111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు.. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు
3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపు
రాత్రి 9 గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాల ప్రకటన
సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్‌కు ఏపీ సీఈవో మీనా వెల్లడి
జాప్యం లేకుండా లెక్కింపు జరగాలి.. ఫలితాలు కచ్చితంగా ఉండాలి
ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులు, ఏజెంట్లకు అవగాహన కల్పించండి
గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలి
రాష్ట్ర అధికారులకు నితీష్ వ్యాస్ ఆదేశం
సాక్షి, అమరావతి: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపే ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్లు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు సాయంత్రం 4 గంటల్లోపు వస్తాయన్నారు.
మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రం 6.00 గంటల్లోపు వీటి ఫలితాలు రావొచ్చని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు టేబుళ్లను పెంచి సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాత్రి 8 – 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమీక్షించారు.
లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కౌంటింగ్‌కు చేపట్టిన ఏర్పాట్లను సీఈవో మీనా వివరించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్ అమలుతో పాటు ఆ జిల్లాల్లో సీనియర్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డిజీపీతో పాటు తాను కూడా పల్నాడు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.
ఓట్ల లెక్కింపులో లోపాలు జరగకూడదు
ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఎటువంటి లోపాలు, జాప్యం జరగడానికి వీల్లేదని, అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరితగతిన కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ రాష్ట్ర అధికారులకు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21 సీ, 21ఈలను అదే రోజు ఫ్లైట్‌లో ఈసీకి పంపాలని ఆదేశించారు.
ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా లెక్కింపు ప్రక్రియపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల్లో కూలీల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించొద్దని చెప్పారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగినందున, ఈ జిల్లా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్ బాగ్చీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేశామని, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు చేపడుతున్న చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణకు చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు నితీష్ వ్యాస్‌కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో హరేంధిర ప్రసాద్, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తదితరులు వారి నియోజకవర్గాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment