కేసీఆర్‌ ప్రచారంపై నిషేధం.. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని సూచన | Central Election Commission Ban on KCR campaign | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ప్రచారంపై నిషేధం.. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని సూచన

Published Thu, May 2 2024 5:05 AM | Last Updated on Thu, May 2 2024 5:05 AM

మహబూబాబాద్‌లో నిర్వహించిన బస్సు యాత్రలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

మహబూబాబాద్‌లో నిర్వహించిన బస్సు యాత్రలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

సిరిసిల్లలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలు

బుధవారం రాత్రి 8 నుంచి 48 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశం 

ఊరేగింపులు, ర్యాలీలు వద్దని.. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని సూచన 

మానుకోట బస్సుయాత్ర మార్గంలో కేసీఆర్‌కు ఆర్డర్‌ కాపీ 

జమ్మికుంట యాత్ర రద్దు చేసుకుని ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లిన మాజీ సీఎం 

రేవంత్‌ ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఈసీ స్పందించలేదేం: కేసీఆర్‌ 

రేవంత్‌ బూతులు ప్రవచనాల్లా ఉన్నాయా?: కేటీఆర్‌ 

బీజేపీ, కాంగ్రెస్‌ మీద కొట్లాడుతున్నందుకే నిషేధం: హరీశ్‌రావు  

రేవంత్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు 48 గంటల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మే ఒకటో తేదీ బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని, మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని స్పష్టం చేసింది. 

బస్సు యాత్రలో భాగంగా మానుకోటలో ఉన్న కేసీఆర్‌కు అధికారులు ఈసీ ఆదేశాలను అందజేశారు. దీంతో మహబూబాబాద్‌ రోడ్‌ షోలో రాత్రి 7.45 గంటలలోపు ప్రసంగాన్ని ముగించిన కేసీఆర్‌.. ఈసీ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అక్కడి నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఈసీ విధించిన గడువు ముగిశాక కేసీఆర్‌ తిరిగి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. 

కాంగ్రెస్‌ ఫిర్యాదు నేపథ్యంలో.. 
ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు కేసీఆర్‌ ఏప్రిల్‌ 5న ‘పొలం బాట’పేరిట కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. నేత కార్మీకులను ఉద్దేశించి స్థానిక కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. వరి ధాన్యానికి క్వింటాల్‌ రూ.500 చొప్పున బోనస్‌ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ను వేటాడతామంటూ మాట్లాడారు. 

ఇలా సిరిసిల్లలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌.. ఏప్రిల్‌ 6న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌పై కేసీఆర్‌ అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విచారణ జరిపి ఏప్రిల్‌ 10న నివేదిక సమర్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆ నివేదిక ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్‌కు ఏప్రిల్‌ 16న షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. 

‘‘విలేకరుల సమావేశంలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను మాత్రమే కాంగ్రెస్‌ ప్రత్యేకంగా పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. తెలంగాణ, సిరిసిల్ల ఎన్నికల ఇన్‌చార్జులుగా పనిచేస్తున్న అధికారులకు తెలంగాణ మాండలికం పూర్తిగా అర్థం కాదు. నేను చేసిన వ్యాఖ్యలను ఇంగ్లిషులోకి తప్పుగా అనువదించడంతోపాటు వక్రీకరించారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ విధానాలు, పథకాలను మా త్రమే విమర్శించాను’’అని కేసీఆర్‌ ఈసీకి సమా ధానం ఇచ్చారు. కానీ ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఈసీ.. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్‌లో, 2023 అక్టోబర్‌లో బాన్సువాడ సభలో చేసిన వ్యాఖ్యలపైనా హెచ్చరికలు చేశామని గుర్తు చేసింది. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. 

సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు 
సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి నకిలీ పత్రాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారని, ఆయనపై చ ర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ కోరింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్‌ల మూసివేతకు సంబంధించి గతేడాది మే 12న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లోని అంశాలను వక్రీకరిస్తూ.. నకిలీ సర్క్యులర్‌ను ఉద్దేశపూర్వకంగా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ను బద్నాం చేసేందుకు, ఓటర్లను ప్రభావితం చేసేందుకు రేవంత్‌రెడ్డి తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ చేస్తున్న అబద్ధపు ప్రచారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. 

బస్సుయాత్ర రీ షెడ్యూల్‌పై కసరత్తు 
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 24 నుంచి మే 10 వరకు 17 రోజుల బస్సుయాత్రను కేసీఆర్‌ చేపట్టారు. మిర్యాలగూడలో మొదలైన యాత్ర వరుసగా 8 రోజుల పాటు సాగి బుధవారం రాత్రి మహబూబాబాద్‌కు చేరుకుంది. కానీ ఈసీ ఆదేశాలతో రెండు రోజులపాటు బస్సుయాత్రను నిలిపివేశారు. షెడ్యూల్‌ ప్రకారం.. కేసీఆర్‌ బుధవా రం రాత్రి వరంగల్‌లో బస చేసి.. గురువారం జమ్మి కుంట, వీణవంకలలో, శుక్రవారం రామగుండంలో రోడ్‌ షోలు నిర్వహించాల్సి ఉంది. ఈసీ నిషేధం నేపథ్యంలో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని రీషెడ్యూల్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. మార్పులపై గురువారం స్పష్టత ఇస్తామని ప్రకటించింది.

తెలంగాణ గొంతుపై నిషేధమా?: కేటీఆర్‌
కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు తప్పుపట్టారు. ‘ఎక్స్‌’వేదికగా తన స్పందనను పోస్ట్‌ చేశారు.‘‘ఇదెక్కడి అరాచకం? తెలంగాణ గొంతు కేసీఆర్‌పైనే నిషేధమా? ప్రధాని మోదీ విద్వేష వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్‌కు కమిషన్‌కు వినిపించలేదా? వేలాది మంది పౌరులు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు లు చేస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. రేవంత్‌ బూతులు ఎన్నికల కమిషన్‌కు ప్రవచనాల్లా అనిపించాయా? అసభ్య పదజాలం వాడుతున్న తెలంగాణ సీఎం రేవంత్‌పై ఎలాంటి చర్యలూ ఉండవా? బడే భాయ్‌.. చోటే భాయ్‌ కలసి చేసిన కుట్ర కాదా ఇది. కేసీఆర్‌ పోరుబాటతో బీజేపీ, కాంగ్రెస్‌ ఎందుకు వణికిపోతున్నాయి? మీ అహంకారానికి, వ్యవస్థల దుర్వి నియోగానికి తెలంగాణ ప్రజలు దీటైన సమాధానం ఇస్తారు’’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ప్రశ్నిస్తే ప్రచారం వద్దంటున్నారు: హరీశ్‌రావు
‘‘కాంగ్రెస్, బీజేపీల మీద కేసీఆర్‌ గట్టిగా కొట్లాడుతున్నారనే రెండు రోజులు ప్ర చారం ఆపారు. మోదీ మత విద్వేషాలు రెచ్చ గొడితే.. రేవంత్‌ బూతులు మాట్లాడితే ఎన్ని కల కమిషన్‌కు కనిపించవా? ప్రశ్నించే కేసీఆర్‌ను మాత్రం ప్రచారం చేయొద్దు అంటు న్నారు. రెండు రోజులు కేసీఆర్‌ ప్రచారం ఆగినంత మాత్రం జరిగేదేంటి?’’అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజల గుండెలో ఉంటారని చెప్పా రు. కేసీఆర్‌ బస్సుయాత్ర చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్‌ గజగజ వణుకుతున్నాయన్నారు. కేసీఆర్‌ అంతటి వ్యక్తిని దుర్భాషలు ఆడుతున్న రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement