ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష మూడుపార్టీల కూటమి నిర్వహించిన ప్రజాగళం సభ జరిగిన తీరు చూస్తే వారు చేతులెత్తేసినట్లే కనిపిస్తుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభ ఇంత అద్వాన్నంగా జరుగుతుందని ఎవరూ ఊహించలేరు. బహుశా మోదీ కూడా ఇంత నాసిరకంగా సభ జరుగుతుందని అనుకుని ఉండరు. సభలో మోదీ ప్రసంగిస్తుండగా, పలుమార్లు మైక్ ఆగిపోవడం, దాంతో ఆయన అసహనం వ్యక్తం చేయడం, అంతకుముందు ప్రధానిని చంద్రబాబు సత్కరిస్తారని అనౌన్స్ చేస్తే, ఆయన చేతిలో పుష్పగుచ్చం కూడా లేకపోవడం, అయోమయంగా నిలబడడం వంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయి.
ఇలాంటి తప్పుల సంగతి పక్కనపెడితే , సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ , ప్రధాని మోదీలలో ఎవరూ కూడా ఏపీలో తమను ఎన్నుకుంటే ఏమి చేసేది ఒక్కమాట కూడా చెప్పకపోవడం గమనించాల్సిన విషయం. మోదీ అన్నా కాస్తో,కూస్తో ఏపీకి ఫలానాది చేశాం అని చెప్పుకున్నారు. తద్వారా ఏపీలో వైఎస్ జగన్ హయాంలో అభివృద్ది జరిగిందన్న పాయింట్ ను పరోక్షంగానైనా అంగీకరించారు.
కేంద్ర స్కీముల గురించి ప్రచారం చేసుకునే క్రమంలో ఆయన ఈ సంగతులు చెప్పారు. కొన్ని విద్యాసంస్థలను మంజూరు చేసిన సంగతి తెలిపారు. ఏపీకి పది లక్షల ఇళ్లు మంజూరు చేశామని ఆయన అన్నారు. దేశచరిత్రలో ఎప్పుడు,ఏ రాష్ట్రంలో లేని విధంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి, గృహాలు నిర్మిస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. దానిని కొంతవరకు మోదీ కూడా ఒప్పుకున్నట్లయింది. అలాగే మరికొన్ని స్కీములు జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ గురించి కూడా మోదీచెప్పుకున్నారు. అసలు ఏపీలో అభివృద్ది లేదని ఆరోపించే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు మోదీనే సమాధానం ఇచ్చినట్లయింది. మోదీ ఎక్కువ సేపు కేంద్ర ప్రభుత్వం తీరుతెన్నులు, ఎన్డీఏ ప్రాముఖ్యత,400 సీట్లు తదితర విషయాల గురించే మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా ఆయన పెద్దగా ఏమీ విమర్శలు చేయలేదనే చెప్పాలి. కేవలం మంత్రులపై జనరల్ గా చేసే ఒక ఆరోపణ మాత్రం చేశారు.కాంగ్రెస్ , వైఎస్ఆర్సీపీలు ఒకటేనని మోదీ చేసిన వ్యాఖ్య విన్నవారంతా నవ్వుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీకి జగన్ సోదరి షర్మిల నాయకత్వం వహిస్తున్నప్పటికీ ,ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని అందరికి తెలుసు. కాకపోతే ఇంకోరకంగా ఆలోచిస్తే, కాంగ్రెస్ వారంతా అనవసరంగా ఆ పార్టీకి వేయకుండా, వైఎస్సార్‌సీపీకి వేయండని సూచించారేమో అనిపిస్తుంది.
ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. మోదీకుటుంబ రాజకీయాల గురించి ప్రస్తావించారు. కాకపోతే తన పక్కనే ఒవైపు చంద్రబాబు, మరో వైపు పురందేశ్వరిని కూర్చోబెట్టుకున్నారు. వీరిద్దరూ ఎన్టీఆర్ కుటుంబంలో భాగంగా చూస్తారో,లేదో తెలియదు. మోదీ చెప్పిన దాని ప్రకారం బీజేపీ కూడా ఒక కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చినట్లయింది. అంతేకాదు చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, లోకేష్ , భరత్ ఇలా పలువురు సన్నిహిత బందువులు టీడీపీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. పొత్తుపెట్టుకునే వరకు టీడీపీని కుటుంబ పార్టీ అని, చంద్రబాబు వెన్నుపోటుదారుడని బిజెపి జాతీయ నేతలు సునీల్ ధియోధర్ తో సహా పలువురు ద్వజమెత్తేవారు. ఆ విషయాన్ని విస్మరించి మోదీ మాట్లాడడం బాగోలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏపీకి ఉపయోగం జరుగుతుందని అన్నారు.ఏ రకమైన అభివృద్ది చేస్తారో ఆయన ఒక్క మాట వివరించలేకపోయారు.
ప్రత్యేక హోదా ,పోలవరం నిధులు, రైల్వేజోన్ ,ఏపీకి రావల్సిన ఆస్తులు, ఇతర విభజన హామీలు ఒక్కటి కూడా ప్రస్తావించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయబోమని కూడా అనలేదు.2014లో ప్రత్యేక హోదాతో సహా పలు హామీలను ఈ మూడుపార్టీలు తిరుపతి సభలో ఇచ్చాయి. ఈసారి చంద్రబాబు,పవన్ లు కనీసం వాటి గురించి మాట్లాడే ధైర్యమే చేయలేకపోయారు. దాంతో మోదీకి వాటిపై జవాబు ఇవ్వవలసిన అవసరం లేకుండా పోయింది. నిజానికి మీటింగ్ లో మోడీ, చంద్రబాబు పక్కపక్కన కూర్చున్నప్పటికీ, వారిలో ఆ సంతోషం కనిపించలేదు. గతంలో ఒకరినొకరు దూషించుకున్న ఘట్టాలే గుర్తుకు వచ్చి ఉండాలి. మోదీకూడా ఏదో మొక్కుబడిగా వచ్చినట్లే ఉంది కాని, గతాన్ని పూర్తి మర్చిపోయారనిపించలేదు. అప్పట్లో మోదీని టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేనివాడని, అవినీతిపరుడని.. నోట్ల రద్దుతో దేశాన్ని నాశనం చేశాడని..ఇలా ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు పక్కన కూర్చోవలసి వచ్చినందుకు మోదీబాధపడి ఉండాలి.
చంద్రబాబును ఎన్డీయేలో చేర్చుకోవడం ,కలిసి సభలో పాల్గొనడం ద్వారా మోదీ కూడా అవకాశవాదే అన్న అభిప్రాయం ఏర్పడింది. 2019లో చంద్రబాబును యుటర్న్ బాబు అంటూ ఎద్దేవ చేస్తూ, అమరావతి, పోలవరం ప్రా.జెక్టులలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మోదీతీవ్రంగా విమర్శించారు. అమరావతి కుంభకోణాలపై విచారణ చేయిస్తామని బీజేపీ మానిఫెస్టోలో కూడా తెలిపారు. అయినా వాటన్నిటిని పక్కనబెట్టిన తీరు,తాను కూడా యుటర్న్ తీసుకున్న వైనం, మోదీకి కూడా పరువు తక్కువే అని ఒప్పుకోవాలి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే గతంలో మోదీని దూషించినవన్ని మర్చిపోయినట్లు నటిస్తూ కూర్చోవడమే కాకుండా, సభలో మోదీని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడారు. దేశం మోదీ నాయకత్వంలోనే ముందుకు వెళుతోందని, విశ్వగురు అని తన స్పీచ్ లో ఎక్కువ భాగం ఆయన కటాక్షం కోసమే మాట్లాడారు. మిగిలిన కాసేపు ముఖ్యమంత్రి జగన్ ను దూషించడానికి సమయం కేటాయించారు. జగన్ వల్ల రాష్ట్రానికి ఏదో చాలా నష్టం జరిగిపోయిందని ఎప్పటిమాదిరే భ్రమ కల్పించే యత్నం చేశారు.
తాను జగన్ పై ఏ ఆరోపణలు చేస్తున్నది మోదీకి అర్ధం కావడం కోసం ఇంగ్లీష్ లో కూడా చంద్రబాబు రెండు,మూడు వ్యాక్యాలు చెప్పారు. 2014-19 మధ్య తాను ఫలానా గొప్పపని చేశానని చంద్రబాబు చెప్పుకోలేకపోయారు. అమరావతి గురించి మాత్రం మాట్లాడారు. కాని దానికి కేంద్రం లక్షకోట్ల నిధులుఇవ్వలేదని గతంలో చేసిన విమర్శలను ఆయనప్రస్తావించలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ యధా ప్రకారం తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఏపీలో గంజాయి అని, అమ్మాయిల మిస్సింగ్ అంటూ పిచ్చి లెక్కలు చెప్పి సభికులను విసిగించారు. విశేషం ఏమిటంటే ప్రధాని మోదీ వీరిద్దరూ జగన్ పై చేసిన తిక్క,తిక్క ఆరోపణలను వేటిని పట్టించుకోలేదు. దాంతో వీరికి ఉసూరుమన్నంత పని అయింది. మోదీ ఏదో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడతారని వీరు ఆశించారు. కాని మోదీ ఆ స్థాయికి దిగజారకుండా కాస్త పద్దతిగానే ఉన్నారని చెప్పాలి. మరో మాట ప్రస్తావించాలి. జగన్ కు చెల్లెళ్లే ఓటు వేయవద్దంటున్నారని చంద్రబాబు అన్నారు.
దానికి మాజీ మంత్రి పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అంత దుర్మార్గుడు లేడని , అతనిని ప్రజలు తిరస్కరించాలని స్వయంగా ఆయనకు పిల్లనిచ్చిన మామతో పాటు తమ్ముడు, బావమరిది, తొడల్లుడు, వదిన ..అందరూ ఆయా సందర్భాలలో అదే మాట చెప్పారని గుర్తు చేసి ఎద్దేవా చేశారు. చంద్రబాబు కనీసం తన సూపర్ సిక్స్ గురించి కూడా సభలో చెప్పకపోవడం గమనార్హం.
ఓవరాల్ గా చూస్తే నేతలు ముగ్గురు మోదీ, చంద్రబాబు, పవన్ లు ఒక నిర్దిష్ట ఎజెండా లేకుండా మాట్లాడడంతో సభ అంతా చప్ప, చప్పగా సాగినట్లయింది. బీజేపీ నేత సోము వీర్రాజు ఎన్డీఏ అంటూ ఎక్కువ స్ట్రెస్ ఇవ్వగా, మరో ఇద్దరు నేతలు సత్యకుమార్, సీఎం రమేష్ లు అచ్చం టీడీపీ నేతల మాదిరే మాట్లాడారు. సీఎం రమేష్ అయితే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చాలా అభివృద్ది జరిగిందని చెప్పారు. అంత గొప్పగా చంద్రబాబు, టీడీపీ పాలన సాగితే, ఆ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఆ ఓటమి తర్వాత ఈయన బీజేపీలోకి ఎందుకు దూకారో కూడా చెప్పాలి కదా! వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణ చేసిన సీఎం రమేష్ పై ఆదివారం హిందూ దినపత్రిక ఒక సంచలన కథనాన్ని ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు మతలబు, నలభై కోట్లను రమేష్ వెచ్చించిన వైనం గురించి వార్తను ప్రచురించింది.
సభకు హాజరైన జనం మీద కూడా రకరకాల అంచనాలు ఉన్నాయి. టీడీపీ మీడియా పదిహేను లక్షల మంది వస్తారని తొలుత ఊదరగొట్టాయి. కాని అసలు వచ్చిన జనం అందులో పదోవంతు కూడా ఉంటారో, ఉండరో అన్నట్లు సభ జరిగింది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి కూడా వేలాది కుర్చీలు ఖాళీగా కనిపించాయి.ఈ నేపధ్యంలోనే టీడీపీ మీడియా అప్పుడే ఒక కల్పిత గాధను ప్రచారం చేసింది. ఆర్టిసీ బస్ లను అడిగినన్నీ అధికారులు ఇవ్వలేదని కొత్త రాగం తీసింది.ఇంకా నయం.. జనాన్ని తెచ్చే బాధ్యత కూడా ఆర్టిసి మీదో, లేక వైఎస్సార్‌సీపీ మీదో పెట్టలేదు!. సిద్దం పేరుతో వైఎస్సార్‌సీపీ నలభై రోజుల్లో నాలుగు అతి భారీ సభలు నిర్వహించి రికార్డు సృష్టిస్తే మూడు పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఒక సభను కూడా విజయవంతం చేసుకోలేకపోయాయి. దీనిని బట్టే ప్రజలలో ఈ పార్టీల కూటమిపట్ల వైముఖ్యత ఏర్పడిందన్న భావన కలుగుతుంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment