కోడ్‌ ఉల్లంఘిస్తే కొరడా | EC cases against those violating election rules | Sakshi
Sakshi News home page

కోడ్‌ ఉల్లంఘిస్తే కొరడా

Published Sat, Apr 6 2024 2:49 AM | Last Updated on Sat, Apr 6 2024 11:20 AM

EC cases against those violating election rules - Sakshi

నియమావళిని ఉల్లంఘిస్తున్న వారిపై ఈసీ కేసులు

నోటిఫికేషన్‌ రాకుండానే 4,584 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు 

రూ.47.49 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు జప్తు 

సీ–విజిల్‌ ద్వారా 7,838 ఫిర్యాదులు.. 100 నిమిషాల్లోనే 90 శాతం పరిష్కారం 

ఇప్పటివరకు 8,681 లైసెన్స్‌డ్‌ ఆయుధాలు స్వాధీనం 

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై 5,07,561 బ్యానర్లు, హోర్డింగుల తొలగింపు

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు, రీపోలింగ్‌ వంటివి లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అందుకోసం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఏపీలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానప్పటికీ షెడ్యూల్‌ విడుదలైన మార్చి 16 నుంచే ఈసీ కొరడా ఝుళిపిస్తోంది. అప్పటినుంచే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేస్తోంది.

షెడ్యూల్‌ విడుదలైన 20 రోజుల్లోనే కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి 4,584  ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 4,337 ఎఫ్‌ఐఆర్‌లు నగదు, వస్తువుల జప్తుకు సంబంధించినవి కాగా,  అనుమతుల్లేకుండా నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్న వారిపై 247 కేసులు నమోదు చేశారు.

నేరుగా ఫిర్యాదుకు నిర్దేశిత సమయం
రోజు సా.4–5 గంటల మధ్య స్వీకరణ 
సాధారణ ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల సంఘాన్ని నేరుగా కలిసి ఫిర్యాదు లేదా విజ్ఞాపనపత్రం ఇవ్వాలనుకనే వారికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నిర్దేశిత సమయాన్ని కేటాయించింది. ప్రతిరోజు సా.4–5 గంటల మధ్య తమకు నేరుగా అందజేయవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయ పనిదినాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా తాము కార్యాలయంలో అందుబాటులో ఉంటే అందజేయవచ్చన్నారు.

తాను కార్యాలయంలో అందుబాటులో లేని పక్షంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారులకు లేదా సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారికి అందజేయవచ్చన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో ఫిర్యాదులివ్వడానికి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌ రూమ్‌ నెం.129 లోని ఫిర్యాదు సెల్‌లో అందుబాటులో ఉంటుందని ముకే‹Ùకుమార్‌ పేర్కొన్నారు.

రూ.47.49 కోట్లు జప్తు.. 
ఇక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఏప్రిల్‌ 5 వరకు రూ.47.49 కోట్ల విలువైన ఆస్తుల­ను జప్తు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి­కారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో.. 
నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్న రూ.17.85 కోట్ల నగదు, రూ.8.82 కోట్ల విలువైన మద్యం, రూ.1.63 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.12.36 కోట్ల విలువైన బంగారం వంటి విలువైన లోహాలను స్వాదీనం చేసుకున్నారు.  
  ఇవికాక.. ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు సిద్ధంచేసిన రూ.1.56 కోట్ల విలువైన వివిధ వస్తువులతో పాటు రూ.5.24 కోట్ల విలువైన ఇతర సామగ్రిని స్వాదీనం  చేసుకున్నట్లు పేర్కొంది.  
♦ ఎన్నికల వేళ లైసెన్స్‌లు కలిగిన ఆయుధాలను పోలింగ్‌ స్టేషన్‌లో సమర్పించాల్సి ఉండగా ఇప్పటివరకు 8,681 ఆయుధాలను డిపాజిట్‌ చేయగా ఇంకా 17 చేయాల్సి ఉంది. 
మరోవైపు.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 32 హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. అలాగే, ఎన్నికల సందర్భంగా సమస్యలను సృష్టించడానికి అవకాశమున్న 432 మందిని గుర్తించామని ఇంకా 21 మందికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్స్‌ జారీచేయాల్సి ఉందని ఈసీ పేర్కొంది.  
♦ సీ–విజిల్‌ యాప్‌ ద్వారా 7,838 ఫిర్యాదులు రాగా అందులో 90 శాతం కేసులను నిర్దేశిత 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు తెలిపింది. 
♦ రాష్ట్రంలోను, రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా కోసం 298 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 
♦ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై ఏర్పాటుచేసిన 5,07,561 బ్యానర్లు, హోర్డింగులు తొలగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement