నేటి నుంచి మళ్లీ కేసీఆర్‌ ప్రచారం.. | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మళ్లీ కేసీఆర్‌ ప్రచారం..

Published Fri, May 3 2024 5:04 AM

KCR road show in Ramagundam after 8 pm

రాత్రి 8 తర్వాత రామగుండంలో రోడ్‌ షో 

రేపు మంచిర్యాలలో, ఆదివారం జగిత్యాలలో.. 

10న సిద్దిపేట సభతో బస్సు యాత్ర ముగింపు 

10 నుంచి 12 స్థానాల్లో గెలిచే చాన్స్‌ ఉందని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత వెంటనే బస్సుయాత్ర తిరిగి ప్రారంభించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. గతంలో బీఆర్‌ఎస్‌ రూపొందించిన షెడ్యూల్‌ మేరకు శుక్రవారం రాత్రి రామగుండంలో రోడ్‌ షోకు కేసీఆర్‌ హాజరవుతారు. 

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి 8 గంటలకు ప్రచారం నిలిపివేసిన కేసీఆర్‌ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించేందుకు గాను శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరనున్న కేసీఆర్‌ రాత్రికి రామగుండం చేరుకుని రోడ్‌ షోలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి శనివారం సాయంత్రం మంచిర్యాలలో, ఆదివారం జగిత్యాలలో జరిగే రోడ్‌ షోల్లో పాల్గొంటారు. 

ఈ నెల 10వ తేదీ వరకు గతంలో నిర్ణయించిన షెడ్యూలుకు అనుగుణంగానే కేసీఆర్‌ బస్సు యాత్ర కొనసాగుతుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 10న సిరిసిల్లలో రోడ్‌షో, సిద్దిపేటలో బహిరంగ సభతో కేసీఆర్‌ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. గురువారం జమ్మికుంట, వీణవంకలో రోడ్‌ షోలు నిర్వహించాల్సి ఉండగా, ఈసీ ఆదేశాలతో నిలిపివేసిన విషయం తెలిసిందే.  

ప్రజా స్పందన ఎలా ఉంది? 
బుధవారం రాత్రి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కేసీఆర్‌ గురువారం పార్టీ అభ్యర్థులు, నేతలతో ఫోన్‌ ద్వారా మాట్లాడి పార్టీ ఎన్నికల ప్రచార సరళిని సమీక్షించారు. ఇప్పటివరకు బస్సుయాత్ర, రోడ్‌ షోలు జరిగిన ప్రాంతాల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఆరా తీశారు. రాబోయే వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచారంపై దిశా నిర్దేశం చేశారు.

 ప్రచార లోపాలను సరిదిద్దుకుని పార్టీ యంత్రాంగంతో మరింత సమన్వయం చేసుకోవాలని సూచించారు. తాజా సర్వేల ప్రకారం బీఆర్‌ఎస్‌కు 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశముందని వెల్లడించారు. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపాలని, కాంగ్రెస్, బీజేపీ విధానాలతో జరిగే నష్టాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Advertisement
Advertisement