సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్‌ | Gyanesh Kumar takes charge as Chief Election Commissioner | Sakshi
Sakshi News home page

సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్‌

Published Thu, Feb 20 2025 5:30 AM | Last Updated on Thu, Feb 20 2025 5:30 AM

Gyanesh Kumar takes charge as Chief Election Commissioner

18 సంవత్సరాలు నిండిన ప్రతీ భారతీయుడు ఓటర్‌గా మారాలని పిలుపు

ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌ జోషి బాధ్యతల స్వీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా జ్ఞానేశ్‌ కుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది మార్చి నెల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్‌ కమిషనర్‌గా సేవలందిస్తున్న జ్ఞానేశ్‌ను సీఈసీగా ఎంపికచేస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ రాష్ట్రపతి ముర్ముకు సిఫార్సు చేయడం, వెనువెంటనే ఆ సిఫార్సును ఆమోదిస్తూ, ఆయనను సీఈసీగా నియమిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడటం తెల్సిందే. 

మరోవైపు హరియాణా కేడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి వివేక్‌ జోషి ఎన్నికల కమిషనర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్‌ కుమార్‌ సీఈసీగా పదవీ విరమణ చేశాక ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జ్ఞానేశ్‌ మాట్లాడారు. ‘‘దేశ నిర్మాణంలో తొలి సోపానం ఓటు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటర్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించాలి. ప్రతి ఎన్నికల్లో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. 

భారత రాజ్యాంగంలోని ఎన్నికల చట్టాలు, నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ ఓటర్లకు అండగా నిలబడుతుంది’’ అని జ్ఞానేష్‌ స్పష్టం చేశారు. జ్ఞానేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించారు.

 మరోవైపు ఎలక్షన్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వివేక్‌ జోషి గతంలో హరియాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఐఐటీ రూర్కీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన జోషి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలోని ఎలక్షన్‌ కమిషనర్లలో అత్యంత పిన్న వయస్కుడు. అయితే సీనియారిటీ ప్రకారం ఒకవేళ ఈయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పదోన్నతి పొందితే ఈయన సారథ్యంలోనే 2029లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement