పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు | Ec suspended several officials | Sakshi
Sakshi News home page

పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు

Published Fri, May 17 2024 5:01 AM | Last Updated on Fri, May 17 2024 7:30 AM

Ec suspended several officials

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్ర­దేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్, అమిత్‌ బర్దర్‌లను సస్పెండ్‌ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌ను సైతం బదిలీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని సూచించింది. 

అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించాలని పేర్కొంది. హింస చెలరేగేందుకు కారకులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. బాధ్యులపై ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం చార్జీషీట్‌ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా గురువారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల వేళ చెలరేగిన హింసపై స్వయంగా వివరణ ఇచ్చారు. 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని, కౌంటింగ్‌ రోజు ముందస్తు జాగ్రత్తలు తీసు­కోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్, సుఖ్‌­బీర్‌ సింగ్‌ సంధు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవ­హరించిన అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. 

ఓట్ల లెక్కింపు అనంతరం 15 రోజులపాటు బందోబస్తు విధులు నిర్వహించేందుకు 25 కంపెనీల అదనపు బలగాలను పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ఈసీ సస్పెండ్‌ చేసిన పోలీసులు వీరే
తిరుపతి జిల్లా
ఎ.సురేందర్‌రెడ్డి    డీఎస్పీ–తిరుపతి
కె.రాజశేఖర్‌    స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌
ఎం.భాస్కర్‌ రెడ్డి    స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ
ఒ.రామచంద్రారెడ్డి    ఇన్‌స్పెక్టర్‌–అలిపిరి

పల్నాడు జిల్లా
ఎ.పల్లపురాజు    ఎస్‌డీపీవో–గురజాల
వీఎస్‌ఎన్‌ వర్మ    ఎస్‌డీపీవో–నరసరావుపేట
కె.ప్రభాకర్‌రావు    స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌
ఇ.బాలనాగిరెడ్డి     స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌
ఎం.రామాంజినేయులు    ఎస్సై–కారంపూడి
డి.వి.కొండారెడ్డి    ఎస్సై–నాగార్జునసాగర్‌

అనంతపురం జిల్లా
సి.ఎం. గంగయ్య    డీఎస్పీ–తాడిపత్రి
ఎస్‌. మురళీకృష్ణ    ఇన్‌స్పెక్టర్‌–తాడిపత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement