ఈసీ నుంచి అనుమతి రానందుకే..
ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి కోరిన సర్కారు
స్పందించని కేంద్ర ఎన్నికల సంఘం
కీలకాంశాలపై నిర్ణయానికి నో చాన్స్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ, మేడిగడ్డ బ్యారేజీకి అత్యవసర మరమ్మతుల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడా నికి వీలుగా శనివారం ప్రభుత్వం నిర్వహించతల పెట్టిన మంత్రివర్గ సమావేశం అనివార్య పరిస్థి తుల్లో వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కేబినెట్ భేటీ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని రాష్ట్ర సర్కారు కోరింది. కానీ ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వేయిదా వేసినట్టు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
పాలనపై దృష్టి పెడతామన్న సీఎం
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ ముగియగా, వచ్చే నెల 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. మార్చి 15న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది జూన్ 6తో ముగియనుంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో రెండు నెలలుగా పాలన వ్యవహారాలు స్తంభించిపోయాయి. సీఎం, మంత్రుల రోజువారీ అధికారిక సమీక్షలు, సమావేశాలు బంద్ అయ్యా యి.
ఈ నేపథ్యంలో 13న పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలన వ్యవహారాలపై మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు కేబినెట్ భేటీ కోసం హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు.
ఒడిశా నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముంబై నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాయ్‌బరేలి నుంచి సీతక్క నగరానికి చేరుకున్నారు. ఏక్షణంలోనైనా ఈసీ అనుమతి లభించవచ్చనే ఉద్దేశంతో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో వేచిచూశారు. రాత్రి 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసింది.
ఒకపక్క ఈసీ అనుమతి కోసం నిరీక్షిస్తూనే సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సీఎం, మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు.
ఎజెండాలో కీలక అంశాలు
జూన్ 2తో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తికా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉండి పోయిన విభజన వివాదాలు, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ, ధాన్యం కొను గోళ్లు, రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి గాను మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
అలాగే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం బ్యారేజీల మరమ్మ తులు, ఈ విషయమై నిపుణుల కమిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలోని సిఫారసుల అమలుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కానీ ఈసీ అనుమతించకపోవడంతో ఇందుకు అవకాశం లేకుండా పోయింది.
అవసరమైతే ఈసీని కలుస్తాం: సీఎం రేవంత్
ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. సోమవారం వరకు ఈసీ నుంచి అనుమతి రానిపక్షంలో, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆయన తెలిపారు.
అప్పటికీ ఈసీ సానుకూలంగా స్పందించని పక్షంలో జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, ఇతర అత్యవసర అంశాలపై చర్చించలేకపోయామని సీఎం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment