సాక్షి,హైదరాబాద్: బీజేపీ కి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ కీలకం అవుతుందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా హన్మకొండలో ఆదివారం( ఏప్రిల్ 28) జరిగిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు.
‘ఓరుగల్లు చైతన్యం ఉన్న జిల్లా. చరిత్ర వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా. ఓరుగల్లు మట్టితో నాది విడదీయరాని బంధం. ఐదు మెడికల్ కాలేజీలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు తెచ్చుకున్నాం. ఈ ముఖ్యమంత్రి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు.
ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే ఎగిరిఎగిరి తన్నట్లుంది తెలంగాణ పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఈ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసింది. తెలంగాణ గొంతుకోసి మోదీ గోదావరి జలాలను తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తున్నాడు.
మోదీ గోదావరిని ఎత్తుకు పోతా అంటుంటే ఈ ముఖ్యమంత్రి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. . బీజేపీ చాలా ప్రమాద కరమైన పార్టీ. ప్రజల మధ్య పంచాయితీలు పెట్టడం తప్ప మరో ప్రణాళిక లేదు. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది.
రూపాయి విలువ పడిపోయింది. కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌కు చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకున్నాడు. మూడు నెలల్లో స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నాడు. రాజయ్య చేతిలో కడియం ఓటమి ఖాయం.
గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవాలి. రేవంత్ రెడ్డి నా గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటాడట.. నా లాగు కూడా ఊడ తీస్తాడట. నన్ను చర్లపల్లి జైలులో వేస్తాడట. నీ జైళ్ళు, తోకమట్ట దెబ్బలకు కేసీఆర్ భయపడడు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్‌లో కట్టిన 24 అంతస్తుల ఆస్పత్రే నిదర్శనం’ అని కేసీఆర్ అన్నారు
Comments
Please login to add a commentAdd a comment