పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్లలో తేడాలు
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ అంతే
140కి పైగా లోక్‌సభ స్థానాల్లో ఎక్కువ ఓట్లు లెక్కించారు
కారణాలపై పెదవి విప్పని కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై ముసురుకుంటున్న సందేహాలు
ఈసీ డేటాను ఉటంకిస్తూ ‘ద వైర్’ వార్తా సంస్థ కథనం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైనా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెర పడటం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికీ మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థాన్లాలో పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ‘ద వైర్’ వార్తా సంస్థ పేర్కొంది! కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది.
మొత్తం 543 లోక్‌సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్–డయ్యు, లక్షద్విప్, అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పై చిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం! ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించింది. ‘‘పలు లోక్‌సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది.
ఒక లోక్‌సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు! ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఈ మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు’’ అని తెలిపింది. కథనంలో ద వైర్ ఏం చెప్పిందంటే...
ఫలితాల వెల్లడిలో లోక్‌సభ స్థానాలవారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పుచేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్‌సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెర లేచింది.
దాంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ‘‘కొన్నిచోట్ల అలా జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్/వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఫామ్ 17–సీలో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దాంతో అవి కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓట్లను చివరిదాకా లెక్కించరు.
అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్‌సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీ వచి్చంది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు! విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 852; 1,884 ఓట్ల మెజారిటీ వచ్చి న ఇంకో చోట 950 ఓట్లు అదనంగా లెక్కించారు.
ఇవీ సందేహాలు..
⇒ నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం?
⇒ లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డాటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి?
⇒ ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ/తక్కువగా నమోదైన లోక్‌సభ స్థానాలవారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకివ్వడం లేదు?
⇒ ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద ఎన్ని ఈవీఎంలను, ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా?
వివరణ ఇవ్వాల్సిందే ప్రశాంత్ భూషణ్
ఓట్ల లెక్కింపులో గోల్‌మాల్‌కు సంబంధించి ‘ద వైర్’ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్‌సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు! అసలేం జరుగుతోంది?’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘ద వైర్’ కథనాన్ని ట్యాగ్ చేశారు. ‘‘అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు కచి్చతంగా వివరణ ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment