కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించడానికి తీసుకున్న గడువు చూస్తే, మన దేశం ఇంకా ఎంతో వెనుకబడి ఉందన్న భావన కలుగుతుంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో ఎన్నికల ప్రక్రియ సుమారు రెండునర్నర నెలలు తీసుకుంటే ప్రజలకు వచ్చే ఇబ్బందులు, కష్టనష్టాల గురించి ఆలోచించినట్లు అనిపించదు. మండుటెండలో ప్రజలు నీటి కోసం బాగా ఇబ్బంది పడే రోజుల్లో ఎన్నికలు పెట్టడానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇవ్వడం అంత బాగోలేదని చెప్పాలి. అంతా కలిపి మహా అయితే నెలన్నరలో పూర్తి చేసే విధంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించకపోవడం కమిషన్ వైఫల్యం అనిపిస్తుంది. లేదా రాజకీయ జోక్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందేమోనన్న అభిప్రాయం కలుగుతుంది.
ఒక ఎన్నికల కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండటం, మరో కమిషనర్ రాజీనామా చేయడం, కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఇద్దరు కమిషనర్లను నియమించడం.. వీటన్నిటిని చూస్తే ఎన్నికల కమిషన్‌లో పరిస్థితి సవ్యంగా ఉన్నట్లు అనిపించదు. గతంలో ఒకప్పుడు ఒకరే ఎన్నికల కమిషనర్ ఉండేవారు. శేషన్ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు అప్పటి పీవీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను త్రిసభ్య కమిషన్‌గా మార్చింది. శేషన్ అందరిలోనూ దడ పుట్టించారంటే అతిశయోక్తి కాదు. ఆ సంగతి ఎలా ఉన్నా, కొత్త కమిషనర్లు వచ్చే వరకు షెడ్యూల్‌ను ప్రకటించకుండా ఆపవలసిన అవసరం ఏమిటో అర్ధం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించిన తర్వాత కానీ షెడ్యూల్ ప్రకటించరన్న అభిప్రాయం ఉంది. అలాగే ఆయన సదుపాయార్దం సాధ్యమైనంత ఎక్కువ చోట్ల ప్రచార ప్రసంగాలు చేయడానికి కూడా వెసులుబాటుగా ఇలా ఏడు దశలలో నిర్ణయిస్తున్నారని విపక్షం విమర్శిస్తోంది.
దీనిని ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోయినా, ప్రజలకు సందేహాలు రావడానికి అవకాశం ఉంది. ఒక రకంగా ఇది రాజకీయమే అని అనుకోవచ్చు. దానికి తగినట్లుగానే షెడ్యూల్‌ను వారం రోజులు లేటు చేయడం, మండుటెండల్లో ఎన్నికలు నిర్వహించడం రాజకీయ పార్టీలకు పెద్ద సమస్యే అని చెప్పాలి. ఎన్నికలకు సిద్దమైన అభ్యర్ధులకు మరో నెల అదనంగా వ్యయ ప్రయాసలకు సిద్దం కావాలి. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. ఏపీలో 2019లో ఏప్రిల్ పదకొండో తేదీన ఎన్నికలు జరిగిపోయాయి. తొలి దశలో ఎన్నికలు పూర్తి అయితే, ఈసారి మాత్రం నామినేషనే ఏప్రిల్ 18న మొదలు కాదు. గతానికి భిన్నంగా నాలుగో దశలో ఏపీ శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పటి నుంచి రెండు నెలలపాటు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకోవలసి ఉంటుంది. దీనిపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. బీజేపీతో కూటమి కట్టాక, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏమైనా మేనేజ్ చేసి ఈ ఎన్నికలను నాలుగో దశలో పెట్టించారా? అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం మరెవరికి లేకపోవడమే ఈ డౌటుకు కారణం. టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి చాలా రోజులైనా, బీజేపీ కొద్ది రోజుల క్రితమే క్లియర్ చేసింది. టీడీపీ, జనసేనల క్యాడర్ మధ్య ఏర్పడిన అంతరం, గొడవలు సర్దుబాటు చేసుకోవడమే సమస్యగా ఉంది. బీజేపీ కూడా కలిశాక ఈ వివాదాలు మరింత పెరిగాయి. ఏపీ బీజేపీ సీనియర్ నేతలు కొందరు పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తూ, బీజేపీకి టీడీపీ మళ్లీ వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు. ఈ గొడవలన్నీ సెటిల్ కావడానికి మరికొంత టైమ్ పట్టవచ్చు.
ప్రధాని మోదీ 17వ తేదీన చంద్రబాబు, పవన్తో కలిసి చిలకలూరిపేట వద్ద సభ జరిపే రోజుకు కూడా అసలు బీజేపీ అభ్యర్ధులనే ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో చంద్రబాబు లేదా బీజేపీ పెద్దలు ఏపీలో ఎన్నికలను నాలుగోదశకు మార్చేలా చూశారా అన్న ప్రశ్నను కొందరు సంధిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీ, తెలంగాణలలో రాజకీయ పార్టీలకే కాక, ప్రజలకు కూడా ఈ ఎన్నికలు ఒక పరీక్షగా మారతాయి. ప్రభుత్వాలు ముఖ్యమైన ప్రతీ పనికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అది కూడా ఇబ్బందిగానే ఉండవచ్చు.
పార్టీలపరంగా చూస్తే ముఖ్యమంత్రి, వైఎఎస్సార్‌సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సింపుల్‌గా ఎన్నికల తేదీ పేర్కొని సిద్దం అని రాసి హుందాగా కామెంట్ చేస్తే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం యధాప్రకారం వైఎస్సార్‌సీపీపై విమర్శలు గుప్పించారు. ఏదో స్వాతంత్ర్య పోరాటమని, ప్రజల కోసమని, రాష్ట్ర విముక్తి అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేశారు. గతసారి ప్రజలు తెలుగుదేశంను తిరస్కరించారని అంటే చంద్రబాబును వదలించుకోవాలని అనుకున్నారని ఎవరైనా అంటే చంద్రబాబు ఒప్పుకుంటారా అన్న ప్రశ్న వస్తుంది. తాను ఏది చేసినా ఒప్పు అయినట్లు మాట్లాడడంలో, ఎదుటివారు ఏది చేసినా తట్టెడు బురద వేయడంలో చంద్రబాబు దిట్ట అని చెప్పాలి.
తాజాగా ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డిలను టీడీపీలో చేర్చుకుని స్వాగతం చెప్పారు. విశేషం ఏమిటంటే డిల్లీ లిక్కర్ స్కామ్లో వీరిద్దరి పాత్ర ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభియోగం మోపింది. రాఘవరెడ్డి కొన్ని నెలలపాటు జైలులో కూడా ఉన్నారు. మాగుంటకు వైఎస్సార్‌సీపీ టిక్కెట్ ఇవ్వరాదని నిర్ణయించుకుంది. ఈయన వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం మద్దతు పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలలో వారిపై ఎన్ని వ్యతిరేక వార్తలు రాశారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. వీరికి వైఎస్సార్‌సీపీ టిక్కెట్ ఇచ్చి ఉంటే చంద్రబాబు విరుచుకుపడేవారు. స్కామ్‌లు చేసినవారికి టిక్కెట్లు ఇచ్చారని ద్వజమెత్తేవారు. కానీ, ఇప్పుడు ఆయనే పార్టీలో చేర్చుకున్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ కూడా ఇస్తారేమో చూడాలి.
దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. తాము చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం అని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రచారం చేస్తారని తేలుతుంది. మాగుంట ఈడీ విచారణ ఎదుర్కుంటున్న రోజుల్లో ఈనాడులో ఎన్నో వ్యతిరేక కథలు రాసిన రామోజీ ఇప్పుడు తేలు కుట్టిన దొంగ మాదిరి కిక్కురుమనడం లేదు. ఏపీలో ఒక నెల రోజులు ఆలస్యం అయినా అధికార పార్టీకి పెద్ద ఇబ్బంది ఉండదు. చంద్రబాబు వంటివారు ఏదో భయపడి ఒకవేళ ఎన్నికలను జాప్యం చేయించినా, దాని ప్రభావం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్ధులపై కూడా పడుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్దం అని సీఎం జగన్ ప్రకటించి విపక్షాలకు సవాలు విసిరారని చెప్పాలి.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment