మరో మహా యుద్ధం! | Sakshi Editorial On Maharashtra and Jharkhand Assembly Elections | Sakshi
Sakshi News home page

మరో మహా యుద్ధం!

Published Thu, Oct 17 2024 12:30 AM | Last Updated on Thu, Oct 17 2024 4:10 AM

Sakshi Editorial On Maharashtra and Jharkhand Assembly Elections

మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ తర్వాత దేశంలో అత్యధికంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్‌ 13న, మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌కు నవంబర్‌ 13, 20లలో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. 

ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినా, సొంతకాళ్ళపై సర్కారు నడపలేని పరిస్థితి. కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఇది కొంత ఊపు తెచ్చినా, తాజా హర్యానా ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కడంతో బ్రేకులు పడ్డాయి. ఇక, ఇప్పుడీ మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలతో ఎన్నికల గోదాలో ఈ ఏడాది ఆఖరి పంచ్‌ ఏ పార్టీది అవుతుందన్నది తేలనుంది. 

దేశానికి వాణిజ్య కూడలి లాంటి కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ సారథ్య మహాయుతి కూటమికీ, శివసేన (ఉద్ధవ్‌ బాల్‌ఠాక్రే) – జాతీయవాద కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ – శరద్‌పవార్‌) – కాంగ్రెస్‌ల మహా వికాస్‌ ఆఘాడీ (ఎంవీఏ) కూటమికీ మధ్య పోరు రసవత్తరమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలిచిన బీజేపీ – సేన కూటమి, 2024లో 17కే పరిమితమైంది. ఇంత దెబ్బ తగిలినా, కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్‌ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి, సీఎం ఏక్‌నాథ్‌ శిండే రాష్ట్రంలో మళ్ళీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. 

అయితే, రెండేళ్ళలో రెండు పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజా భావన, అధికారపక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ప్రతిపక్షానికే అనుకూలిస్తాయని ఓ అంచనా. ఇక, స్థానిక పార్టీలైన శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలాక ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకొనేందుకు ఈ అసెంబ్లీ పోరు సిసలైన క్షేత్రస్థాయి పరీక్ష కానుంది. 

హర్యానాతో బీజేపీ పుంజుకుంటే, ప్రతిపక్ష కూటమిలో ఎక్కువ సీట్లు కోరి పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్‌ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. మోదీ, అమిత్‌షాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యటిస్తున్న నేపథ్యంలో... విపక్ష కూటమి విభేదాలు మరిచి, సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చూపి, తమ వ్యూహానికి పదును పెట్టుకోకుంటే చిక్కులు తప్పవు. 

జార్ఖండ్‌ అసెంబ్లీకి జేఎంఎంతో కలసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇప్పటి దాకా చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. రెండు విడతల్లో జరగనున్న జార్ఖండ్‌ ఎన్నికలు ఆసక్తికరమైనవి. వాజ్‌పేయి హయాంలో 2000లో రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జార్ఖండ్‌లో జేఎంఎం అయిదేళ్ళ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి. 

గతంలో ఆ పార్టీ అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినా, ప్రతిసారీ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును రాష్ట్రంలో కొనసాగించాలని ‘ఇండియా’ కూటమి ఉబలాటపడుతుంటే, హర్యానా ఫలితాల ఉత్సాహంతో ఈ గిరిజన రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాల ఆసరాగా అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. 

ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ దక్షిణ బిహార్‌ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ ఒకప్పుడు హేమంత్‌ తండ్రి, జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌ ఉద్యమం చేసి, విజయం సాధించారు. ఆనాటి నుంచి గిరిజన ఓటర్లు ఆ పార్టీకి రాజకీయ అండ. హేమంత్, ఆయన కూటమి ఆ గిరిజన ఓటుబ్యాంకును నమ్ముకున్నారు. 

దానికి తోడు అక్రమ ఆస్తుల కేసులో హేమంత్‌ అరెస్ట్‌ వ్యవహారాన్ని చూపి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల ఆత్మగౌరవ అంశాన్ని లేవనెత్తాలని జేఎంఎం ప్రయత్నం. సంథాల్‌ పరగణా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి కాంగ్రెస్‌ సత్తా ఉపకరిస్తుందని ఆలోచన. ఇక, రాష్ట్రానికి తొలి సీఎం అయిన గిరిజనుడు బాబూలాల్‌ మరాండీ ప్రతిపక్ష నేతగా తమ వెంట ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. 

2015 – 2020 మధ్య గిరిజనేతర నాయకత్వంతో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న కాషాయపార్టీ పాఠాలు నేర్చుకుంది. ఈసారి స్థానిక వర్గాలతో వ్యూహాత్మక సర్దు బాట్లకు దిగింది. ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌తో జట్టు కట్టి కుర్మీ ఓట్లపై కన్నేసింది. మాజీ సీఎం చంపాయ్‌ సోరెన్‌ను పార్టీలోకి తీసుకొని గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తోంది. వెరసి, జార్ఖండ్‌ ఎన్నికలు సైతం ఆసక్తికరంగా మారాయి. 

పార్టీల వ్యూహాలు అటుంచితే, ఈవీఎంలపై వివాదం, ఈసీ వ్యవహార శైలిపై అనుమానాలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 4 విడతల పోలింగ్‌కు సవాలక్ష కారణాలు చెప్పిన ఈసీ ఎక్కువ స్థానాలుండే అసెంబ్లీకి మాత్రం ఒకే విడత పోలింగ్‌ జరపడం విచిత్రమే. 

అలాగే, జార్ఖండ్‌ ఎన్నికల షెడ్యూల్‌ మంగళవారం ప్రకటించనున్నారని అస్సామ్‌ సీఎం హేమంత్‌ బిశ్వశర్మ ముందే ఎలా చెప్పగలిగారన్నదీ ప్రశ్నార్థకమే. ఇలాంటి వాటి వల్లే ఎన్నికల సంఘం స్వతంత్రత, పని తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. 

పోలింగ్‌ శాతం నుంచి ఫలితాల ప్రకటనపైనా విమర్శలెదుర్కొంటున్న ఈసీ ఇకనైనా పారదర్శకత పెంచుకోవాలి. తన నిజాయతీని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం మిగులు తుంది. ఎందుకంటే, ఈ కీలక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... వచ్చే ఏడాదికి దిక్సూచి కానున్నాయి. వెంటనే వచ్చే ఢిల్లీ, ఆ పైన జరిగే బీహార్‌ ఎన్నికలకు భూమికను కూడా సిద్ధం చేస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement