నల్గొండ రూరల్ : 2024లో జరిగే ఎన్నికల్లో కేసీఆరే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని, సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్‌ఎస్ పార్టీ కోసం దేశమంతా ఎదురుచూస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఆరెగూడెం ఇన్ చార్జ్ గా నియమితులైన ఆయన శుక్రవారం ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారని, కానీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఇక్కడి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఆ రాష్ట్రాల సీఎంలకు దమ్ము సరిపోవడంలేదన్నారు. సీఎం కేసీఆర్ దమ్మున్న లీడరని, బీజేపీ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.22కోట్లకు మునుగోడు నియోజకవర్గాన్ని గుత్తకు ఇచ్చిందన్నారు. ప్రచారంలో ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరెగూడెంలో వృద్ధులతో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి
బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు రావు
మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రావని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తాను ఇన్ చార్జ్ గా నియమితులైన మండలంలోని ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి, రెడ్డిబావి, సైదాబాద్ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆరెగూడెంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వృద్ధులతో, రైతులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ పథకాలను గూర్చి వివరించి ఓట్లను అభ్యర్థించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మూడున్నరేళ్లలో ఏనాడూ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదన్నారు. దమ్ముంటే కేంద్రం నుంచి రూ.100కోట్లు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి తెచ్చి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పంతంగి–గుండ్లబావి రోడ్డు వేయించాలని మంత్రి జగదీశ్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు మునగాల ప్రభాకర్‌రెడ్డి, బచ్చ రామకృష్ణ, నాయకులు జక్క వెంకట్‌రెడ్డి, మంద సంజీవరెడ్డి, జాల మల్లేశ్‌యాదవ్, నందగిరి శ్యామ్, మునగాల దామోదర్‌రెడ్డి, బచ్చ మల్లేశం, పల్లె లింగస్వామి, దుర్గం రాజు, కొలను ఆగిరెడ్డి పాలొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment