Deletion of names
-
fact check: అది మీ బాబు రూటు
సాక్షి, అమరావతి: పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న చందంగా... కళ్లకు పచ్చ పసరు రాసుకున్న రామోజీకి అంతా తన ‘బాబు’ లాగే కనిపిస్తున్నారు. తన బాబు దొంగ ఓట్లతో గెలిచాడు కాబట్టి మిగతా వారూ అలానే ఉంటారని భావిస్తూ ‘‘ఓటు హక్కుపై వేటు.. అదే జగన్ రూటు’’ అంటూ జగన్‌పై ఉన్న అక్కసును బయటపెట్టుకున్నారు. అసలు దొంగఓట్లకు ఆద్యుడు చంద్రబాబేనని, తమిళనాడుకు చెందిన వలస కూలీలను చేర్పించడం ద్వారా ఇన్నాళ్లూ కుప్పంలో గెలుస్తూ వచ్చాడని, ఇప్పుడు ఆ భాగోతం బయటపడటంతో సొంత నియోజకవర్గంలో తన బాబు’ ఓడిపోతాడనే భయంతోనే ఇటువంటి వార్తలు రాస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సేవామిత్ర యాప్ పేరుతో వైఎస్సార్సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపు రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను చౌర్యం చేసి ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు అప్పగించారు. వాటిని సేవా మిత్ర యాప్‌తో అనుసంధానం చేసి, వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. 2015లో 22,76,714, 2016లో 13,00,613, 2017లో 14,46,238 వెరసి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగింపజేశారు. తద్వారా తనకు అలవాటైన రీతిలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేశారు. ఈ కుట్రను ప్రజాసంఘాలు బహిర్గతం చేశాయి. దీనిపై వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు తేలి్చన ఎన్నికల అధికారులు.. 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో అదనంగా చేర్చారు. దాంతో ఆ ఎన్నికల్లో 50 శాతంపైగా ఓట్లు సాధించి.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. ఈసీ స్పష్టం చేసినా వినపడలేదా! అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఇటీవల ఓ సమీక్షలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, గంపగుత్తగా ఓట్ల తొలిగింపు, జీరో ఇంటి నెంబర్‌పై ఓటర్ల నమోదు అంటూ తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా చేసిన బోగస్ ప్రచారంలో వీసమెత్తు నిజం లేదన్న విషయాన్ని ఆయన విస్పష్టంగాచెప్పారు. 2023 జనవరి 6 నుంచి ఆగస్టు 30 మధ్య కాలంలో తొలగించిన 21 లక్షల ఓట్లను సమీక్షిస్తే అందులో కేవలం 13,061 ఓట్లలోనే తప్పులు దొర్లాయని ఆయన తేల్చారు. అంటే తొలగించిన మొత్తం ఓట్లల్లో ఇది కేవలం 0.61 శాతం మాత్రమే. వాటిని తిరిగి సవరించారు. మృతి చెందిన, ఇంటి మార్పు, డూప్లికేట్ ఓటర్ల నమోదుపై 14.48 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 5.65 లక్షల ఓటర్లు చనిపోవడం లేదా శాశ్వతంగా వేరే చోటికి వెళ్లిపోవడం, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటాన్ని గుర్తించి వాటిని తొలగించారు. ఒకే ఇంటి నంబర్‌పై పది మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసులను పరిశీలించడానికి 1.57 లక్షల ఇళ్లకు ఎన్నికల సిబ్బంది వెళ్లారు. ఇంటింటి సర్వే నిర్వహించి 20 లక్షల ఓట్లను పరిశీలించారు. జీరో ఇంటి నెంబర్‌తో 2.52 లక్షల ఓట్లు ఉండగా వాటిలో 97 శాతం అసలైన చిరునామా నమోదు చేసి సరిదిద్దారు. ఎన్నికల సంఘం ఇంత కచి్చతంగా వ్యవహరించినా రామోజీ కళ్లకు ఇవేవీ కనిపించలేదు. నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఒకపక్క చెపుతున్నా.. పదేపదే అదే అబద్ధాన్ని రామోజీ ప్రచారం చేస్తున్నారు. దొంగ ఓట్లతో గెలిచిన బాబు 2014లో దొంగఓట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు 2019లో కూడా అదే దారిలో వెళ్లి భంగపడ్డారు. సేవామిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఇప్పుడు 2024లో కూడా ఇదే విధంగా దొంగ ఓట్లను చేర్పించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి భారీ సంఖ్యలో గంపగుత్తగా ఫారం–6లను దాఖలు చేస్తూ పచ్చ మీడియా ద్వారా అధికారపార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 99% స్వచ్ఛతతో ఓటర్ల జాబితా తయారు చేయడమే కాకుండా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నా రామోజీ పత్రిక మాత్రం ఓటర్ల జాబితాపై పదేపదే తప్పుడు ఆరోపణలతో విషకథనాలను ప్రచురిస్తోంది. 2014 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లు అప్పట్లో ప్రజా సంఘాలు గుర్తించాయి. ఆ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి రావడానికి కూడా అదే కారణమని తేల్చాయి. -
27 లక్షల ఓట్లు గల్లంతా?!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి దాదాపు 27 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతవడం లేదా తొలగించడం ఎంతో ఆందోళనకరమైన అంశం. ఇటు మీడియాతోపాటు అటు సోషల్ మీడియాలో విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తడంతో శుక్రవారం నాడు పోలింగ్ ముగిశాక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందుకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. 27 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయంటే ప్రతి పది మంది ఓటర్లలో ఒకరికి ఓటు హక్కు పోయినట్లే. వేలు ముద్రల గుర్తింపు కలిగిన ఆధార్ కార్డులతో ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధాలించాలంటూ 2015లో భారత ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచే రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభమైందన్న విమర్శలు గతంలోనే వెల్లువెత్తాయి. ఓటర్ల గుర్తింపు కార్డులకు కూడా ఆధార్ కార్డు నెంబర్లను అనుసంధాలించాలంటూ కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ (ఎన్ఈఆర్పీఏపీ)’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఒకరికి రెండు, మూడు ఓటరు గుర్తింపు కార్డులు లేకుండా చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాడు కేంద్రం ప్రకటించింది. అయితే ఆధార్ కార్డు లేని వారు ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుంది కనుక తక్షణమే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆధార్ కార్డులేని ఓటరును గుర్తించేందుకు నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయడం వల్ల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయా? లేదా ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను తొలగించారా ? అన్నది ప్రధాన ప్రశ్న. కొన్ని వర్గాల ప్రజల ఓట్లే గల్లంతయ్యాయి కనుక, ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను తొలగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ కారణంతో ఓటర్ల పేర్లను తొలగించిన సదరు ఓటర్లకు సమాచారం తప్పనిసరిగా అందించడం ఎన్నికల సంఘం బాధ్యతని, ఏ కారణంతో తొలగించాల్సి వస్తుందో, మళ్లీ దరఖాస్తు ఎలా చేసుకోవాలో, అందుకు కావాల్సిన ధ్రువపత్రాలేవో కూడా స్పష్టంగా వివరించాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్రంలో పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘం గల్లంతయిన ఓటర్ల జాబితాను విడుదల చేయాలి. ఆ జాబితాను పరిశీలిస్తే ఏయే అసెంబ్లీ నియోజక వర్గంలో ఎలాంటి ప్రభావం ఉండేదో రాజకీయ పరిశీలకుల అవగాహనకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడమే కాదు, నిర్వహించినట్లు కనిపించడం కూడా ముఖ్యమేనని సుప్రీం కోర్టే అభిప్రాయపడింది కనుక వీలైనంత త్వరగా ఎన్నికల కమిషన్ ఈ జాబితాను విడుదల చేయడంతో 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాను సవరించాలి. -
ఓటర్లకు చుక్కలు చూపిస్తున్నారు
హైదరాబాద్: సాధారణంగా స్థానిక, సార్వత్రిక ఎన్నికల సమయంలో కొత్తగా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లయినా లేకపోతే అధికారులు కొత్తగా చేరుస్తారు. హైదరాబాద్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కొత్త ఓటర్ల సంగతి అటుంచితే ఉన్న పేర్లనే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న చాలా మంది పేర్లను జాబితా నుంచి తీసేశారు. నగరంలోని హిమాయత్ నగర్లో ఓ బిల్డింగ్‌లోని 20 అపార్ట్మెంట్ వాసులకు ఈ పరిస్థితి ఎదురైంది. దాదాపుగా 20 అపార్ట్మెంట్ వాసుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నట్టుగా 1960 ఆర్ఈ రూల్స్‌లోని 21వ నిబంధన, 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 22వ సెక్షన్ కింద నోటీసు జారీ చేశారు. ఓటర్లు సంబంధిత ప్రాంతంలో నివాసం ఉండటం లేదని తమ దృష్టికి వచ్చినట్టు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అధికారులు వెల్లడించిన పేర్లలో చాలా మంది గృహిణులు కూడా ఉన్నారు. వీరు నిత్యం ఇళ్లలోనే ఉంటారు కాబట్టి అధికారులు తనిఖీకి వెళ్లినప్పుడు లేకపోయే పరిస్థితే ఉండదు. అలాంటిది ఏ అధికారి కూడా తనిఖీ చేయకుండానే ఓటర్ల జాబితాను పేర్లను తొలగిస్తున్నట్టు నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుపై ఈ నెల 8వ తేదీనే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం చేశారు. ఏవైనా సవరణలు ఉంటే ఈ నెల 17న తన ఎదుట హాజరు కావాలని సూచించారు. అయితే నోటీసును మాత్రం 18 తేదీన ఇవ్వడం విడ్డూరం. ఇలాంటి పరిస్థితే హైదరాబాద్‌లో చాలా అపార్ట్మెంట్ వాసులకు ఎదురైంది. వీరిలో ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. వీరు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ను సంప్రదించగా సవరణ చేస్తామని చెప్పారు. కాగా నోటీసులు అందుకున్న మిగిలిన వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం. వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్ వేణుగోపాల్‌కు కూడా ఇలాంటి నోటీసే వచ్చింది. గత ఆరు నెలలుగా సంబంధిత నివాస ప్రాంతంలో లేరని, జూన్ 17న ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ముందు హాజరు కాని పక్షంలో ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిస్తున్నట్టు ఆయనకు ఎన్నికల అధికారులు నోటీసు జారీ చేశారు. ఆయన నివాసంలో ఉండే అపార్టుమెంటులోని 20 ఫ్లాట్ల వారికి కూడా ఇలాంటి నోటీసులే వచ్చాయి. అది కూడా గడువు ముగిసిన ఒక రోజు తర్వాత.. అంటే 18న నోటీసు ఇచ్చారు. తాను 11 ఏళ్లుగా ఇదే చోట నివసిస్తున్నానని, అధికారులు తనిఖీ చేయకుండానే తనకు నోటీసులు ఇవ్వడం దారుణమని వేణుగోపాల్ చెప్పారు.