విశ్లేషణ
ఎన్ ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కనివిని ఎరుగని విధంగా చేపడుతున్న చట్టపరమైన చర్యల పరంపరపై రచ్చ నడుస్తోంది. ఈ చర్యలు ఏమైనా ‘ఆరోగ్యకర మైన ప్రజాస్వామ్య పద్ధతి’ ఉల్లంఘనకు దారితీస్తున్నాయా అనే విషయాన్ని ఎన్నికల సంఘం నిర్ధారించవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియల సమగ్రతను, నైతికతను కాపాడుకోవటానికి ‘అందరికీ సమానావకాశాలు’ (ఎల్.పి.ఎఫ్.) అనే భావన కీలకం అవుతోంది. అలాంటి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఎల్.పి.ఎఫ్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ – ఎం.సి.సి.) అమలుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించి వివిధ అంశాలను విశ్లేషించడం అవసరమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
2024 సార్వత్రిక ఎన్నికలను ప్రకటించిన రోజున భారత ఎన్నికల సంఘం, మీడియాకు వివరాలు అందిస్తూ తెలిపిన మంచి అంశాలలో ఒకటి ఏమిటంటే, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్... ఆటలో అందరికీ సమానావకాశాలు (ఎల్‌పీఎఫ్)కి ఈసీ ఇస్తున్న ప్రాధాన్యం. అన్ని రాజకీయ పార్టీలకూ ప్రవర్తనా నియమావళిని ఈసీ పంపిందనీ, దానిని ఆ యా పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల దృష్టికి తీసుకెళ్లాలనీ అభ్యర్థించినట్లు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. ఎల్పీఎఫ్‌కు భంగం కలిగించే చర్యలకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు.
ఎల్‌పీఎఫ్ అనేది క్రీడలు లేదా యుద్ధాల విషయంలో వర్తించని వ్యక్తీకరణ. సమవుజ్జీలైన రెండు జట్లు మాత్రమే ఒకదానితో ఒకటి ఆడాలి అనేది ఉండదు. క్రికెట్‌లో, స్వదేశీ జట్లు పిచ్‌ను తమకు అను కూలంగా మార్చుకుంటాయి, అయితే ఈ ‘అన్యాయమైన అభ్యాసం’ మన్నించబడింది ఎందుకంటే పాల్గొనే జట్లు తమ వంతు కోసం ఎదురు చూస్తుంటాయి. అదేవిధంగా, ఒక శక్తిమంతమైన సైన్యం పోరాటంలో ఒక చిన్న ప్రతిపక్షాన్ని దెబ్బతీస్తే దాన్ని అన్యాయంగా పరిగణించరు. ప్రేమలో, యుద్ధంలో అంతా న్యాయమైనదే అంటారు.
ఎల్‌పీఎఫ్ అనేది స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలకు ఒక పవిత్రమైన సూత్రం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి యుద్ధం లేదా ప్రేమ పోటీ కానే కాదు. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఒకరితో ఒకరు పోటీపడి ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహించడానికి ఓటర్ల ఆదేశాన్ని పొందడం ప్రజాస్వామ్యంలో కీలకమైన సంఘటన. ఓటు అనేది విశ్వాసంపై, వాస్తవాలపై ఆధారపడిన సామాజిక ఒప్పందం.
ఈ పోటీ నిష్పక్షపాతంగా ఉండాలంటే, పోటీదారులు సమానంగా ఉండకపోవచ్చని అంగీకరించినప్పటికీ, ఎన్నికల సమయంలో ఎల్‌పీఎఫ్ లభ్యత ఒక తప్పనిసరి షరతుగా పరిగణించబడుతుంది. స్వాభావిక అసమానతను ఆటలో భాగంగా గుర్తిస్తే, ఎన్నికల సమ యంలో వారు ఓటర్లను తమకు అనుకూలంగా ప్రభావితం చేయడా నికి ప్రయత్నించినప్పుడు ఎల్‌పీఎఫ్ ఉండేలా చూసుకోవడమనేది ప్రక్రియ నియంత్రణాధికారి బాధ్యత.
ఎల్‌పీఎఫ్‌కి చెందిన ఈ సూత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే, ప్రతిపక్ష అభ్యర్థులతో పోలిస్తే అధికార పక్షం పొందే ప్రయోజనానికి ‘సమం చేయడం’ నిర్దిష్టమైనదని చూపిస్తుంది. క్రీడలలో బలహీనమైన జట్టు బలమైన వారితో పోటీపడవచ్చు. వాస్తవానికి, టెన్నిస్ వంటి ఆటలలో పోటీ ప్రారంభ రౌండ్లలో, బలహీనమైన అన్ సీడెడ్ ఆటగాళ్లు ర్యాంకింగ్ పట్టికలను శాసించే ఆటగాళ్లతో తలపడతారు. అత్యున్న తమైన నైపుణ్యాలు, పరాక్రమాలు కలిగిన వారి చేతుల్లో ఓడిపోయి నప్పుడు కన్నీళ్లు కూడా రావు. ఎందుకంటే క్రీడలు తాము ప్రజాస్వా మికమని చెప్పుకోలేవు. అయితే నిజమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మాత్రం అందుకు భిన్నమైన ఆట అనే చెప్పాలి.
సాధారణ సమయాల్లో సాధారణ పౌర ప్రవర్తనను నియంత్రించడానికి సాధారణ చట్టాలు ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీల వారు, అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఒక నిర్దిష్ట వైఖరిని పాటించాలని భావిస్తున్నారు, దీనిని వారు ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలోనే స్వచ్ఛందంగా అంగీకరించారు. అయితే సూచించిన నిబంధనలన్నీ నిర్దిష్టంగా చట్టంలో లేవు. కొన్నిసార్లు ఇది మంచి ప్రజా ప్రవర్తన పట్ల వారి నిబద్ధతకు గుర్తు. ఈసీ పాటించే సమతూకం విధానానికి చెందిన ప్రదర్శన. ఎన్నికల సమయంలో ఈసీ అమలు చేయాలని భావిస్తున్న ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)కి ఆవిర్భావం ఇది.
ఎంసీసీని పరిశీలిస్తే కోడ్ పరిధిలో నలుగురు ప్రధాన ఆటగాళ్లు ఉన్నారని అర్థమవుతుంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, బ్యూరోక్రసీ. చివరి రెండూ పాలక వ్యవస్థలో భాగమే కానీ వాటికి కూడా విడిగా కోడ్ వర్తిస్తుంది. కోడ్‌లో ఎక్కువ భాగం ఇప్పటికే ఉన్న విభేదాలను తీవ్రతరం చేయడం, లేదా పరస్పర ద్వేషాన్ని పాదుకొల్పటం, లేదా వివిధ కులాలు, వర్గాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించటం, లేదా ధ్రువీకరించలేని ఆరోపణలు చేయడం, చట్టంలో పొందుపరచబడిన ఉల్లంఘనల చుట్టూ ఉంటుంది. ఓట్లను పొందడం కోసం కులం లేదా మతపరమైన భావాలను ప్రేరేపించరాదనీ, పార్టీలు, అభ్యర్థులు అవినీతి విధానాలను ఆశ్రయించరాదనీ, పార్టీలు, వారి కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీల కార్యకలాపాలకు అంతరాయం కలిగించరాదనీ కోడ్ నిర్దేశిస్తుంది. ప్రచార సభలు, ఊరేగింపులు, పోలింగ్ బూత్‌లు, మేనిఫెస్టోలపై కూడా ఇలాంటి సెక్షన్లు ఉన్నాయి.
అయితే, గమనించదగ్గ విషయం ఏమిటంటే, ‘కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ’ కోసం ఎంసీసీ ఒక ప్రత్యేక విభా గాన్ని కేటాయించింది. ‘అధికారిక పదవిని ఉపయోగించినట్లు ఎటు వంటి ఫిర్యాదు రాకుండా, ఎటువంటì ఫిర్యాదుకూ కారణం చూపే అవకాశం లేకుండా చూసుకోవా’లని కోడ్ ఆజ్ఞాపించింది. కోడ్ పరిధిలోకి వచ్చిన దుర్వినియోగమంటే... అతిథి గృహాలు, రవాణా వంటి ప్రభుత్వ సౌకర్యాల వినియోగానికి సంబంధించినవి. అలాగే ప్రకటనల్ని జారీ చేయడానికి లేదా కొత్త ఆంక్షలను మంజూరు చేయ డానికి ప్రభుత్వ నిధులను వినియోగించడం, అందుకు అధికారాన్ని ఉపయోగించడం కూడా! ఎంసీసీ వీటిని దాటి వెళ్లదు.
రాష్ట్ర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ సాధారణ పని తీరు ప్రస్తుత ఎంసీసీ ద్వారా ఏ విధంగానూ పరిమితమై పోదు. న్యాయస్థాన విచా రణల వంటి న్యాయ ప్రక్రియలో ఈసీ జోక్యం చేసుకోవడం, లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థల సాధారణ విచారణ ఈసీ ఆదేశాలకు లోబడి ఉండాలా వద్దా అనేది చర్చనీయాంశం. బహుశా, ప్రారంభంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముసాయిదాను రూపొందించినప్పుడు ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల అధికార దుర్వినియోగం అనేది ఊహకైనా రాలేదు.
అయితే, ఎంసీసీ అనేది మానవ ప్రవర్తన లాగా కాలగతిలో మారుతూ వచ్చే పురోగమన పత్రం. 2009లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఈసీ 2009 మార్చి 19 నాటి తన లేఖను పరిశీలించి,ఎంసీసీ వర్తింపు చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తి గల ఎలక్ట్రిసిటీ రెగ్యు లేటరీ కమిషన్ ల వంటి కమిషన్ లకు విస్తరించిందని స్పష్టం చేసింది. బడ్జెట్ సమర్పణపై ఎంసీసీ వర్తింపు గురించి ఆ నాటి ఈసీ లేఖ స్పష్టం చేసింది.
ప్రస్తుతం నెలకొన్న వాతావరణం, ప్రభుత్వ సంస్థల జోరు ఫలితంగా అన్ని పక్షాలకూ సమాన అవకాశాలు లేని స్థితి చూశాక ఎన్నికల సంఘం రంగంలోకి దిగాల్సిందేనేమో! తాజా ఫిర్యాదులకు దారితీసిన పరిస్థితులను పరిశీలించాలేమో!! గతంలో ఇలాంటి పరిస్థి తుల్లోనే 2019లో ఎన్నికల సంఘం రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు ఒక సలహాను జారీ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగానే ఎన్ ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అపూర్వమైన చర్యల పరంపర ఏదైనా ‘ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య అభ్యాసాన్ని’ ఉల్లంఘిస్తున్నదేమో ఈసీ నిర్ధారించాలి.
ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఉన్న ప్రధానమైన సందిగ్ధత ఏమిటంటే... ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు’ నిర్వహించే తన ఏకైక బాధ్యతకు కట్టుబడి రూల్ బుక్‌ను అనుసరించాలా, లేక ‘స్క్రిప్టు’ను తిరిగి రాయాలా అనేది! ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్ని కలు’ అనే పదం రాజ్యాంగంలో పేర్కొన లేదు కానీ ఈసీ ‘పర్యవేక్షణ, దిశానిర్దేశం’ అనే మాటలోనే ఆ స్ఫూర్తి నిండి ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనేది కూడా మనం సాధారణంగా అర్థం చేసుకునే దానికంటే చాలా పెద్దది. సంపూర్ణంగా గ్రహించి, అమలు చేయాల్సిన న్యాయమైన స్ఫూర్తి అందులో ఉంటుంది.
అశోక్ లావాసా
వ్యాసకర్త మాజీ ఎన్నికల కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment