లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ తన ముసుగు తొలగించినట్లు ఉన్నారు. ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయన ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంది. గత ఐదేళ్లో ఏమీ జరగలేదన్నట్లుగా ప్రసంగించడంలోనే ఆయన ఎవరి రాజకీయ ప్రయోజనం కోసమో ప్రకటన చేస్తున్నారన్న సంగతి అర్ధం అవుతుంది. బాగా పరిశీలిస్తే ఇందులో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కన్నా ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉండే ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కోసమే ఈ విధంగా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చినట్లు అనిపిస్తుంది.
ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయన బీజేపీలో ప్రజాస్వామ్యం చూశారు. చంద్రబాబులో నీతి, నిజాయితీలు ఉన్నాయని కనిపెట్టారు. పవన్‌కల్యాణ్‌కు గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. దీనిని బట్టే ఆయన మానసిక పరిస్థితి ఎలా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మధ్య ఒక ప్రోగ్రాంలో కూడా టీడీపీ, జనసేనలకు అధిక మార్కులు ఇచ్చి వైసీపీకి తగ్గించారట. దానిపై వైసీపీ సోషల్ మీడియా ఏకిపారేసిందట. దానిని దృష్టిలో ఉంచుకుని ఆయన తనకు కులం ఆపాదిస్తున్నారని వాపోయారు. నిజమే అలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వరాదనుకుంటే ముందుగా తాను నిజాయితీగా మాట్లాడాలి కదా! కేవలం రామోజీ కళ్లలో ఆనందం చూడడానికో, లేక టీడీపీ మీడియాను సంతోషపెట్టడానికో, చంద్రబాబుతో అనుబంధం పెంచుకోవడానికో ప్రకటనలు చేస్తే ప్రత్యర్ధులు సహజంగానే అనుమానిస్తారు.
జేపీకి ఏ స్వార్ధ ప్రయోజనం లేకుండా ఇలా అనైతిక మద్దతు ఇస్తారా అన్న డౌటు వ్యక్తం చేస్తారు! రాజకీయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను చెప్పదలిస్తే అన్ని విషయాలను చెప్పాలి. గత ఐదేళ్లలోనే ఏవో జరగకూడనివి జరిగినట్లు చెప్పిన తీరు పూర్తిగా అభ్యంతరకరం. 2014లో ఇదే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి పోటీచేసి వందల కొద్ది హామీలు ఇచ్చి మోసం చేసిన సంగతి జేపీకి తెలియదా? అప్పుడు అది ప్రజాస్వామ్యంగా కనిపించిందా? లక్ష కోట్ల రుణాలను మాఫీ చేస్తానని, తాకట్టులో ఉన్న రైతుల భార్యల మెడలలోని నగలను కూడా విడిపిస్తానని చంద్రబాబు వాగ్దానం చేసినప్పుడు అదెలా సాధ్యమని అడగని జేపీ ఇప్పుడు ఆయనలో అభ్యుదయాన్ని చూసి తరిస్తున్నారు.
జగన్ తాను ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ కార్యక్రమాలకు ఏభైవేల కోట్లు వ్యయం చేయడాన్ని పరోక్షంగా జేపీ తప్పు పడుతున్నారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు కలిసి సూపర్ సిక్స్ పేరుతో అలవి కాని హామీలను, ఏడాదికి సుమారు లక్షన్నర కోట్ల మేర ఖర్చు చేస్తామని అంటున్నారే. అయినా వారిలో జేపీకి ఎలా విజనరీలు కనిపించారు? పెట్టుబడుల గురించి జేపీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది.
రెండేళ్లపాటు కరోనా ఉన్నా జగన్ పాలనలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చింది అవాస్తవమా? పునరుత్పాదక విద్యుత్ రంగంలో వస్తున్న పెట్టుబడులు జేపీకి కనిపించడం లేదా? శ్రీసిటీ, అచ్యుతాపురం సెజ్‌లలో వచ్చిన కొత్త పరిశ్రమలు, విశాఖలో అదానీ డేటా సెంటర్, ఇన్ ఫోసిస్ సెంటర్, కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ హబ్, బద్వేల్‌లో సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్, నక్కపల్లి వద్ద ఫార్మా హబ్ ఇలా అనేక కొత్త పరిశ్రమలు వస్తుంటే, వాటిని ఎలా అడ్డుకోవాలా అని ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు దుష్ట పన్నాగాలు పన్నుతున్న వైనం జేపీకి తెలియదా? చంద్రబాబు హయాంలో మహా అయితే ఒక కియా ప్లాంట్ వచ్చింది. దాని ద్వారా బాగా వస్తే సుమారు పన్నెండు వందల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయి.
అదే జగన్ తీసుకు వచ్చిన రామాయపట్నం ఓడరేవు నిర్మాణంలోనే రెండువేల మంది పని చేస్తున్నారు. తీర ప్రాంతాన్ని చంద్రబాబు టైమ్‌లో ఎందుకు పట్టించుకోలేదో, ఓడరేవులు ఎందుకు నిర్మించలేదో చంద్రబాబును ఈయన అడగడం లేదు. ప్రస్తుతం పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్న జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట, కాకినాడ, మచిలీపట్నం పోర్టులు కూడా వేగంగా సాగడం లేదా? వాటిని ఎప్పుడైనా జేపీ చూశారా? పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్ కాదా? పాడేరు వంటి మారుమూల కూడా మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుంటే, కనీసం అభినందించడం మాని అచ్చం టీడీపీకో, రామోజీకో ఏజెంటుగా మారి జేపీ మాట్లాడడం చిత్రంగా ఉంది. అందుకే జేపీని శంకంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పలాస వద్ద కిడ్ని బాధితులకోసం నిర్మించిన సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, 800 గ్రామాల కోసం వాటర్ స్కీమ్ వంటివి తెచ్చింది జగన్ కాదా? ఇవేవి చంద్రబాబు టైమ్‌లో ఎందుకు రాలేదు? అసలు ఏపీలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చింది జగన్ కాదా? దాని గురించి గతంలో ఒకసారి జేపీనే మెచ్చుకున్నారు కదా? మరి ఇంతలోనే ఏమైంది? సడన్‌గా మాట మార్చి ఏపీలో ఏమి జరగడం లేదని రాగం ఎత్తుకున్నారే! వైద్యరంగంలో తీసుకు వచ్చిన పెనుమార్పులు కనిపించడం లేదా? ప్రజల ఇళ్ల వద్దకే డాక్టర్‌ను పంపించడం గొప్ప విషయం కాదా? ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టడం తప్పవుతుందా? ఇవన్ని అభివృద్దిలో భాగం కాదా? పాలన సంస్కరణల గురించి గొప్పగా ప్రచారం చేసుకునే జయప్రకాష్ నారాయణకు గ్రామ, వార్డు స్థాయిలో జరిగిన అధికార వికేంద్రీకరణను చూడలేరా? గతంలో అన్ని ఆఫీసులు హైదరాబాద్‌లో కేంద్రీకరించడం వల్లే నష్టం జరిగిందని, సచివాలయం ఒకచోట, వివిధ ప్రభుత్వ శాఖలు వేర్వేరు పట్టణాలలో ఏర్పాటు చేయాలని వాదించిన జేపీ ఇప్పుడు అన్నీ అమరావతిలోనే పెట్టాలని చెబుతున్నారు.
మూడు పంటలు పండే భూములను చంద్రబాబు నాశనం చేశారని అప్పుడు బాధపడి, ఇప్పుడు ఇలా జేపీ మాట మార్చారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా వృద్దులతో సహా ప్రజలందరికి ఇళ్ల వద్దకే సుమారు 600 రకాల సేవలు అందిస్తుంటే, అంతకు మించిన గొప్ప పాలన ఎక్కడ ఉందని జేపీ చెప్పగలరు? చంద్రబాబు టైమ్‌లో మాదిరి జన్మభూమి కమిటీలు పెట్టి అవినీతికి ఆలవాలం చేస్తే జేపీకి బాగుందా? ఒక్క మాటకు సమాదానం చెప్పండి జేపీగారు! జగన్ తన ఐదేళ్ల కాలంలో రెండేళ్లు కరోనా సమస్యతో సతమతం అయ్యారు. అప్పుడు ఆయన ప్రభుత్వం అందించిన సేవలు సర్వత్రా ప్రశంసలు పొందాయా? లేదా? ఆ రెండేళ్లతో సహా ఐదు సంవత్సరాలలో సుమారు రెండున్నర లక్షల కోట్లకు పైగా పేదలకు వివిధ స్కీమ్‌ల రూపంలో అవినీతికి ఆస్కారం లేకుండా పంపిణీ చేశారు. దీనికి లెక్కలు ఉన్నాయి. మరి అదే చంద్రబాబు టైమ్‌లో రెండున్నర లక్షల కోట్ల అప్పు తెచ్చి ఫలానాది చేశామని చెప్పించండి. లేదా మీరు చెప్పండి.
- అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపి, రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చి, మూడు పంటలు పండే భూములను నాశనం చేస్తే అదేమో గొప్ప అభివృద్దిగా మీలాంటి చదువుకున్నవారు కూడా భావిస్తే ఏమనుకోవాలి?
- ఒకప్పుడు సోనియాగాందీ, మన్మోహన్‌సింగ్‌లకు సన్నిహితంగా ఉండి చాలా సంస్కరణలు తెచ్చామని చెబుతుంటారుకదా?
- సడన్‌గా మోడీని పొగుడుతున్నారేమిటి?
- మరి ఆయన ప్రభుత్వంలో వచ్చిన ఎలక్టోరల్ బాండ్లలో కుంభకోణం జరగలేదని మీరు నమ్ముతున్నారా?
- చంద్రబాబుకు వచ్చిన ఆదాయపన్ను నోటీసులో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు, తప్పుడు లెక్కలు చూపినట్లు ఉన్న అంశాలతో మీరు ఏకీభవిస్తారా? విభేదిస్తారా?
- చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో సోదాలు జరిపి రెండువేల కోట్ల అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీ ప్రకటించింది కదా! అయినా చంద్రబాబు నిప్పు అని మీరు దృవీకరణ పత్రం ఇస్తున్నారా?
- పవన్‌కల్యాణ్ సకల గుణాభిరాముడని మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారా?
- వీరంతా కలిసి తెస్తామన్న ప్రత్యేక హోదా ఏమైపోయింది?
- విభజన హామీలన్ని నెరవేరాయా?
- మద్యలో మోడీని చంద్రబాబు బండబూతులు ఎందుకు తిట్టారో మీరైనా వివరించగలరా?
మోడీ పాచిపోయిన లడ్లు ఇచ్చారని పవన్ ఎందుకు అన్నారో కాస్త మీరైనా చెప్పండి. మరి ఇప్పడు మోడీతో కలిసి పాల్గొన్న సభలో ఒక్క మాటైనా వాటి గురించి అడిగే దైర్యం చేయని ఆ నేతలు మీకు ఆదర్శవంతంగా, రాష్ట్రాన్ని అభివృద్ది చేసేవారుగా కనిపిస్తున్నారా? ఇదంతా చూస్తుంటే ఒక మాట అనిపిస్తుంది. రామోజీరావుకు మీరు అత్యంత సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకే ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నారేమోనని డౌటు వస్తోంది. వచ్చే ఎన్నికలలో ఈ కూటమి గెలవకపోతే తమకు పుట్టగతులు ఉండవని, మార్గదర్శి అక్రమాలన్నీ పూర్తిగా వెలుగులోకి వస్తాయని ఆయన భయపడి మీకు ఈ డైరెక్షన్ ఇచ్చారేమోనని ఎవరైనా అనుకుంటే తప్పేమి ఉంటుంది? ఎందుకంటే వాటిమీద మీరు ఎన్నడూ స్పందించ లేదు కదా?
గతంలో ఏపీలో విద్యారంగం బాగుందని చెప్పిన మీరే ఇప్పుడు స్వరం మార్చడంలో మతలబు ఏమిటో చెప్పాలి కదా! ఏపీలో ప్రజాస్వామ్యం లేదా? రోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, టీవీలు, ఇతరత్రా టీడీపీకి మద్దతు ఇచ్చే చానళ్లు జగన్ ప్రభుత్వం పై విషం చిమ్ముతూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తుంటే, పార్టీ కరపత్రాల కన్నా, బాకాల కన్నా హీనంగా మారితే కూడా ప్రభుత్వం చర్య తీసుకోవడం లేదే? పత్రికా స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నా మీలాంటి ప్రగతి కాముకులు కనీసం అదేమిటి అనకపోగా వారికే వంత పాడతారా? ఇదెక్కడి న్యాయం.
ఒకప్పుడు ఐఎఎస్ అధికారిగా ఉన్నప్పుడు కాస్తో, కూస్తో మంచి పేరే తెచ్చుకున్నారు కదా! అదంతా ఏమైపోయింది? లోక్ సత్తాను స్వచ్చంద సంస్థగా స్థాపించి, తర్వాత దానిని రాజకీయ పార్టీగా మార్చి కుకట్ పల్లిలోనే మీరు ఎందుకుపోటీచేశారో ఎవరికి తెలియదని అనుకుంటే ఎలా? 2014లో టీడీపీతో కలిసి పోటీచేసి మల్కాజిగిరి టిక్కెట్ కోసం ప్రయత్నించారా? లేదా? చంద్రబాబు మీకు మొండి చేయి చూపారా? లేదా? ఆ తర్వాత రాజకీయంగా బాగా వెనక్కివెళ్లిన జేపీ ఇప్పుడు కొత్త రంగు వేసుకుని కూటమికి మద్దతు ఇచ్చే అవతారం ఎత్తారు. ఇదంతా ఏపీ ప్రజలను మోసం చేయడానికే అన్న సంగతి అర్ధం అవుతూనే ఉంది.
రాజకీయ పార్టీల తప్పులను ఎండగడితే తప్పుకాదు. కాని కొన్ని పార్టీల తప్పుడు భాగోతాలను సమర్ధించడం కోసం ఇతర పార్టీలను నిందించాలని అనుకోవడం దుర్మార్గం. దీనివల్ల మీ పరువు, ప్రతిష్టే దెబ్బతిన్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్, రామోజీ, రాధాకృష్ణ, పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటివారితో మీరు శృతి కలిపి తప్పు చేస్తున్నారు కనుక! నిష్పక్షపాతంగా వ్యాఖ్యానించడం లేదు కనుక! తాను తప్పు మాట్లాడుతున్నానని, ఒత్తిడికి లొంగి మాట్లాడుతున్నానని తెలుసు కాబట్టే జేపీ తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చే సమయంలో జయప్రకాష్ నారాయణ మొఖం అపరాధభావంతో కందగడ్డ మారిన విషయం స్పష్టంగా అందరికి కనిపించింది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment