న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార పర్వంలో పిల్లజెల్లా ముసలిముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి భాగస్వాములను చేసే రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు పంపింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీల్లో నినాదాలు ఇవ్వాలంటూ పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని పార్టీలకు ఈసీ స్పష్టంచేసింది. ఎన్నికల సంబంధ పనులు, కార్యక్రమాల్లో పార్టీలు పిల్లలను వాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనా ఉందంటూ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బందికి మరోసారి గుర్తుచేసింది.
ఎన్నికల పర్వంలో పిల్లలు ఎక్కడా కనిపించొద్దని, వారిని ఏ పనులకూ వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు ఈసీ తాజాగా ఒక అడ్వైజరీని పంపింది. ‘‘బాల కార్మిక చట్టాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్‌లదే. క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా ఈ బాధ్యతలు నెరవేర్చండి’’ అని ఈసీ పేర్కొంది. ‘‘ప్రచారంలో నేతలు చిన్నారులను ఎత్తుకుని ముద్దాడటం, పైకెత్తి అభివాదంచేయడం, వాహనాలు, ర్యాలీల్లో వారిని తమ వెంట బెట్టుకుని తిరగడం వంటివి చేయకూడదు.
పిల్లలతో నినాదాలు ఇప్పించడం, పాటలు పాడించడం, వారితో చిన్నపాటి ప్రసంగాలు ఇప్పించడంసహా పార్టీ ప్రచారాల్లో ఎక్కడా చిన్నారులు ఉపయోగించుకోకూడదు. వారు ప్రచార కార్యక్రమాల్లో కనిపించకూడదు’’ అని తన అడ్వైజరీలో స్పష్టంచేసింది. మరి కొద్ది వారాల్లో సార్వత్రిక ఎన్నికల మొదలుకానున్న నేపథ్యంలో ప్రచారపర్వంలో పార్టీలు ప్రజాస్వామ్య విలువలకు పట్టంకట్టాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంబంధ కార్యకలాపాల్లో మైనర్లను వినియోగించకూడదని, వినియోగిస్తే కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లేనని బాంబే హైకోర్టు 2014లో ఇచ్చిన ఇక ఉత్తర్వును రాజీవ్ కుమార్ పునరుధ్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment