌లలో శనివారం వలసదారులుండే హోటళ్లపై దాడులు జరిగాయి. పలు చోట్ల పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగారు. 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతివాదుల చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రధాని కెయిర్ స్టార్మర్ ఆదేశించారు. నేరపూరిత చర్యలకు తగు మూల్యం తప్పదని హోం మంత్రి వివెట్ కూపర్ హెచ్చరించారు. ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ (ఈడీఎల్) అనే గ్రూపు ఈ గొడవలకు కారణమని చెబుతున్నారు. వారం క్రితం సౌత్‌పోర్ట్‌లో కత్తిపోట్లకు ముగ్గురు చిన్నారులు బలైన ఘటన అనంతరం వలసదారులే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. శరీరం రంగును బట్టి దాడులు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.