సాక్షి, అమరావతి: వచ్చే సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్‌కు జరిగే సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఉన్నతాధికారులు రెండు రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు సహా మొత్తం ఏడుగురు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు.
ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు సమీక్షిస్తారు. తదనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో ఈసీఐ బృందం చర్చించనుంది. ఎస్‌ఎస్‌ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తదితరాలపై జిల్లా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం చేసిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో కలసి పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment