
ఈసీ అనుమతి కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం
3 జిల్లాల్లో హింసాత్మకఘటనలపై వివరణ ఇవ్వాలని ఎస్పీల ఆదేశం
ప్రతి ఒక్కరూ సీవిజిల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి
సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లోనే పరిష్కారం
మాకు ఫిర్యాదు చేస్తే చర్యలకు చాలా సమయం పడుతుంది
రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంది..
ప్రచారం, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
రాష్ట్రంలో 144 సెక్షన్
రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ప్రతి అభ్యర్థి ప్రచారానికి, ర్యాలీలకు అనుమతి తీసుకోవాలని ఇందుకోసం సవిధ యాప్‌ను వినియోగించుకోవాలని చెప్పారు. ఇప్పటికే 398 అభ్యర్థనలు వచ్చాయన్నారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుందన్నారు. 85 ఏళ్లు దాటిన వారు ఇంటి వద్దే ఓటేసే అవకాశం ఉన్నా, ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో 2 శాతం మందే వినియోగించుకున్నారని, చాలామంది పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడానికే ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు.
సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అంతవరకు టెట్ పరీక్షల ఫలితాలను కూడా ప్రకటించవద్దని ఆదేశించినట్లు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్‌సీలో 6,100 పోస్టులకు 4.72 లక్షల మంది పోటీపడుతున్నట్లు తెలిపారు.
డీఎస్సీ నిర్వహించాలని కొందరు, వాయిదా కోరుతూ మరికొందరు మెయిల్స్, ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. డీఎస్సీ పరీక్ష నిర్వహించడానికి అనుమతి కోరుతూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లేఖ రాయనుందని, ఇందుకోసం సీఎస్ ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం డీఎస్సీ నిర్వహించమంటే నిర్వహిస్తామని, లేదంటే వాయిదా వేస్తామని స్పష్టం చేశారు.
పటిష్టంగా ఎన్నికల నియమావళి అమలు
రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, వస్తువులు జప్తు చేశామన్నారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై 385 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, 46 మందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇందులో 40 మంది వలంటీర్లు ఉన్నారని, వారిని విధుల నుంచి తొలగించామని చెప్పారు. మరో ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న గోడ రాతలు, బ్యానర్లు, ఇతర వస్తువులు మొత్తం 1,99,000 తొలగించగా, ప్రైవేటు స్థలాల్లో 1,15,000 తొలగించినట్లు తెలిపారు.
అనుమతి లేకుండా ప్రచారం కోసం ఆస్తులను వినియోగించిన వారిపై 94 కేసులు, ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేసినవారిపై 37 కేసులు నమోదు చేశామన్నారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజూ డిస్టిలరీల నుంచి మద్యం ఉత్పత్తి, గొడౌన్ల నుంచి మద్యం నిల్వల వివరాలు తెప్పించి, గతేడాది గణాంకాలతో పోల్చి చూస్తున్నామని, ఎక్కడా మద్యం అమ్మకాలు పెరగలేదన్నారు. ఇంతవరకు అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలు కనిపించలేదన్నారు.
ప్రధాని భద్రత కేంద్ర హోంశాఖ అంశం
ప్రధాని భద్రత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఎస్పీజీ పరిధిలోనికి వస్తుందని, సీఈవో పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ప్రధాని సభ భద్రతా వైఫల్యాలపై వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామన్నారు. రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక ఘటనలు రీపోలింగ్ వంటివి లేకుండా ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
కోడ్ వచ్చిన తర్వాత గిద్దలూరు, ఆళ్లగడ్డ, మాచర్లల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై గురువారం స్వయంగా వచ్చి నివేదిక ఇవ్వాలని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు. వారి వివరణ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తామన్నారు.
సీవిజిల్‌తో సత్వర పరిష్కారం
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటరు సీవిజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటామని, అదే నేరుగా తమకు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి పంపి వివరణ తీసుకొని చర్యలు చేపట్టడానికి చాలా సమయం పడుతుందన్నారు.
కోడ్ ఉల్లంఘన అంశాలు వీడియో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే వాటిపై తక్షణం స్పందించడానికి 1,173 ప్లైయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు సీవిజిల్ యాప్ ద్వారా 1,307 ఫిర్యాదులు వస్తే అందులో 40 తప్ప అన్నీ పరిష్కరించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment