
తొలిసారిగా బిహార్‌లో శాసనసభ ఎన్నికల్లో కొత్త రూల్స్
నూతన నిబంధనల్ని అమలుచేయనున్న ఎన్నికల సంఘం
పట్నా: బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నడుంబిగించింది. ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం) బ్యాలెట్ పేపర్ లేఔట్‌లో ఆధునిక మార్పులు తేనున్నట్లు ఈసీ ప్రకటించింది.
గతంలో ఈవీఎం లేఔట్‌పై అభ్యర్థుల ఫొటోలు నలుపు,తెలుపు రంగులో ఉండేవి. కొందరి ఫొటోలైతే అస్సలు ముద్రించకపోయేవాళ్లు. ఇకపై కలర్ ఫొటోలను ముద్రించి ఓటర్లు సులభంగా తమ అభ్యర్థులను గుర్తించే వెసులుబాటు కల్పించనున్నారు. ఫొటో కోసం కేటాయించిన మొత్తం ప్రదేశంలో ముప్పావువంతు సైజులో ఫొటో పెద్దగా కని్పంచనుంది. దీంతో కంటి సమస్యలున్న ఓటర్లు సైతం తమ అభ్యర్థి ముఖాన్ని స్పష్టంగా చూశాకే ఓటేసే అవకాశమొచ్చింది.
కొత్తగా వచ్చిన మార్పులేంటి?
→ అభ్యర్థి సీరియల్ నంబర్‌తోపాటు ‘ఎవరికి ఓటు వేయబోము(నన్ ఆఫ్ ది ఎబో–నోటా) అనే ఆప్షన్ సైతం పెద్ద సైజులో ఉండనుంది.
→ అంతర్జాతీయ భారతీయ అంకెల విధానమైన లక్షలు, కోట్లు వంటి వాటిని సైతం ఉపయోగించనున్నారు. ఈ అంకెలను 30 నంబర్ ఫాంట్‌సైజులో ముద్రిస్తారు.
→ స్పష్టంగా కనిపించేందుకు మందంగా బోల్డ్‌లో ప్రింట్‌చేస్తారు.
→ అభ్యర్థుల అందరి పేర్లు ఒకే పరిమాణంలో కన్పించేలా ఒకే నంబర్ ఫాంట్ సైజును ఉపయోగించనున్నారు. నోటాకు సైతం ఇదే వర్తించనుంది. లిపి(ఫాంట్) రకాలు వేర్వేరుకాకుండా ఒకే రకం ఫాంట్‌ను వాడనున్నారు
→ చదరపు మీటర్‌కు 70 గ్రాముల బరువు ఉండే 70 జీఎస్‌ఎం గ్రేడ్ పేపర్‌ను ఈవీఎం బ్యాలెట్ పేపర్ ముద్రణ కోసం ఉపయోగిస్తారు. శాసనసభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీరంగు పేపర్‌ను ఉపయోగిస్తారు. అందులోనూ పింక్, రెడ్, గ్రీన్‌లను ప్రత్యేకంగా వాడనున్నారు.
→ బిహార్‌లోనే తొలిసారిగా ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నారు.