ఓట్ల లెక్కింపు ఇలా | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపు ఇలా

Published Sun, May 26 2024 5:07 AM

Central Election Commission Arrangements for Election Votes Counting

జూన్‌ 4న ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభం

తొలుత పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కింపు 

ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు 

సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతే ఫలితాల వెల్లడి

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్య­ర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతోంది. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పించనున్నారు. మే 13న పోలింగ్‌ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటన­లు చోటుచేసుకున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది. 

మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరందరికీ రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజే­షన్‌ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పు­న మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతోపాటు 200 మంది రిటరి్నంగ్‌ ఆఫీసర్లను నియమించారు. 

ఈవీఎంల తరలింపు 
మే 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీ ప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపర్చారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా ఆర్వో టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలైన అరగంట తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంటే అప్పుడు ఇక ఈవీఎంల లెక్కింపును మొదలుపెట్టడం మొదలు పెడతారు. 

అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్‌ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వీరు ఈవీఎంల సీరియల్‌ నంబర్‌ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్‌ టేబుళ్లపైకి చేరుస్తారు. కౌటింగ్‌ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌ మాత్రమే తీసుకువస్తారు. ఓటు వేసిన ఈవీఎం మెషీన్‌తో అవసరం లేదు. కౌంటింగ్‌ హాల్‌లో టేబుళ్లు ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి. 

ఒక రౌండ్‌ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్‌కు సంబంధించిన కంట్రోల్‌ యూనిట్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్‌ అన్నది లెక్కించి.. దాని ప్రకారం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్‌లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా.. లేదా.. అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్‌గా మూడు వీవీప్యాట్లు ఎంపిక చేసి మూడింటిని లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. 

పోలింగ్‌ ముగిసిన తర్వాత క్లోజ్‌ బటన్‌ నొక్కకుండా ఉన్న (క్లోజ్‌ రిజల్ట్‌ క్లియర్‌–సీఆర్‌సీ) ఓటింగ్‌ యంత్రాలతో పాటు మాక్‌ పోలింగ్‌ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్‌ యంత్రాలను పక్కకు పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే. మెజార్టీ భారీగా ఉంటే ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్‌ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతీ రౌండ్‌ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతనే ఆర్వో ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement