ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు
నిష్పక్షపాతంగా నిర్వహించే బాధ్యత డీఈవోలు, ఎస్పీలదే
ఎండల నేపథ్యంలో ఓటర్లకు తగిన ఏర్పాట్లు చేయండి
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి
ముందస్తు ఏర్పాట్ల సమీక్షలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఈ బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందన్నారు. ఓర్పు, సమన్వయంతో వ్యవహరించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి హింసకు, రీపోలింగ్‌కు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, మద్యం, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్టుల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గోవా, హరియాణాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తు చేయాలని ఆదేశించారు. వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచితూచి అడుగేయాలని, వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్రమంతా ఒకే విధానాన్ని అనుసరించేలా త్వరలో నిర్దిష్ట నిబంధనలను (ఎస్‌వోపీ) ప్రకటించనున్నామని తెలిపారు.
10 లక్షలు దాటితే ఐటీకి సమాచారం ఇవ్వండి..
రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూ ప్రత్యేక సాధారణ పరిశీలకులు రాష్ట్ర పర్యటన సందర్భంగా చేసిన పలు సూచనలను డీఈవో, ఎస్పీలకు వివరించారు. రూ.10 లక్షలకు పైబడి జప్తు చేసిన నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. మద్యం, గంజాయి రవాణా చేసే కింగ్‌పిన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అదనపు సీఈవో పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ అదనంగా ఏఆర్వోలు కావాల్సినవారు సంబంధిత జాబితాలను మూడు రోజుల్లో సీఈవో కార్యాలయానికి పంపిస్తే, వాటిని కన్సాలిడేట్ చేసి ఈసీ ఆమోదం కోసం పంపిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవో హరేందిరప్రసాద్, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో కె.విశ్వేశ్వరరావు, అసిస్టెంట్ సీఈవో తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు చేపట్టాలి..
రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటా ప్రచారానికి ముందుగా పొందాల్సిన అనుమతి విషయంలో మరింత స్పష్టత కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని మీనా చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తగిన వివరణ అందేలోపు ఇంటింటా ప్రచారానికి అభ్యర్థులు సంబంధిత ఆర్వో, పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తే సరిపోతుందన్నారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిందని, వీరే ఈసీకి కళ్లు, చెవులు వంటి వారని తెలిపారు.
ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో ప్రత్యేక సాధారణ పరిశీలకులు, ప్రత్యేక వ్యయ పరిశీలకులు సంతృప్తి చెందేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమ కార్యాలయం నుంచి పంపించే ఫిర్యాదులపై జిల్లా స్థాయిలోనే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకున్నాకే నివేదిక పంపాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment