1వ తేదీనే పింఛను పంపిణీ మొదలు.. జూన్ నెలకూ ఇదే విధానం
ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానం అయిన వారందరికీ ఈ విధానంలోనే..
అనారోగ్యంతో పింఛను పొందుతున్న వారు, మంచం/వీల్‌చైర్‌కే పరిమితమైన వారికి ఇంటివద్దే పంపిణీ
దివ్యాంగులు, అమరజవానుల భార్యలకూ ఇంటి వద్దే పింఛను
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు
రాష్ట్రంలో మొత్తం 65.49 లక్షల మంది లబ్ధిదారులు.. దాదాపు 48.92 లక్షల మందికి బ్యాంకు ఖాతాలో జమ
ఖాతాలో జమ అయిన వెంటనే బ్యాంకు నుంచి మెసేజ్
ఎవరికి ఎలా పింఛన్ ఇస్తారన్న వివరాలు సచివాలయాల్లో ప్రదర్శన
సాక్షి, అమరావతి: మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) విధానంలో లబ్ధిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు.
ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది.
అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్‌ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది.
పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment