అవ్వాతాతల పింఛన్ల పంపిణీపై చంద్రబాబుది రోజుకో తీరు
అవ్వాతాతల ఓట్లు దక్కవేమోనన్న దుగ్థతో మొదట్లో ఇంటింటి పంపిణీని అడ్డుకునేందుకు ఈసీకి ఫిర్యాదులు
దీంతో సచివాలయాల్లో పంపిణీ చేయాలని ఈసీ ఆదేశాలు.. దీనికనుగుణంగా ఏప్రిల్ పింఛన్లు సచివాలయాల్లో అందజేత
అవ్వాతాతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బాబు బృందం యూటర్న్
ఇప్పుడు బ్యాంకుల్లోనే పింఛను జమచేయాలని 20 రోజులుగా నిమ్మగడ్డ.. పచ్చముఠా ఫిర్యాదులు
దీంతో పింఛన్ల పంపిణీలో మళ్లీ మార్పు
ఫలితంగా బ్యాంకు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లో జమచేయాలని..
ప్రత్యేక పరిస్థితులున్న వారికి సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ఆదేశాలు
ఎప్పటికప్పుడు బాబు మాట మారుస్తూ అధికారులు, ప్రభుత్వంపై నిందలు
మే 1న సెలవు రోజైనా పింఛను మొత్తాన్ని జమచేయనున్న బ్యాంకులు
పింఛను లబ్ధిదారుల్లో ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పింఛను డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయాలి. సచివాలయాల దాకా వెళ్లి పింఛన్లు తీసుకోలేని వారికి మినహాయింపులు ఇవ్వొచ్చు. అలాంటి వారికి ఇంటి దగ్గరకు వెళ్లి ఇవ్వడానికి మా సిటిజన్ ఫర్ డెమోక్రసీకి అభ్యంతరంలేదు. ఇక బ్యాంకు అకౌంట్లులేని వారు సచివాలయంలో పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని ఈసీ అధికారులను కోరాం.
– చంద్రబాబు నమ్మినబంటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 20 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత మీడియాతో అన్న మాటలు.
తాము 2024 మార్చి 30న పేర్కొన్న ఆదేశాల ప్రకారం.. బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (బ్యాంకు ఖాతాలో జమచేసే) విధానంలో పింఛన్ల పంపిణీకే ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి.
– ఏప్రిల్ 26న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీచేసిన ఆదేశాల సారాంశం ఇది. ఏప్రిల్‌లో దివ్యాంగులకు ఇళ్లవద్దే.. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగించడంపైనా టీడీపీ–బీజేపీ–జనసేన నేతలు 20 రోజులుగా రోజూ ఫిర్యాదులు చేయడంతో ఈసీ జారీచేసిన ఆదేశాలివి.
టీడీపీ–బీజేపీ–జనసేన నేతల వరుస ఫిర్యాదులతో మే ఒకటి నుంచి చేపట్టే పింఛన్ల పంపిణీ డీబీటీ విధానంలో అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘమే స్పష్టంగా ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాలున్న 75 శాతం మంది పింఛనర్లకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ల జమకు అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 58 నెలలుగా ప్రతినెలా ఠంఛన్‌గా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీని నెలరోజుల క్రితం అడ్డుకున్న విషయం తెలిసిందే.
మళ్లీ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కూడా ఆ పంపిణీ కొనసాగకూడదంటూ రోజూ అదేపనిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి, మళ్లీ అవ్వాతాతలు తనపై ఎక్కడ ఆగ్రహం చూపుతారోనని భయంతో ‘పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా’ అంటూ చంద్రబాబు ఎప్పటిలాగే ప్లేటు ఫిరాయించారు. నిజానికి.. మొదటినుంచీ చంద్రబాబుది ఇదే తరహా రాజకీయం.
ఏ అంశంపైనైనా ముందు తప్పుచేసేసి దాన్ని సరిదిద్దుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తారు. రాష్ట్ర విభజన సమయంలో.. ప్రత్యేక హోదా తదితర అంశాల విషయంలో ఆయన అనేకమార్లు బొక్కబోర్లాపడినా తనదే పైచేయి అని బిల్డప్ ఇచ్చే రకం. ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని వలంటీర్లపై చంద్రబాబు అవలంబించిన వైఖరి కూడా అచ్చం ఇలాంటిదే.
నెలరోజుల క్రితం..
నిజానికి.. నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతినెలా ఠంఛనుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ కొనసాగగా.. ఈ వర్గానికి చెందిన ఓట్లు టీడీపీకి దక్కవేమోనన్న దుగ్థతో ఎన్నికల నేపథ్యంలో ఈ విధానంపై పచ్చముఠా ఇప్పుడు వరుసపెట్టి ఫిర్యాదులు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఈ ఏడాది మార్చి ఒకటిన ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అలాగే, చంద్రబాబు జేబులోని మనిషి, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అయితే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో అచ్చం ఇదే పనిమీద ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను దూరంగా ఉంచాలని రెండుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటివరకు ఇళ్లవద్దే ఇస్తున్న పింఛన్ల పంపిణీకి బ్రేకులు పడ్డాయి
. ఫలితంగా.. ఏప్రిల్ నెల దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందిలేకుండా వారికి ఇంటివద్దే పింఛన్లను పంపిణీ చేసి, మిగిలిన వారికి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. ఈ నిర్ణయంపై పింఛనర్లు తీవ్రస్థాయిలో రగిలిపోయారు. చంద్రబాబు, ఆయన ముఠా తీరుపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు.
ఆగని ఫిర్యాదులు..
చంద్రబాబు ముఠా కోరుకున్నట్లుగా తీసుకున్న ఈ పింఛన్ల పంపిణీ నిర్ణయం ఆయనకే బెడిసికొట్టింది. అనుకున్నదొకటి.. అయినదొక్కటి బోల్తాకొట్టిందిరో బాబు పిట్ట అన్నట్లుగా తయారైంది ఆయన పరిస్థితి. దీంతో తన సహజ లక్షణమైన యూటర్న్‌ను తీసేసుకున్నారు. అంతే.. మళ్లీ గత నెలరోజులుగా టీడీపీ–జనసేన–బీజేపీతో కూడా పచ్చబ్యాచ్ ఉమ్మడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగించింది.
ఇందులో భాగంగానే నిమ్మగడ్డ 20 రోజుల క్రితం మళ్లీ ఎన్నికల సంఘం అధికారులను కలిసి, పింఛన్ల పంపిణీ సచివాలయాల వద్ద కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. ఇలా దాదాపు రోజు మార్చి రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క.. తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్‌మెయిల్ చేసేలా నిత్యం కథనాలు రాయించి బ్యాంకుల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు.
సెలవైనా ఒకటినే బ్యాంకులో పింఛను..
మేడే కారణంగా బ్యాంకులకు సెలవు అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ఒకటో తేదీనే పింఛను డబ్బులను అందుబాటులో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదలచేసింది.
విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులతో పాటు తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్‌చైర్లకు పరిమితమయ్యే 16,57,361 మందికి ఒకటో తేదీ (బుధవారం) ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పంపిణీ చేపట్టేలా మంగళవారమే వారికి సంబంధించిన రూ.474.17 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు వెల్లడించారు.
మిగిలిన 48,92,503 మంది లబ్ధిదారుల పింఛన్ డబ్బులు బుధవారం బ్యాంకులకు సెలవు అయినప్పటికీ అదేరోజు ఉ.8 గంటల నుంచి వారి ఖాతాల్లో జమయ్యేలా అన్ని బ్యాంకులు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
– సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment