అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపణలన్నీ అసత్యాలే
కూటమి సర్కారు విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్ధిక సర్వేనే నిదర్శనం
స్థిర ధరల ఆధారంగా వైఎస్సార్‌సీపీ హయాంలో పెరిగిన వృద్ధి రేటు
2022–23లో 5.81 శాతం... 2023–24లో ఏకంగా 7.35% వృద్ధి
జాతీయ స్థాయిని మించి రాష్ట్ర తలసరి ఆదాయం..
గత మూడేళ్లుగా రాష్ట్ర సొంత ఆదాయంలో పెరుగుదల
అన్నదాతలను చేయిపట్టుకుని నడిపించిన ఆర్బీకేలు.. 2023–24లో రైతు భరోసా ద్వారా 53.58 లక్షల మంది రైతులకు రూ.7,226.08 కోట్లు
నాడు – నేడుతో బాగుపడ్డ ప్రభుత్వ పాఠశాలలు.. ఆదుకున్న అమ్మ ఒడి
2023–24లో రూ.11,688 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు
రూ.6.07 లక్షల కోట్ల పెట్టుబడితో కార్యాచరణ దశలో మరో 156 మెగా ప్రాజెక్టులు
ఎంఎస్‌ఎంఈలతో లక్షల మందికి ఉపాధి కల్పన
ప్రజారోగ్యానికి భరోసా.. చేనేత కార్మీకులకు రూ.969.77 కోట్ల ఆర్థిక సాయం
కూలీల వేతనాల పెరుగుదలతో మెరుగుపడ్డ జీవన ప్రమాణాలు
సాక్షి, అమరావతి: వరుసగా ఏటా సొంత ఆదాయాల్లో పెరుగుదల.. జాతీయ స్థాయికి మించి పెరిగిన తలసరి ఆదాయం..
చిన్న, సూక్ష్మ పరిశ్రమలతో 32.79 లక్షల ఉద్యోగాలు.. కోవిడ్‌లోనూ ఉపాధికి ఢోకా లేకుండా భరోసా.. గాడిన పడ్డ పొదుపు సంఘాలు.. బాగుపడ్డ ప్రభుత్వ పాఠశాలలు.. పేదవాడికి ఆరోగ్య భరోసా.. రైతుల్లో నిశ్చింత....
ఇవన్నీ ఒక రాష్ట్రం అభివృద్ధి ప్రయాణానికి తిరుగులేని నిదర్శనాలు! స్ధిర ధరల ఆధారంగా వృద్ధి రేటు వైఎస్సార్ సీపీ హయాంలో ఏటా పెరిగినట్లు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేనే స్పష్టంగా చెబుతోంది. అయినా సరే.. గత సర్కారు పాలనలో అభివృద్ధి జరగలేదని.. ఆదాయం పెరగలేదని.. తలసరి ఆదాయం తగ్గిపోయిందని.. పెట్టుబడులు రాలేదని.. స్కీములన్నీ స్కామ్‌లేనంటూ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు కట్టుకథలు చెప్పారు!!
కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించిన 2023–24 సామాజిక ఆర్ధిక సర్వే సాక్షిగా ఈ అబద్ధాలు బట్టబయలయ్యాయి. స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని గణించడం వాస్తవ అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతారు. వైఎస్సార్ సీపీ హయాంలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం వెంటాడినప్పటికీ ప్రతి ఏడాది వృద్ధి సాధించినట్లు సర్వే స్పష్టం చేసింది. 2022–23తో పోల్చితే 2023–24లో స్థిర ధరల ఆధారంగా వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని సర్వే తెలిపింది.
వృద్ధికి ఊతం..
⇒ 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం కూడా జాతీయ స్థాయిని మించి పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,84,205 కాగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,42,479గా ఉంది.
⇒ 2021–22 నుంచి 2023–24 వరకు రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరులు వరుసగా పెరిగాయి.
పొదుపు మహిళకు ‘‘ఆసరా’’
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 99 శాతం రికవరీతో పాటు 30 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే వెల్లడించింది. స్వయం సహాయక సంఘాలకు 2019 ఏప్రిల్ 11వతేదీ వరకు ఉన్న రుణాల భారాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా చెల్లించి గత ప్రభుత్వం ఆదుకుంది. 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు రూ.25,557.54 కోట్లు చెల్లించింది.
పారిశ్రామిక విప్లవం..
⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.11,688.11 కోట్ల పెట్టుబడితో 20 భారీ పరిశ్రమలు ఏర్పాటు కావడమే కాకుండా ఉత్పత్తిని సైతం ప్రారంభించి 14,596 మందికి ఉద్యోగాలు కల్పించాయి.
⇒ రూ.6.07 లక్షల కోట్ల పెట్టుబడితో తలపెట్టిన మరో 156 భారీ మెగా ప్రాజెక్టులు నిర్మాణ, ప్రారంభ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా 4.86 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,286.48 కోట్ల పెట్టుబడితో 2,71,341 ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు కావడమే కాకుండా వాటి ద్వారా ఏకంగా 19,86,658 మందికి ఉపాధి కల్పించాయి.
⇒ గతంలో ఐదేళ్ల టీడీపీ పాలనలో ఎంఎస్‌ఎంఈల ద్వారా రూ.26,000 కోట్ల పెట్టుబడులు, 8.67 లక్షల మందికి ఉపాధి కల్పించగా వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఎంఎస్‌ఎంఈలతో రూ.33,177 కోట్లు పెట్టుబడులు, 32.79 లక్షల మందికి ఉపాధి చూపినట్లు సర్వే వెల్లడించింది. 2023–24లో 2.24 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా 64,307 మంది ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు.
విద్యా సంస్కరణలు.. చదువులకు సాయం
⇒ మన బడి నాడు – నేడు కింద తొలి దశలో రూ.3859.12 కోట్ల వ్యయంతో 15,715 స్కూళ్లలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలను కల్పించగా రెండో దశలో రూ.8,000 కోట్లతో అదనపు తరగతి గదులతోపాటు 11 రకాల సదుపాయాలను 22,344 స్కూళ్లలో కల్పించారు. రూ.372.77 కోట్లతో 883 స్కూళ్లలో వసతులు కల్పించారు.
⇒ పిల్లల చదువులకు పేదరికం అడ్డురాకూడదనే సంకల్పంతో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు చొప్పున 2022–23లో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.94 కోట్లు అందచేశారు.
⇒ 2023–24 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డ్రాప్ అవుట్స్ లేవు. 6 నుంచి 8వ తరగతి వరకు 0.01 శాతం మాత్రమే డ్రాప్ అవుట్స్ ఉండగా తొమ్మిది, పదో తరగతిలో 2.39 శాతం డ్రాప్ అవుట్స్ నమోదయ్యాయి.
ఆర్బీకేలు.. పెట్టుబడి సాయం
దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు సేవలందించాయని సర్వే తెలిపింది. రైతు భరోసా – పీఎం కిసాన్ కింద 2023–24లో 2.58 లక్షల మంది ఆర్వోఎఫ్‌ఆర్, కౌలు రైతులతో సహా 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,226.08 కోట్లు పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం అందచేసింది.
రాష్ట్ర పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరుల గురించి సామాజిక, ఆర్థిక సర్వేలో పేర్కొన్న భాగం
Comments
Please login to add a commentAdd a comment