కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం
విచారణ మే మొదటి వారానికి వాయిదా
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమ ర్పించే ఆస్తులు, కేసులకు సంబంధించిన అఫిడవిట్ (ఫాం–26)ను తెలుగులో కూడా అందుబాటులో ఉంచే వ్యవహారంలో పూర్తివివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
ఫాం–26ను తెలుగులో కూడా అందుబాటులో ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా మాచవరానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు, తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు డాక్టర్ సామల రమేశ్ బాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారించింది. పిటిషనర్ న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందన్నారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఫాం–26 ఇంగ్లి‹Ùలో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రంలో 83 శాతం మందికి తెలుగు మాత్రమే తెలుసని, అందువల్ల ఫాం–26ను తెలుగులో కూడా అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని తమ ముందుంచాలని ఎన్నికల సంఘం న్యాయవాది
శివదర్శన్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఓటర్లు చాలా తెలివిగలవాళ్లని, స్థానిక అభ్యర్థుల గురించి వారికి అన్నీ తెలుసని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment