ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకు ఒక రోజు ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. మోదీని కలిసిన జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు బకాయిలు, తెలంగాణ నుంచి రావల్సిన విద్యుత్ బకాయిలు తదితర విభజన హామీలపై మళ్లీ వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు.
కాని చంద్రబాబు ఏమి చేశారు? ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కోరారు. మరి ఏపీ అంశాలపై ఎందుకు డిమాండ్లు పెట్టలేకపోయారు? కొన్ని నెలల కిందట చంద్రబాబు కుమారుడు లోకేష్ స్వయంగా అమిత్ షాను కలిసి ఏమి కోరారు. తన తండ్రిని స్కామ్ కేసులలో జైలులో పెట్టారని, ఆయనను విడిపించాలని కోరారు. బీజేపీ నేతగా ఉన్న పురందేశ్వరిని కూడా వెంటబెట్టుకుని లోకేష్ వెళ్లారు. ఇంతకాలం చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఏమి ప్రచారం చేసేవారు? జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళితే తన కేసులకు సంబంధించి అని, ఇంకేదో వ్యక్తిగత విషయాల కోసమని ఊదరగొట్టేవారు. వాస్తవానికి ఆ పని చేసిందెవరు? చంద్రబాబు, లోకేష్‌లు కాదా? కాని ఎల్లో మీడియాగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో ఎన్ని అబద్దాలు రాస్తారో తెలుసుకోవడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి.
కొద్ది రోజుల క్రితం 'నాడు రంకెలు, నేడు సలాములు' అంటూ ఈనాడు దినపత్రిక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాసిన వార్తను చదివితే ఆ మీడియా యజమాని రామోజీరావు ఎంతగా దిగజారిపోయారో అర్ధం అవుతుంది. కేంద్రం విభజన హామీలు నెరవేర్చకపోతే దానికి జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యుడట. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రంకెలు వేశారట. ఇప్పుడు సలాములు చేస్తున్నారట. అది కూడా తన కేసుల గురించి అట. ఇంత నిస్సిగ్గుగా ఒక పత్రిక రాయడం గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రత్యేక హోదా తదితర అంశాలపై గతంలో రకరకాల మాటలు మార్చి రంకెలు వేసింది చంద్రబాబు నాయుడు అయితే రామోజీ మాత్రం జగన్‌మోహన్‌రెడ్డి పై ఏడుస్తారు.
జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లి మోదీని రాష్ట్ర సమస్యలపై కలిసినా ఇలాంటి పచ్చి అబద్దాలు రాయడానికి ఈనాడు సిగ్గుపడదు. అమిత్‌షాను చంద్రబాబు కలిసినప్పుడు రాష్ట్ర సమస్యలపై ఎందుకు అడగలేదని ఈనాడు ఎప్పుడైనా ప్రశ్నించిందా? బీజేపీని తిట్టిన నీవు ఏ మొహంతో అమిత్‌షాను కలిశావని చంద్రబాబును రామోజీ ప్రశ్నించారా? కేంద్ర హామీలపై విశ్లేషణ చేయదలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి జరిగింది? జగన్‌మోహన్‌రెడ్డి టైమ్ లో ఏమి అయింది?తెలుగుదేశం ఎంపీలు మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పుడు ఏమైనా సాధించారా? లేదా? అన్న అంశాలను కూలంకషంగా విశ్లేషించాలి.. అది పద్దతి.
అలా కాకుండా జగన్‌మోహన్‌రెడ్డి పైనే రాయడం అంటే ఈనాడు రామోజీ అక్కసు, ద్వేషం ఆ స్థాయిలో ఉందన్నమాట. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడిన మాట నిజం. అప్పుడు కూడా విషయానికి పరిమితం అయ్యారు తప్ప ప్రధానిపైన, కేంద్రంపైన అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్‌డీఏ లో భాగస్వామి అయినందున ఈ విషయంలో ఆయన పాత్రను గుర్తు చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో కూడా ఒక మాట చెప్పేవారు. తమకు 25 సీట్లు ఇస్తే, కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాని పక్షంలో ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికి మద్దతు ఇచ్చి, డిమాండ్ సాధిస్తామని అనేవారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రధానితో తొలి భేటీలోనే ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు. ఎప్పుడు అవకాశం వచ్చినా వినిపిస్తూనే ఉన్నారు. అలాగే పార్లమెంటులో సైతం వైఎస్సార్‌సీపీ ఎమ్‌పీలు కోరుతున్నారు. మోదీని కలిసిన తర్వాత బీజేపీకి పూర్తి మెజార్టీ రావడం మన ఖర్మ అని వ్యాఖ్యానించి జగన్‌మోహన్‌రెడ్డి సంచలనం సృష్టించారు. అంత ధైర్యంగా జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానిస్తే కేసుల కోసం సలాము చేస్తున్నారని ఈనాడు పనికిమాలిన రాతలు రాసింది. మరి చంద్రబాబు ఏమి చేశారు. ప్రత్యేక హోదాను పదేళ్లు ఇవ్వాలని అడిగిన ఆయన ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి మెడలు వంచి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారా? లేదా? దానిని కదా సలాము చేయడం అని అనాల్సింది.
కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కానుకగా స్వీకరించి, మొత్తం ప్రాజెక్టు బాధ్యత తనదే అంటూ కబుర్లు చెప్పి, కేంద్రం తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు కాదా? విభజన హామీలపై కేంద్రాన్ని అప్పట్లో ఏనాడైనా నిలదీశారా? వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో భయపడి, కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకున్నది వాస్తవం కాదా? ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చాక మాత్రం మోదీపై రంకెలు వేసింది చంద్రబాబు కదా! చివరికి మోదీ భార్యను సైతం అనవసరంగా ప్రస్తావించి అవమానించింది చంద్రబాబు కాదా!
తీరా 2019 ఎన్నికలలో ఓటమికి గురి అయ్యాక మొత్తం యుటర్న్ తీసుకుని మోదీని పొగుడుతున్నది చంద్రబాబు కాదా? అమిత్‌షా, జేపీ నడ్డాలను కలిసి ప్లీజ్.. ప్లీజ్ మమ్మల్ని ఎన్‌డీఏలో చేర్చుకోవాలని అడిగింది ఆయన కాదా! అంటే సలాము చేస్తున్నది ఎవరో తెలియడం లేదా? అలాగే పాచిపోయిన లడ్లు ఇచ్చారంటూ ప్యాకేజీపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ వేసిన రంకెలు రామోజీకి గుర్తు లేవా? ఆయన కూడా గత ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా గురించి ఏమి చేశారు. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్నారు కదా? పవన్ ఇప్పటికే బీజేపీలో చంకలో ఉండగా, చంద్రబాబు బీజేపీ చంక ఎక్కడానికి నానా తంటాలు పడుతున్నారు.
స్కిల్ స్కామ్ కేసులో జైలులో ఉన్నప్పుడు తన కుమారుడు లోకే హోం మంత్రి అమిత్‌షా వద్దకు పంపి సలాము చేయించింది చంద్రబాబు కాదా? వీటన్నిటిని విస్మరించి కేవలం జగన్‌మోహన్‌రెడ్డిపైనే దుర్మార్గపు రాతలు రాయడం కన్నా నీచం ఏమైనా ఉంటుందా? అంతదాకా ఎందుకు రామోజీ పుట్టింది ఏపీలోనే కదా! ఆ ప్రాంతంపై రవ్వంత అభిమానం ఉన్నా, ప్రత్యేక హోదాపై ఆయన ఎందుకు పోరాడలేదు. తనకు పద్మ విభూషణ్ బిరుదు ఇస్తే మురిసిపోయి తీసుకున్నారు కదా?ఇన్ని కబుర్లు చెప్పే మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే, విభజన హామీలు నెరవేర్చితేనే ఆ బిరుదు తీసుకుంటానని ఎందుకు చెప్పలేకపోయారు? రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా తెగ నీతులు చెప్పే మీరు ఆ మాత్రం ఎందుకు చేయలేకపోయారు?
అంటే మీకు ఈ విషయాలలో నిజాయితీ, చిత్తశుద్ది లేదన్నమాటే కదా? పైగా ఏపీకి వచ్చే పరిశ్రమలను ఎలా చెడగొట్టాలా అని చూస్తున్నది రామోజీరావు కాదా? ఇక రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఒక వ్యాఖ్య చేయగానే సంబరపడిపోయి మొదటి పేజీలో వార్తలు ఇచ్చారే. రైల్వేజోన్ ఇవ్వడానికి స్థలానికి సంబంధం ఏమిటి? ముందుగా కేంద్ర క్యాబినెట్ ఎందుకు ఆమోదం తెలపలేదు? ఆ తర్వాత వారికి నిజంగా రైల్వేజోన్ ఆఫీస్ పెట్టాలని ఉంటే ఒకటి, రెండు భవనాలే దొరకలేదా? ఒడిషాలో తమ రాజకీయ ప్రయోజనాలకు ఇబ్బంది వస్తుందని భయపడుతున్న అశ్వనికి ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంతపాడుతూ వార్తలు రాస్తారా?
ఏపీకి కేంద్రం మంజూరు చేసిన ఐఐటీ, ఐఐఎమ్ వంటివి అన్ని భవనాలు రెడీ అయిన తర్వాతే వచ్చాయా? కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయగానే, వేరే కాలేజీలలో తాత్కాలికంగా నడిపి, ఆ తర్వాత భవనాలు నిర్మించి ఐఐటీ, ఐఐఎమ్ లను తరలించారు కదా? అలా ఎందుకు రైల్వే జోన్ విషయంలో చేయడం లేదు?పైగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జోన్‌కు అవసరమైన స్థలం ఇస్తూ లేఖ రాసిన తర్వాత కూడా కేంద్ర మంత్రి అసత్యం ఎందుకు చెప్పారు? దానికి కారణం ఒకటే. ఏపీలో బీజేపీకి వచ్చే పార్లమెంటు సీట్లు ఏవీ లేవు. ఒడిషాలో కొన్ని రావచ్చు.
కాని విశాఖ కోసం అక్కడి జోన్‌ను చీల్చితే రాజకీయంగా నష్టం జరుగుతుందని వారు భయపడుతున్నారట. అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని చెబుతున్నారు. ఈ విషయాలు తెలిసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీడీపీ, జనసేన వంటివి అసత్యాలే ప్రచారం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకోవడం వేరు. కాని మీడియా సంస్థలుగా రామోజీ, రాధాకృష్ణ వంటివారు దుర్మార్గపు విష ప్రచారం చేయడం వేరు. ఈ న్యూసెన్స్ ను వచ్చే శాసనసభ ఎన్నికల వరకు ఏపీ ప్రజలు భరించక తప్పదు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment