
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా నుంచి ఫలానా వ్యక్తుల పేర్లను తీసేయాలంటూ దరఖాస్తులు రాగానే.. ఆటోమేటిక్‌గా వారి పేర్లను తొలగించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు నిర్ధిష్ట విధానం ఉందని సీఈసీ తరఫు న్యాయవాది డీఎస్ శివదర్శన్ హైకోర్టుకు వివరించారు.
ఓటర్ల తొలగింపు విషయంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు వాటిపై నిర్ణయం తీసుకోవడానికి త్రిసభ్య కమిటీ ఉంటుందన్నారు. అసలు దరఖాస్తులు పెట్టిన వ్యక్తులు ఎవరు? వారి చిరునామాలు, ఫోన్ నంబర్లను కూడా తెలుసుకుంటామన్నారు. పిటిషనర్ ఆరోపిస్తున్నంత సులభంగా ఓటర్ల తొలగింపు ఉండదని పునరుద్ఘాటించారు.
ఓటర్ల తొలగింపు విషయంలో తమకొచ్చిన దరఖాస్తులు తప్పుడువని తేలితే, అలా దరఖాస్తు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా ఎవరి పేర్లయితే ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారో అలా తొలగించే వ్యక్తులకు ముందుగా నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆకాశ రామన్న ఉత్తరాలు రాగానే ఓటర్ల పేర్లు తొలగించామనడం సరికాదన్నారు.
పర్చూరు ఎమ్మెల్యే పిటిషన్ నేపథ్యంలో..
పర్చూరు నియోజకవర్గ పరిధిలో ఏకపక్షంగా ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, దీనిపై ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను, నిబంధనలను అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా ఓటర్లను జాబితా నుంచి తీసేస్తున్నారని తెలిపారు.
ఈ మొత్తం ప్రక్రియను పోలీసులు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. అసలు ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు సాధారణంగా అమల్లో ఉన్న విధానం ఏమిటని ప్రశ్నించింది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది శివదర్శన్ స్పందిస్తూ.. పూర్తి విధానాన్ని వివరించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను కూడా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఆ వాదనలను విన్న ధర్మాసనం వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని శివదర్శన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.