సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతం అయ్యిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. రైతులకు తోడుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
‘‘ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దంపట్టింది. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘చంద్రబాబూ.. ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ప్రతిఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20వేలు ఎందుకు ఇవ్వడంలేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యంచేసి, ఇ-క్రాప్‌ను గాలికి వదిలేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహించి, ధాన్యం కొనుగోళ్లను మధ్యవర్తులకు, మిల్లర్లకు అప్పగించడంవల్ల ఇవాళ ప్రతి బస్తాకు రూ.300-400లు నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్పా? తమకు కనీస మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా?
..దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకు వస్తే, ఆ ఉచిత పంటలబీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి తమపై అదనపు భారం వేస్తున్నారని రైతులంతా నిలదీయడం తప్పా? ఈ అంశాలపై కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించకూడదా? తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు ఇది కూడా చేయకూడదని అడ్డుపడ్డం చంద్రబాబుగారి రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ చెప్పారు.
దగాపాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయ్యింది. @ncbn గారు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి…
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024
‘‘మరోవైపు నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులతో కలిసి చంద్రబాబు చేస్తున్నవి దుర్మార్గాలు కావా? నో డ్యూ సర్టిఫికెట్లు వీఆర్వోలు గ్రామ సచివాలయాల్లోనే ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వనీయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? తహశీల్దార్ కార్యాలయాలకు రమ్మని చెప్పి, అక్కడ పోలీసుల సమక్షంలోనే టీడీపీ వారిచేత దాడులు చేయించడం న్యాయమేనా? నో డ్యూ సర్టిఫికెట్లు గ్రామస్థాయిలో ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడం నేరం కాదా? ఈ దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు చేయడం మీ అరాచకపాలనకు నిదర్శనం కాదా?
..ఎంపీ అవినాష్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? అలాంటప్పుడు నీటిసంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? మీకు నచ్చినవారిని నామినేట్ చేసుకుంటే సరిపోతుందిగా? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామని ఓవైపు డప్పాలు కొట్టుకుంటూ మరోవైపు పోలీసులను దన్నుగా పెట్టుకుని దాడులు చేస్తున్నది నిజం కాదా? అందుకే అప్రజాస్వామికంగా జరుగుతున్న ఈ నీటి సంఘాల ఎన్నికలను ఖండిస్తూ, బహిష్కరించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయం తీసుకుంది. రైతుల తరఫున ఎప్పుడూ వారికి అండగా ఉంటూ వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం?
Comments
Please login to add a commentAdd a comment