‘‘పాలనలో వేగం పెంచండి’’, ‘‘జనం మెచ్చేలా, మనం నచ్చేలా పాలన’’ అధికారుల వల్లే అసంతృప్తి’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలివి. ఎన్నికల హామీ అమలుపై చర్చ కాదు కదా.. కనీస ప్రస్తావన కూడా లేకుండా సాగిన ఈ సమావేశాన్ని గమనిస్తే దీనికో లక్ష్యమంటూ ఉందా? అన్న సందేహం రాకమానదు. నిర్దిష్ట సూచన, సలహాలు లేకుండా కలెక్టర్లదే బాధ్యతంతా అన్నట్టు చంద్రబాబు వ్యవహరించడం ఎవరిని మభ్యపెట్టేందుకు? వైసీపీ అధికారంలో ఉండగా జగన్ కలెక్టర్ల సమావేశం పెడితే ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీ పత్రాలను దగ్గర పెట్టుకుని వాటి అమలుపై సమీక్ష జరిగేది. అమలులో ఎదురవుతున్న సమస్యలపై చర్చ జరిగేది. ఇప్పుడు అవేవీ లేవు. చంద్రబాబు తమ సూపర్ సిక్స్ హామీల గురించి కలెక్టర్లతో మాట్లాడే ధైర్యమూ చేయలేకపోతున్నారు. బాబే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలతో సంబంధం లేని మాటలు నాలుగు మాట్లాడి సమావేశాలను మమ అనిపిస్తున్నారు.
ఎస్పీలతో సమావేశాలు కానీ.. కలెక్టర్లతోనైనా కూడా తమ అధికారాన్ని ప్రదర్శించడం తప్ప వీరు చేసిందేమిటన్న ప్రశ్న వస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే కదా.. జనం మెచ్చేది.. పాలకులు నచ్చేది? బదులుగా బాధ్యతంతా అధికారులదే అని చేతులు దులిపేసుకుంటే.. వారి వల్లే తాము ప్రజలకు నచ్చడం లేదూ అంటే ఎలా? రాష్ట్రస్థాయి కలెక్టర్ల సమావేశం ఎజెండాలో సూపర్ సిక్స్ లేకపోవడం గమనించాల్సిన విషయం. వీటి అమలుకు నిధులెన్ని కేటాయిస్తున్నారో చెప్పకుండా కలెక్టర్లు బాగా పనిచేయాలని అంటారు. ప్రజా ప్రతినిధులు చెప్పినట్లు నడుచుకోవాలని కూడా చెబుతున్నారు. ఇవి చేస్తే అది జనం మెచ్చే పాలన ఎలా అవుతుంది? ఈ నేపథ్యంలోనే జనంలో తిరుగుబాటు వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. అయితే ఈయన ఒకసారి అంతా బాగున్నట్టు.. అప్పుడప్పుడూ ఇలా బాలేనట్లు పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ప్రసంగాల్లోని వైరుద్ధ్యాలు ఎంతో ఆసక్తికరం. చంద్రబాబేమో... ప్రజలతో గౌరవంగా ఉండండని అంటారు. అంతవరకూ ఓకే కానీ ఇది ఐఏఎస్‌లకే కాకుండా ఐపీఎస్‌లకూ వర్తిస్తుంది. టీడీపీ, జనసేన కూటమి నేతలు పోలీసులను తమ ఇష్టానురీతిలో వాడుకుంటూ పౌరులపై దాడులు చేయిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ వీటిని సమర్థిస్తూ.. ఇంకోపక్క సుభాషితాలు చెబుతూండటం విని కలెక్టర్లు నవ్వుకోవడం మినహా ఏమి చేస్తారు! రాష్ట్రం గాడిలో పడుతోందట..చీకట్లు తొలగిపోతున్నాయట. ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే పరిస్థితి వచ్చిందట.. చంద్రబాబు ఇలాంటి మాటలు ఎవరిని మాయ చేయడానికి చెబుతున్నారు? వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల హింస, అత్యాచారాలు, వేధింపులు జరుగుతుంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అనడం అంటే ఎంత దారుణం! గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా.. అధికారులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
ఇదే కలెక్టర్ ల సమావేశంలో పవన్ కళ్యాణ్ శ్రీసత్యసాయి జిల్లాలో కొందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని చెప్పారు. సీఎంను అడిగి రూ.30 కోట్ల నిధులు తీసుకుని జీతాలు ఇప్పించామని అన్నారు. మున్సిపాల్టీలలో పారిశుద్ద్య కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని కార్మిక సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. పది లక్షల కోట్ల అప్పులు పేరుకున్నాయని చంద్రబాబు అన్నారు. కొద్దికాలం క్రితమే ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని శాసనసభలో చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం, మళ్లీ పాత పాటే పాడుతోంది. కొత్త అప్పులు చేద్దామంటే ఎఫ్ ఆర్ బిఎమ్ అనుమతించడం లేదట. ఇప్పటికి సుమారు డెబ్బై వేల కోట్ల అప్పు చేసి మరీ ఇంకా రుణాలు రావడం లేదని అంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా గతంలో ఎప్పుడూ తాను చూడలేదని పచ్చి అబద్దం చెబుతున్నారు.
ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలనలో 1999 2004లో పనికి ఆహారం బియ్యం పథకం కింద కేంద్రం నుంచి వచ్చిన ఏభై లక్షల టన్నుల బియ్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన విషయం శాసనసభలోనే పెద్ద రగడ జరిగింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఆ పార్టీ, ఈ పార్టీ అని ఉండదు. అది తెలిసినా, వైఎస్సార్‌సీపీ పై బురద చల్లడం కోసం ఇలాంటి అసత్యాలు చెబుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అక్రమ రవాణా ఆగడం లేదని పవన్ కళ్యాణ్ అనడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పకనే చెప్పారు కదా! మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు ఎగుమతి చేసిన బియ్యంలో రేషన్ బియ్యం ఉన్నాయా? లేవా? అన్నది ఎందుకు తనిఖీ చేయలేదు? రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇతర రాష్ట్రాలలోను ఉందని కేశవ్ అన్న విషయంపై చంద్రబాబు ఏమి చెబుతారు? వైసీపీ ప్రభుత్వంలో పోర్టులు, సెజ్ లు కబ్జాకు గురయ్యాయట. జగన్ ప్రభుత్వపరంగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తుంటే వాటిని నిలిపి ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించాలని చూస్తున్న చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారు.
కాకినాడ సెజ్ లో చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావు చేసిన భూ దందాపై సీనియర్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖకు చంద్రబాబు సమాధానం చెప్పాలి కదా! అధికార యంత్రాంగంలో పాత వాసనలు పోవడం లేదట. ఆయనకు తెలియకుండా వారు పనులు చేస్తున్నారట. కుమారుడు లోకేష్ కనుసన్నలలో అన్నీ జరగుతున్నాయని టీడీపీలో టాక్. కాని తనకు చెప్పడం లేదని ముఖ్యమంత్రి అనడంలో ఆయన బలహీనత తెలుస్తూనే ఉంది కదా! అమరావతి ప్రారంభ దశలో రూ.ఏభై వేల కోట్ల అవసరం అని చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి ఒక్క రూపాయి ఖర్చు చేయనవసరం లేదని, అది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పిన విషయాన్ని మాత్రం చంద్రబాబు ప్రస్తావించరు. చంద్రబాబు ఒక్క నిజం చెప్పినట్లుగా ఉంది. ఇంతవరకు కేవలం నలభైవేల మందికే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందాయని తెలిపారు. ఎల్లో మీడియా ఇప్పటికే లక్షల మంది గ్యాస్ సిలిండర్లు పొందినట్లు ప్రచారం చేస్తుంటే, చంద్రబాబు పొరపాటున వాస్తవం చెప్పేసినట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలలో జగన్ పాలనలో జీఎస్డీపీ సుమారు 12.5 పెరిగిందని పార్లమెంటులో ప్రకటిస్తే, చంద్రబాబు మాత్రం ఆదాయం తగ్గిందని చెబుతున్నారు.
జగన్ టైమ్ లో కరోనా రెండేళ్లు సంక్షోభాన్ని సృష్టించినా, దానిని తట్టుకుని నిలబడితే ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడుతున్నారు. మరో వైపు కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ ఎందుకు తగ్గిందో చెబితే ఒట్టు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం,తదితర సమస్యలపై మాత్రం నిర్దిష్ట హామీ ఇవ్వలేకపోయారు. వచ్చే సీజన్ లో చూద్దామని చెప్పి వదలి వేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా యథాప్రకారం తెలిసి, తెలియనట్లు మాట్లాడారనిపిస్తుంది. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు కనుక అక్రమాలను అడ్డుకుంటే మంత్రులు వెళ్లనవసరం లేదట. అదేమిటో అర్థం కాదు. ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినట్లు చేయాలని ముఖ్యమంత్రి చెబుతారు. ఇంకోవైపు అధికారులు నిస్సహాయంగా ఉండవద్దని అంటారు. వ్యవస్థ మూలాలను గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని, పాత సినిమా డైలాగులనే ఆయన వల్లిస్తున్నారు.
కాకపోతే ఒక్క వాస్తవం చెప్పారు. ప్రజలు ఆశలను నెరవేర్చలేకపోతున్నామని, తిరగబడే ప్రమాదం ఉందని, శ్రీలంక, బంగ్లాదేశ్ ల పరిస్థితి ఏపీలో ఉందని చెప్పడం మాత్రం విశేషమే. ఇదే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కూడా అంటున్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒక్కదానిని కూడా సరిగా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని, దానివల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతోందని జగన్ అంటున్నారు. చంద్రబాబు అబద్దాలు మోసాలుగా మారాయని, అదే ప్రజలలో కోపంగా మారుతున్నాయని, తమకు హామీ ఇచ్చిన విధంగా పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నెలకో రకంగా గోబెల్స్ ప్రచారం చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు.
అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు చిత్తశుద్ది ఉంటే, వారిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళికను దగ్గర పెట్టుకుని, ఎన్నికల సమయంలో ఏమి చెప్పాం? ఏమి చేస్తున్నామన్న దానిపై ఎన్నడైనా సమీక్ష చేసుకున్నారా? ఆ పని చేయకుండా కలెక్టర్ల సమావేశాలు పెట్టి డ్రామాల మాదిరి కబుర్లు చెబితే ప్రజలకు అర్థం కాదా? ఐఎఎస్ పాసై వచ్చిన కలెక్టర్లు, సెక్రటరీలకు ఇందులోని మోసం తెలియదా?. ఎన్నికలలో గెలవడం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి, ఇప్పుడు డబ్బులు లేవని కథలు చెబుతూ తమను ప్రజలు మెచ్చుకోవాలని ఉపన్యాసాలు ఇస్తే మెచ్చుకోవడానికి ప్రజలు పిచ్చివాళ్లా? కొసమెరుపు ఏమిటంటే ఈ సమావేశంలో కలెక్టర్లు సోది చెబుతున్నారని ఎల్లో మీడియా ఒక స్టోరీ ఇచ్చింది. ప్రభుత్వంలో విషయం లేకపోతే సోది చెప్పక ఏమి చేస్తారు? అందులోను నేతల సోది విన్న తర్వాత వారు మాత్రం అందుకు బిన్నంగా వెళతారా?
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment