నవతరం కదలాలి.. పోలింగ్‌ పెరగాలి...  | Sakshi
Sakshi News home page

నవతరం కదలాలి.. పోలింగ్‌ పెరగాలి... 

Published Sun, Apr 28 2024 6:05 AM

20 percent of voters are below 30 years of age: Andhra Pradesh

 20 శాతం ఓటర్లు 30 ఏళ్లలోపు వారే 

రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.10 కోట్లు 

అందులో 30 ఏళ్లలోపుఓటర్ల సంఖ్య 79.03 లక్షలు 

తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న వారు 8.25 లక్షలు 

85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు 2.12 లక్షలు 

వారికి ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం 

5.17 లక్షల దివ్యాంగ ఓటర్ల కోసం పోలింగ్‌స్టేషన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు 

యువతరమే ముందు యుగం దూతలు..పావన నవజీవన, బృందావన నిర్మాతలు... అని  శ్రీశ్రీ ఒక పాటలో అభివర్మించారు.. వారు తల్చుకుంటే సమాజాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లగలరని కొనియాడారు. అది నూరు శాతం వాస్తవం. ముఖ్యంగా  ఎన్నికల్లో వారి పాత్ర కీలకం... యువత ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రానికి రావాలే కానీ రాజకీయ తీరుతెన్నులే మారిపోతాయి. సంక్షేమానికి పట్టం కడుతున్నదెవరో, ఓట్ల కోసం మేనిఫెస్టోలనే బుట్టదాఖలు చేస్తున్నదెవరో యువత ఇట్టే గ్రహిస్తుంది.

అణగారిన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలనే తపన పడేదెవరో– ఆ వర్గాల వంచకులెవరో గుర్తించే శక్తియుక్తులు వారికే ఉన్నాయి...దేశంలో ఈ సారి తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకోబోతున్న యువత 1.85 కోట్ల మంది. ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుంటే మొత్తం ఓటర్లలో 20 శాతం 30 ఏళ్లలోపు యువతే ఉంది...ఎన్నికల సంఘం ఈ యువతను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించే దిశగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  

సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను యువ ఓటర్లు దిశా నిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 30 ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులో 18 నుంచి 19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1.85 కోట్లు. దీంతో ఈ సారి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ యువ ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు ముందుకేస్తున్నాయి. మన రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 4.10 కోట్ల ఓటర్లలో సుమారు 20 శాతం మంది 30 ఏళ్లలోపే ఉన్నారు.

18 నుంచి 30 ఏళ్లలోపు మొత్తం 79.03 లక్షల మంది ఉంటే అందులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 18–19 ఏళ్ల వారు 8.25 లక్షల మంది ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వీరంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను తెలియచేసే విధంగా సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పారి్టసిపేషన్‌ (స్వీప్‌) పేరిట కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రెటీలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

వయోవృద్ధులకు ఇంటి వద్దే.. 
రాష్ట్రంలో తొలిసారిగా 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు పోలింగ్‌ బూతులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేమనుకున్న వారు ముందుగా నమోదు చేసుకుంటే అధికారులు ఇంటి వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు  చేస్తారు. రాష్ట్రంలో 2.12 లక్షల మంది ఓటర్లు 85 ఏళ్లు దాటిన వారు ఉన్నారని, వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘ అధికారులు వెల్లడిస్తున్నారు.

దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నేరుగా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 5.17లక్షల దివ్యాంగ ఓటర్లు ఉండటంతో వారు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని 83 శాతం దాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Advertisement
Advertisement