ఓటర్లకు చుక్కలు చూపిస్తున్నారు
హైదరాబాద్: సాధారణంగా స్థానిక, సార్వత్రిక ఎన్నికల సమయంలో కొత్తగా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లయినా లేకపోతే అధికారులు కొత్తగా చేరుస్తారు. హైదరాబాద్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కొత్త ఓటర్ల సంగతి అటుంచితే ఉన్న పేర్లనే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. హైదరాబాద్లో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న చాలా మంది పేర్లను జాబితా నుంచి తీసేశారు.
నగరంలోని హిమాయత్ నగర్లో ఓ బిల్డింగ్లోని 20 అపార్ట్మెంట్ వాసులకు ఈ పరిస్థితి ఎదురైంది. దాదాపుగా 20 అపార్ట్మెంట్ వాసుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నట్టుగా 1960 ఆర్ఈ రూల్స్లోని 21వ నిబంధన, 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 22వ సెక్షన్ కింద నోటీసు జారీ చేశారు. ఓటర్లు సంబంధిత ప్రాంతంలో నివాసం ఉండటం లేదని తమ దృష్టికి వచ్చినట్టు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అధికారులు వెల్లడించిన పేర్లలో చాలా మంది గృహిణులు కూడా ఉన్నారు. వీరు నిత్యం ఇళ్లలోనే ఉంటారు కాబట్టి అధికారులు తనిఖీకి వెళ్లినప్పుడు లేకపోయే పరిస్థితే ఉండదు. అలాంటిది ఏ అధికారి కూడా తనిఖీ చేయకుండానే ఓటర్ల జాబితాను పేర్లను తొలగిస్తున్నట్టు నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుపై ఈ నెల 8వ తేదీనే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం చేశారు. ఏవైనా సవరణలు ఉంటే ఈ నెల 17న తన ఎదుట హాజరు కావాలని సూచించారు. అయితే నోటీసును మాత్రం 18 తేదీన ఇవ్వడం విడ్డూరం. ఇలాంటి పరిస్థితే హైదరాబాద్లో చాలా అపార్ట్మెంట్ వాసులకు ఎదురైంది. వీరిలో ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. వీరు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ను సంప్రదించగా సవరణ చేస్తామని చెప్పారు. కాగా నోటీసులు అందుకున్న మిగిలిన వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం.
వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్ వేణుగోపాల్కు కూడా ఇలాంటి నోటీసే వచ్చింది. గత ఆరు నెలలుగా సంబంధిత నివాస ప్రాంతంలో లేరని, జూన్ 17న ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ముందు హాజరు కాని పక్షంలో ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిస్తున్నట్టు ఆయనకు ఎన్నికల అధికారులు నోటీసు జారీ చేశారు. ఆయన నివాసంలో ఉండే అపార్టుమెంటులోని 20 ఫ్లాట్ల వారికి కూడా ఇలాంటి నోటీసులే వచ్చాయి. అది కూడా గడువు ముగిసిన ఒక రోజు తర్వాత.. అంటే 18న నోటీసు ఇచ్చారు. తాను 11 ఏళ్లుగా ఇదే చోట నివసిస్తున్నానని, అధికారులు తనిఖీ చేయకుండానే తనకు నోటీసులు ఇవ్వడం దారుణమని వేణుగోపాల్ చెప్పారు.