సాక్షి, భద్రాద్రికొత్తగూడెంజిల్లా: ప్రాణమున్నంత వరకు తెలంగాణ హక్కుల కోసం పోరాడతానని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్తగూడెంలో(ఏప్రిల్30) నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచార రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు. ఫ్రీ బస్సు పెట్టి ఈ ప్రభుత్వం ఆటో కార్మికులను ఆగం చేసిందని మండిపడ్డారు. మోదీ, రేవంత్ ఒక్కటేనని వారికి ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు.
‘కొత్తగూడెంను జిల్లా చేయడానికి కారణం మారుమూల గిరిజన, ఆదివాసీలకు న్యాయం జరగాలని, పాలన అందాలని జిల్లా చేశాం. కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్‌తో పాటు పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లాను రద్దు చేయాలని చూస్తున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు.
రైతు బంధు 15వేలు ఇస్తామని అన్నారు, కానీ ఇప్పుడు ఒక్క రూపాయి అయిన ఇచ్చాడా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం, మహిళలకు నెలకు రూ. 2,500, రూ. 2 లక్షల రుణమాఫీ ఇలాంటి హామీలు అటకెక్కాయి. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు. ఇప్పుడు కరెంట్ లేనే లేదు. పినపాక లాంటి నియోజకవర్గ పరిధిలోని ఆదివాసీ, గిరిజన గూడేలకు మిషన్ భగీరథ రావట్లేదు. వేల మందికి పోడు పట్టాలు ఇచ్చినం.
గిరిజనులకు, మైనారిటీలకు గురుకులాలు పెట్టి విద్యలో సమూల మార్పు తెచ్చాం. ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు నిలిచిపోయాయి. గిరిజన బిడ్డల కోసం కోట్ల రూపాయల ఖర్చుతో గిరిజన భవనాలు కట్టించాం. సింగరేణి బిడ్డలకు స్పెషల్ ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ఇచ్చాం. సింగరేణిని ముంచే పనిలో చోటే భాయ్ రేవంత్ రెడ్డి, బడే భాయ్ నరేంద్ర మోదీ ఉన్నారు. పదేళ్ల క్రితం గద్దెనెక్కిన మోదీ భేటి పడావ్ భేటి బచావ్ ఏమైంది.
నరేంద్రమోదీ దుర్మార్గ పాలన, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. గోదావరి నదిని ఇచ్చంపల్లి నుంచి వేరే రాష్ట్రాలకు తరలించే కుట్ర చేస్తున్నారు. విద్యావంతులు, యువకులు ఆలోచించాలి. ఇప్పుడు రాష్ట్రంలో జీవన్మరణ సమస్య ఏర్పడింది. తెలంగాణను నాశనం చేసే పని మోదీ చేస్తున్నా రేవంత్ ఎందుకు మాట్లాడట్లేదు. తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టాలి అని చెప్తే నేను ఒప్పుకోలేదు.
ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికులను రోడ్డున పడేశారు. గురుకులంలో కరీంనగర్‌లో బాలిక చనిపోతే రేవంత్ నోరు మెదపడం లేదు. కేంద్రం, రాష్ట్రం మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన, హిందు ముస్లిం గొడవలు లేకుండా శాంతిభద్రతలతో రాష్ట్రాన్ని పరిపాలించాం. కాంగ్రెస్- బీజేపీ రెండు ఒక్కటే అని ముస్లిం సోదరులు గమనించాలి. బీఆర్ఎస్ ఒక్కటే మతసామరస్యం కాపాడుతుంది’ అని కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment