
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచేలా అవగాహన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ‘నేషనల్ ఐకాన్’గా సచిన్ వ్యవహరించనున్నారు. ఢిల్లీలో బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ తదితరుల సమక్షంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌తో 3 సంవత్సరాల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఎంఓయూ కుదుర్చుకోనుంది.
ఈ ఎంఓయూ ద్వారా యువత, పట్టణ ప్రాంతాల ఓటర్ల భాగస్వామ్యం పెంచే దిశగా టెండూల్కర్ ‘నేషనల్ ఐకాన్’గా తన బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా గత సంవత్సరం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎంఎస్ ధోని, అమీర్ ఖాన్, మేరీకోమ్ వంటి ప్రముఖులు కేంద్ర ఎన్నికల సంఘానికి ‘నేషనల్ ఐకాన్’లు వ్యవహరించారు.