పారదర్శకతకు పాతర | Sakshi Editorial On Central Election Commission | Sakshi
Sakshi News home page

పారదర్శకతకు పాతర

Published Tue, Dec 24 2024 12:17 AM | Last Updated on Tue, Dec 24 2024 12:17 AM

Sakshi Editorial On Central Election Commission

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలిపై, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్న వేళ... అవి మరింత పెరిగే ప్రమాదం తాజాగా తలెత్తింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్ని మారుస్తున్నట్టు కేంద్ర సర్కార్‌ శుక్రవారం ప్రకటించింది. నిబంధనల్లో సరికొత్త సవరణ వల్ల ఇకపై ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలనూ పరిశీలించే అవకాశం ప్రజలకు ఉండదు. సీసీ టీవీ, వెబ్‌కాస్టింగ్‌ ఫుటేజ్, అభ్యర్థుల వీడియో రికార్డింగుల లాంటి ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్లు ఇకపై అందుబాటులో ఉండవు. 

అదేమంటే, అలాంటివన్నిటినీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచితే వాటిని దుర్వినియోగం చేస్తారనీ, అసలు ఓటరు భద్రతకే ప్రమాదకరమనీ పాలక వర్గాల వాదన. సోషల్‌ మీడియా యుగంలో, పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్ల దృశ్యాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అది వట్టి డొల్ల వాదనే. ఎన్నికల నిబంధనల్లో మార్పుపై దేశ వ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నది అందుకే!

‘‘ఎన్నికకు సంబంధించిన మిగిలిన అన్ని పత్రాలనూ ప్రజాక్షేత్రంలో పరిశీలించేందుకు వీలుండాలి’’ అని 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌ 93(2)(ఎ) చెబుతోంది. దానికే ఇప్పుడు సవరణ చేశారు. ఈసీ సిఫార్సు మేరకు, కేంద్ర న్యాయశాఖ ఈ మార్పును నోటిఫై చేసింది. దాంతో, ఇప్పుడిక నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్న పత్రాలను మాత్రమే జనం పరిశీలించవచ్చన్న మాట. అంతేకాదు... ఎన్నికల పత్రాలన్నిటినీ కోరినవారికి ఇవ్వాలంటూ ఈసీని ఇక కోర్టులు ఆదేశించడానికి వీలుండదు. 

చిత్రమేమంటే, ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్‌ కేంద్రంలో పోలైన ఓట్లకు సంబంధించిన పత్రాల కాపీలు, సెక్యూరిటీ కెమెరాలోని ఫుటేజ్, వీడియోలను ఓ పిటిషనర్‌కు అందించాల్సిందిగా పంజాబ్‌ – హర్యానా హైకోర్ట్‌ సరిగ్గా ఈ నెల 9వ తేదీనే ఆదేశా లిచ్చింది. 

అక్టోబర్‌ నాటి ఎన్నికల్లో అభ్యర్థి కాదు గనక సదరు పిటిషనర్‌ ఆ పత్రాలు కోరరాదని ఈసీ వాదించింది. హైకోర్ట్‌ మాత్రం అభ్యర్థికైతే ఉచితంగా, ఇతరులకైతే రుసుముపై పత్రాలివ్వాలన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవించింది. కోర్టు ఆదేశాన్ని తప్పక పాటించాల్సిన  పరిస్థితి. కానీ, తద్భిన్నంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని సవరించడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తున్నప్పుడే, సామాన్య ఓటర్లకున్న తిరుగులేని సమాచార హక్కును సుప్రీమ్‌ కోర్ట్‌ నొక్కి వక్కాణించింది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తుల, సంస్థల వివరాలు తెలుసుకొనే హక్కు ప్రజలకుందని తేల్చి చెప్పింది. వివాదాస్పద బాండ్ల పథకాన్ని సమర్థించిన సర్కారుకు అది ఎదురుదెబ్బ. 

నిజానికి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, నిజాయతీలో రాజీకి తావు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అప్పుడే స్పష్టం చేసినట్టయింది. అయినా సరే, ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా ఇప్పుడు ఈసీ సిఫార్సు పేరు చెబుతూ, నిబంధనల సవరణకు దిగడం ప్రజాస్వామ్యవాదులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం. 

ఓటర్లే స్వయంగా తమ ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియా సాక్షిగా పంచుకుంటున్న రోజుల్లో సీసీ టీవీ దృశ్యాల పట్ల ఈసీ ఇంత హంగామా ఎందుకు చేస్తోందో అంతుపట్టదు. సీసీ టీవీ ఫుటేజ్‌ అందుబాటులో ఉంటే కృత్రిమ మేధతో దుర్వినియోగం చేసే ముప్పుందన్న ఈసీ వాదన కొంత నిజమైనా, డిజిటల్‌ యుగంలో అన్ని వీడియోలపై నిషేధం పెడతామా? సవాలుకు అది పరిష్కారం కాదు కదా!

ఎన్నికల సంఘం సారథ్యంలో నిఖర్సుగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియ తాలూకు నైతిక నిష్ఠ శరవేగంగా హరించుకుపోతోందంటూ ప్రతిపక్షాలు అసలే గొంతు చించుకుంటున్న సమయంలో నిబంధనల్లో ఈ కొత్త సవరణలు చేయ డాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికల రికార్డులనూ, డేటాను ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంచాలన్న జ్ఞానోదయం హఠాత్తుగా పాలకులకూ, ఈసీకీ ఎందుకు కలిగినట్టు? జనం దృష్టి నుంచి ఏం దాచాలని చూస్తున్నారు? ప్రతిపక్షాలనే కాదు... పౌరులనూ వేధిస్తున్న ప్రశ్నలివి. పైగా విస్తృత స్థాయి చర్చ జరగకుండానే చేపట్టిన ఈ తొందరపాటు చర్య ఎన్నికల ప్రక్రియపై మరిన్ని అనుమానాలు పెంచేలా పరిణమిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అది మరింత విషాదం. 

వాస్తవానికి భిన్న భౌగోళిక పరిస్థితులు, భాషలు, సంస్కృతులు, సమస్యలున్న సువిశాల దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా ఇన్నేళ్ళుగా విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తూ రావడం గొప్పే. అందుకు మన రాజ్యాంగం ఏర్పరచిన సుస్థిర వ్యవస్థనూ, గత దశాబ్దాల్లో ఈసీ పాత్రనూ తప్పక ప్రశంసించాల్సిందే. కానీ ఏ ఎన్నికల ప్రక్రియకైనా పారదర్శకత ప్రాణాధారం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికీ అదే కీలకం. 

తీరా ఆ పారదర్శకతే ఇప్పుడు రానురానూ తగ్గుతూ పోతుంటే ఏమనాలి? ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకొనే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నట్టు? అందులోనూ ఆంధ్రప్రదేశ్, హర్యానా సహా అనేక చోట్ల ఎన్నికల్లో ఈవీఎంలపై, వీవీప్యాట్లపై నీలినీడలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ తరహా కొత్త నిబంధనతో పాలకులు ఏ రకమైన సూచన ఇవ్వదలిచినట్టు? ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసం పాదుకొనాలంటే, ఈ సరికొత్త నిబంధనల మార్పును పునఃపరిశీలించాలి. స్వతంత్రంగా సాగాల్సిన ఈసీ పాలకుల చేతిలో మరబొమ్మగా మారిపోతున్నట్టు విమర్శలు పెల్లుబుకుతున్న సందర్భంలో అది అత్యవసరం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement