రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జూన్ 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఏజెంట్లు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి గురువారం వచ్చిన ఆయన కృష్ణా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.
అక్కడ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు.. భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ చేసిన, చేయనున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆస్మిలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాల వారిగా లెక్కింపు కేంద్రాలు, టెబుళ్లు, రౌండ్ల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా వారి ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని కౌంటింగ్ హాల్ నుండి బయటకు పంపేస్తామన్నారు. కౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ముఖేష్‌కుమార్ మీనా అధికారులకు సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ల అంశం సీఈసీ పరిధిలో ఉంది..
పోస్టల్ బ్యాలెట్లపై వైఎస్సార్‌సీపీ చేసిన విన్నపాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, అది సీఈసీ పరిధిలో ఉందని ముఖేష్‌కుమార్ మీనా వెల్లడించారు. నేడో, రేపో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, గన్నవరం రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మ, డీఆర్‌ఓ కె.చంద్రశేఖరరావు, పలువురు రిటర్నింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి షాహిద్ బాబు, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడీ మనీషా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment