లండన్: మూడు క్రీడాంశాల సమాహారమైన ట్రయాథ్లాన్‌లో (1500 మీటర్ల స్విమ్మింగ్, 40 కిలోమీటర్ల సైక్లింగ్, 10 కిలోమీటర్ల రన్నింగ్) తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న బ్రిటన్ స్టార్, రెండు వరుస ఒలింపిక్స్ చాంపియన్ అలిస్టర్ బ్రౌన్‌లీ తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అతను లండన్ (2012), రియో (2016) ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాలు గెలుపొందాడు.
అంతకుముందు ఈ స్టార్ 2009, 2011లలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ల్లోనూ చాంపియన్‌గా నిలిచాడు. మరో నాలుగుసార్లు యూరోపియన్ చాంపియన్‌గా ఘనత వహించాడు. తన విజయవంతమైన కెరీర్‌కు బైబై చెప్పేందుకు ఇదే సరైన సమయమన్నాడు.
‘ఎక్స్’లో తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన అతను ‘ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రొఫెషనల్ కెరీర్‌లో ఎన్నో విజయాలు చవిచూసిన నాకు ఇప్పుడీ క్షణాలు ఓ వైపు ఉత్సాహాన్ని.. మరోవైపు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి’ అని ట్వీట్ చేశాడు.
ఇప్పుడు సరికొత్త సవాళ్లపై దృష్టి పెడతానని చెప్పాడు. 36 ఏళ్ల వయసులో మళ్లీ స్టార్ట్ లైన్ వద్ద నిల్చొలేనని, ఇందుకోసం శ్రమించలేనని అన్నాడు. 2012, 2016... ఈ రెండు సార్లు అతని సోదరుడు జొనాథన్ (జానీ) బ్రౌన్‌లీ కూడా పతకాలు నెగ్గడం మరో విశేషం! లండన్‌లో కాంస్యం నెగ్గిన జానీ... రియోలో రజతం గెలిచాడు.
‘బిల్లీ జీన్ కింగ్ కప్’ చాంపియన్ ఇటలీ
మలాగా (స్పెయిన్): మహిళల ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ ‘బిల్లీ జీన్ కింగ్ కప్’లో ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇటలీ 2–0తో స్లొవేకియా జట్టును ఓడించింది. తొలి మ్యాచ్‌లో లూసియా బ్రాంజెట్టి 6–2, 6–4తో విక్టోరియా రుంకకోవాను ఓడించగా... రెండో మ్యాచ్‌లో జాస్మిన్ పావోలిని 6–2, 6–1తో రెబెకా స్రామ్‌కోవాపై నెగ్గడంతో ఇటలీ విజయం ఖరారైంది.
ఓవరాల్‌గా ఇటలీకిది ఐదో బిల్లీ జీన్ కింగ్ కప్ టైటిల్. ఆ జట్టు చివరి సారి 2013లో ఈ టైటిల్‌ను సాధించింది. 2013లో విజేత జట్టులో సభ్యురాలిగా ఉన్న సారా ఎరాని ఈసారీ జట్టులో ఉండటం విశేషం. ప్రపంచ నాలుగో ర్యాంకర్ జాస్మిన్ ప్రదర్శన ఇటలీ విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ ఏడాది జాస్మిన్ అద్భుతంగా రాణించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో... వింబుల్డన్ టోర్నీలో సింగిల్స్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment