మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో ఆ రాష్ట్రాల్లో పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒంటరిగా పోటీ చేసి నెగ్గేంత విశ్వాసం ఏ పార్టీకీ లేకపోవటంతో కూటములుగా కదులుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో సీట్ల సర్దుబాటు రెండురోజుల క్రితమే కుదరగా, విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో బుధవారం సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది.
అయినా అరడజను సీట్లకు సంబంధించి ఇంకా పంచాయతీ తెగలేదు. జార్ఖండ్‌లో సైతం బీజేపీ, జేఎంఎం శిబిరాల్లో సర్దుబాట్లు ఒక కొలిక్కివచ్చాయి. కేంద్రంలో అధికారం ఉంది గనుక బీజేపీకి పెద్దగా దిగులేమీ లేదు. సొంత పార్టీలో అధిష్టానం మాట చలామణి అవుతుంది. కూటమి పక్షాలు సైతం కాస్త అటూ ఇటూగా బీజేపీకి తలాడిస్తాయి. ఎటొచ్చీ సమస్యంతా కాంగ్రెస్‌కే.
కొత్తగా ఎన్నికలొచ్చి పడినప్పుడల్లా పాత ఖాతాలు ముందేసుకుని ఇంటా బయటా కూడా ఒత్తిళ్లు తెచ్చేవారు ఎక్కువే. మొన్నటి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కబోర్లా పడ్డాక, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ... సొంత పార్టీలో సరే సరి... కూటముల్లో కూడా కాంగ్రెస్ అధి నేతల మాటకు విలువుండటం లేదు. అందుకు తాజా సర్దుబాట్లు, ఆ సందర్భంగా వచ్చిన విమర్శలు తార్కాణం.
హరియాణాలోని 90 స్థానాల్లో బీజేపీ 48 గెల్చుకోగా అంతర్గత పోరుతో సతమతమైన కాంగ్రెస్ 37తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది మొదలు కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ మొదలు కొని యూపీ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మిత్రుల వరకూ అన్నిచోట్లా ఆ పార్టీ పనితీరుపై, దురహంకారంపై విమర్శలు వచ్చిపడ్డాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు మిత్రుల ముందుపెట్టగానే వారు అంతెత్తున విరుచుకు పడటంతో కాంగ్రెస్ అధినాయకత్వానికి దిక్కుతోచని స్థితి ఏర్పడింది.
హరియాణా ప్రభావం ఏ స్థాయిలో ఉందో మహారాష్ట్ర పంపకాలే రుజువుచేస్తాయి. అక్కడి 288 స్థానాల్లో ఎంవీఏ ప్రధాన పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), ఉద్ధవ్ నేతృత్వంలోని యూబీటీ శివసేనలు సమానంగా అంటే 85 సీట్ల చొప్పున పోటీచేయటానికి బుధవారం అంగీకారం కుదిరింది. కూటమిలోని సమాజ్‌వాదీ, ఆప్, సీపీఐ, సీపీఎం, ఇతరేతర పార్టీల కోసం 18 స్థానాలు విడిచి పెట్టగా, ముంబైలో 3, విదర్భలో 12 స్థానాలు అనిశ్చితిలో ఉన్నాయి.
ఈ 15 తమకే ఇవ్వాలన్నది కాంగ్రెస్ డిమాండ్. పాతకాలంలో వేరు. కాంగ్రెస్ మెజారిటీ సీట్లలో పోటీచేసేది. ఎన్సీపీ, ఇతర మిత్ర పక్షాలూ సరిపెట్టుకునేవి. గత అసెంబ్లీ ఎన్నికల సంగతే చూస్తే అప్పట్లో కాంగ్రెస్ 145 చోట్ల పోటీచేసింది. యూపీఏ కూటమిలోని ఎన్సీపీ 123, ఇతరులు 17 తీసుకున్నారు. మరో మూడు ఇతరులకిచ్చారు. అప్పుడు శివసేన బీజేపీతో చెలిమి చేసి 124 తీసుకోగా, బీజేపీ 152 చోట్ల పోటీ చేసింది.
ఇలా ప్రతిచోటా హరియాణా భంగపాటు కాంగ్రెస్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. అధినేతలు తమ వారికి హరియాణా సంగతి గుర్తుచేస్తుంటే... మిత్రులు సైతం కాంగ్రెస్‌కు ఆ బాణీయే వినిపించటం గమనించదగ్గది. తమకు అన్యాయం జరుగుతోందని అధిష్టానానికి మొరపెట్టుకున్న పార్టీ నేతల తరఫున పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మాట్లాడినా పెద్దగా ఫలించక పోవటంతో కూటమి నుంచి బయటకు రావాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందంటున్నారు.
చివరకు పవార్ జోక్యం తర్వాతైనా ఉద్ధవ్ శివసేన ఆ 15 వదులుకోవటానికి సిద్ధపడటం లేదు. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి తిరుగుబాట్లు, కప్పదాట్లు సహజంగానే ఉంటాయి. కానీ బలంగా బేరసారా లాడే స్థితి కాంగ్రెస్‌కు లేదన్నది వాస్తవం.
బీజేపీలో అసమ్మతి స్వరాలు అక్కడక్కడ వినిపిస్తున్నా అవి పట్టించుకోవాల్సినంతగా లేవని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయానికొచ్చేయటం గమనించదగ్గది. మిత్రుల అసంతృప్తిని సైతం అది బేఖాతరు చేస్తోంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడూ, అనుకోని విజయాలు సైతం చేజిక్కించు కుంటున్నప్పుడూ సహజంగానే ఎవరినీ లెక్కచేసే పరిస్థితి ఉండదు.
పాలక మహాయుతిలో కుదిరిన ఒప్పందం ప్రకారం బీజేపీ 152–155 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించగా, షిండే శివసేనకు 78–80 మధ్య, అజిత్ పవార్ ఎన్సీపీకి 52–54 మధ్య ఇవ్వాలన్న అవగాహన కుదిరింది. ఇప్పటికే వంద స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీలో అసంతృప్తి లేకపోలేదు. అలాగే మిత్రులనుంచి కూడా సణుగుడు జాస్తిగానే ఉంది. అయినా అందరినీ దారికి తేవొచ్చన్న అభిప్రాయంతోనే బీజేపీ పెద్దలుండటం గమనించదగ్గది.
ఇప్పటికే మూడో జాబితా కూడా విడుదల చేసి మొత్తం 41 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసు కున్న జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నుంచి కాంగ్రెస్‌కు 29కి మించి వచ్చేలా లేవు. 81 స్థానా లున్న జార్ఖండ్ రాష్ట్రంలో ఆర్జేడీ, వామపక్షాలకు 11 స్థానాలివ్వాలని నిర్ణయించారు.
9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న ఉత ్తరప్రదేశ్‌లో కనీసం మూడైనా సాధించుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్‌నుంచి సానుకూల స్పందన రాకపోవటం కూడా హరి యాణా షాక్ ఫలితమే. అక్కడ రెండు స్థానాలివ్వాలని ఎస్పీ నిర్ణయించినా అసలు పోటీకి దిగరాదని కాంగ్రెస్ అనుకోవటం ఆ పార్టీ దయనీయ స్థితికి నిదర్శనం.
పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఏమిటో కాంగ్రెస్‌కు అడుగడుగునా అర్థమవుతోంది. అధికారంలో ఉన్నన్నాళ్లూ కన్నూ మిన్నూగానక వ్యవహరిస్తే ఏమవుతుందో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తనను తాను సరిదిద్దుకోలేని నిస్సహా యత ఆ పార్టీని ఆవరించటంవల్ల మరోసారి అదే భంగపాటు ఎదురైంది. అందుకు ఎవరిని నిందించగలరు? చేసుకున్నవారికి చేసుకున్నంత!
కాంగ్రెస్‌కు ‘హరియాణా’ దరువు!
Published Fri, Oct 25 2024 12:02 AM | Last Updated on Fri, Oct 25 2024 12:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment