చంద్రబాబు తప్పులను జగన్‌పై రుద్దడానికి రామోజీ విష కథనం
2019లో సేవామిత్ర యాప్ ద్వారా వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్ర
ఈసీకి ఫిర్యాదుతో తిరిగి చేర్చిన 31,97,473 ఓట్లు
సాక్షి, అమరావతి: పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న చందంగా... కళ్లకు పచ్చ పసరు రాసుకున్న రామోజీకి అంతా తన ‘బాబు’ లాగే కనిపిస్తున్నారు. తన బాబు దొంగ ఓట్లతో గెలిచాడు కాబట్టి మిగతా వారూ అలానే ఉంటారని భావిస్తూ ‘‘ఓటు హక్కుపై వేటు.. అదే జగన్ రూటు’’ అంటూ జగన్‌పై ఉన్న అక్కసును బయటపెట్టుకున్నారు. అసలు దొంగఓట్లకు ఆద్యుడు చంద్రబాబేనని, తమిళనాడుకు చెందిన వలస కూలీలను చేర్పించడం ద్వారా ఇన్నాళ్లూ కుప్పంలో గెలుస్తూ వచ్చాడని, ఇప్పుడు ఆ భాగోతం బయటపడటంతో సొంత నియోజకవర్గంలో తన బాబు’ ఓడిపోతాడనే భయంతోనే ఇటువంటి వార్తలు రాస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సేవామిత్ర యాప్ పేరుతో వైఎస్సార్‌సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపు
రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను చౌర్యం చేసి ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు అప్పగించారు. వాటిని సేవా మిత్ర యాప్‌తో అనుసంధానం చేసి, వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. 2015లో 22,76,714, 2016లో 13,00,613, 2017లో 14,46,238 వెరసి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగింపజేశారు. తద్వారా తనకు అలవాటైన రీతిలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేశారు. ఈ కుట్రను ప్రజాసంఘాలు బహిర్గతం చేశాయి. దీనిపై వైఎస్సార్‌సీపీ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు తేలి్చన ఎన్నికల అధికారులు.. 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో అదనంగా చేర్చారు. దాంతో ఆ ఎన్నికల్లో 50 శాతంపైగా ఓట్లు సాధించి.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించింది.
ఈసీ స్పష్టం చేసినా వినపడలేదా!
అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఇటీవల ఓ సమీక్షలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, గంపగుత్తగా ఓట్ల తొలిగింపు, జీరో ఇంటి నెంబర్‌పై ఓటర్ల నమోదు అంటూ తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా చేసిన బోగస్ ప్రచారంలో వీసమెత్తు నిజం లేదన్న విషయాన్ని ఆయన విస్పష్టంగాచెప్పారు. 2023 జనవరి 6 నుంచి ఆగస్టు 30 మధ్య కాలంలో తొలగించిన 21 లక్షల ఓట్లను సమీక్షిస్తే అందులో కేవలం 13,061 ఓట్లలోనే తప్పులు దొర్లాయని ఆయన తేల్చారు.
అంటే తొలగించిన మొత్తం ఓట్లల్లో ఇది కేవలం 0.61 శాతం మాత్రమే. వాటిని తిరిగి సవరించారు. మృతి చెందిన, ఇంటి మార్పు, డూప్లికేట్ ఓటర్ల నమోదుపై 14.48 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 5.65 లక్షల ఓటర్లు చనిపోవడం లేదా శాశ్వతంగా వేరే చోటికి వెళ్లిపోవడం, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటాన్ని గుర్తించి వాటిని తొలగించారు. ఒకే ఇంటి నంబర్‌పై పది మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసులను పరిశీలించడానికి 1.57 లక్షల ఇళ్లకు ఎన్నికల సిబ్బంది వెళ్లారు. ఇంటింటి సర్వే నిర్వహించి 20 లక్షల ఓట్లను పరిశీలించారు. జీరో ఇంటి నెంబర్‌తో 2.52 లక్షల ఓట్లు ఉండగా వాటిలో 97 శాతం అసలైన చిరునామా నమోదు చేసి సరిదిద్దారు. ఎన్నికల సంఘం ఇంత కచి్చతంగా వ్యవహరించినా రామోజీ కళ్లకు ఇవేవీ కనిపించలేదు. నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఒకపక్క చెపుతున్నా.. పదేపదే అదే అబద్ధాన్ని రామోజీ ప్రచారం చేస్తున్నారు.
దొంగ ఓట్లతో గెలిచిన బాబు
2014లో దొంగఓట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు 2019లో కూడా అదే దారిలో వెళ్లి భంగపడ్డారు. సేవామిత్ర యాప్ ద్వారా వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఇప్పుడు 2024లో కూడా ఇదే విధంగా దొంగ ఓట్లను చేర్పించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి భారీ సంఖ్యలో గంపగుత్తగా ఫారం–6లను దాఖలు చేస్తూ పచ్చ మీడియా ద్వారా అధికారపార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 99% స్వచ్ఛతతో ఓటర్ల జాబితా తయారు చేయడమే కాకుండా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నా రామోజీ పత్రిక మాత్రం ఓటర్ల జాబితాపై పదేపదే తప్పుడు ఆరోపణలతో విషకథనాలను ప్రచురిస్తోంది. 2014 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లు అప్పట్లో ప్రజా సంఘాలు గుర్తించాయి. ఆ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి రావడానికి కూడా అదే కారణమని తేల్చాయి.
Comments
Please login to add a commentAdd a comment