సాక్షి, అమరావతి: ‘పెన్షన్‌ను క్రమంగా మూడు వేల వరకు పెంచుకుంటూపోతాం’ అని చెప్పిన మాటను, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు అడుగులు ముందుకు వేశారు. ‘నూతన సంవత్సర శుభదినాన, పెన్షన్‌ను మరో రూ.250 పెంచుతూ నెలకు రూ.2,750 చేస్తున్నాను. కరోనా కష్టాలు వెంటాడినప్పటికీ అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ముఖాల్లో ఆనందం చూడాలన్న తపనతో ఏటా రూ.19,000 కోట్ల పెన్షన్ ఖర్చును చిరునవ్వుతో మనందరి ప్రభుత్వం భరించింది’ అని వివరిస్తూ రాష్ట్రంలోని పింఛను లబ్ధిదారులకు స్వయంగా లేఖ రాశారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పింఛన్లపై మాత్రమే చేసిన ఖర్చు రూ.62,500 కోట్లకు చేరుతుందని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ పెంపు నేపథ్యంలో జనవరి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పెంపు వారోత్సవాలను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారం రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మండల, మున్సిపాలిటీల వారీగా సమావేశాలు నిర్వహించి.. ముఖ్యమంత్రి లబ్ధిదారులకు రాసిన లేఖలను వారికి స్వయంగా అందజేయనున్నారు. సీఎం లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి.
గత ప్రభుత్వంలో మీరు పడ్డ కష్టాలన్నీ తెలుసు
‘గత అసెంబ్లీ ఎన్నికల ముందు నా సుదీర్ఘ పాదయాత్రలో మీ కష్టాలు దగ్గర నుంచి చూశాను. మీ కన్నీటి గాథలు స్వయంగా విన్నాను. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఇచ్చే పెన్షన్ అందుకోవడానికి పెద్ద వయస్సులో ఆత్మాభిమానాన్ని సైతం చంపుకొని జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, చెప్పులు అరిగేలా తిరగడం గమనించాను. గత ప్రభుత్వంలో పింఛను మంజూరుకు అర్హులను గుర్తించే పద్ధతి అంటూ ఏదీ లేదు.
దిక్కుమాలిన జన్మభూమి కమిటీల సభ్యులు అప్పట్లో లంచాలు ఇస్తేనే.. అదీ తమ వర్గం, పార్టీ వారైతేనే పింఛను మంజూరు చేసే పరిస్థితి. ఇచ్చే పింఛను డబ్బులు అందుకోవడానికి కూడా వృద్ధులు, దివ్యాంగులు రోజుల తరబడి చేంతాడంత క్యూలో పడ్డ కష్టాలు చూశాను. గత అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పింఛన్ల కోసం అప్పటి ప్రభుత్వం ముష్టి వేసినట్టు నెలకు రూ.400 కోట్ల ఖర్చుతో మాత్రమే ఒక్కొక్కరికి రూ.1,000 పింఛన్ ఇచ్చి చేతులు దులుపుకుంది.
అవ్వాతాతలు సహా పింఛన్‌దారులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ
అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే..
అవ్వాతాతల కన్నీళ్లు తుడవాలని, వారి మొఖంలో చిరునవ్వులు చిందించాలని ఎన్నికల మేనిఫెస్టోలోనే పెన్షన్‌ను దశల వారీగా పెంచుకుంటూ మూడు వేల వరకు చేస్తానని మాట ఇచ్చాను. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, పింఛన్ రూ.2,250కి పెంచుతూ తొలి సంతకం చేశాను. ప్రతి నెలా మొదటి రోజే మీ గడప వద్దకే వచ్చి.. మీ తలుపు తట్టి.. పింఛను డబ్బులు మీకు అందించేలా వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాను. కరోనా కారణంగా కష్టాలు ఉన్నా, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకున్నా.. మీ కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రతి నెలా ఒకటవ తేదీనే ఠంఛన్‌గా పింఛను అందించగలుగుతున్నా.
లంచాలు, వివక్షకు తావులేకుండా..
గత ప్రభుత్వం పింఛన్లు ఎలా తగ్గించాలా అనే కోణంలో ఆలోచిస్తే, మన ప్రభుత్వం అర్హులు ఏ ఒక్కరూ పెన్షన్‌కు దూరం కూడదన్న దిశగా ఆలోచన చేస్తోంది. అందుకే అత్యంత పారదర్శకంగా.. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ అనే తారతమ్యం లేకుండా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హులైతే చాలు ప్రతి ఒక్కరికీ నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పింఛన్లు అందిస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నా.
గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శించి, సామాజిక తనిఖీల ద్వారా అర్హులను గుర్తించి పింఛన్లు అందిస్తున్నాం. ఏ కారణం చేతనైనా అర్హులెవరైనా మిగిలిపోయినా, వారికి మరోసారి అవకాశం ఇస్తూ మళ్లీ దరఖాస్తు చేసుకుంటే సంబంధిత పత్రాలు ధ్రువీకరించుకొని వారికి కూడా ప్రతి ఏటా జూలై, డిసెంబర్ నెలల్లో పింఛన్లు అందజేస్తున్నాం.
గత పాలకులు దిగిపోయే ముందు ఆరు నెలల వరకు ఇచ్చిన ఫించన్ల సంఖ్య 39 లక్షలు అయితే, నేడు మన ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు దాదాపు 62 లక్షలకు పైమాటే. గత ప్రభుత్వం పింఛన్ల మీద ఖర్చు పెట్టింది నెలకు రూ.400 కోట్లు అయితే, నేడు మన ప్రభుత్వం నెలకు ఖర్చు చేస్తోంది రూ.1,786.41 కోట్లు. అంటే నాలుగున్నర రెట్లు ఎక్కువ. ఈ మాటను సగర్వంగా చెబుతున్నా. మీకు మంచి చేసే అవకాశం మళ్లీ మళ్లీ రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’
మరో అడుగు ముందుకు
Published Sun, Dec 25 2022 3:57 AM | Last Updated on Sun, Dec 25 2022 10:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment